తెలంగాణ మహిళా శక్తికి ‘పట్టణ’ సంకెళ్లు!
భారతదేశపు ఐటీ, ఫార్మా రంగాలకు తెలంగాణ తలమానికంగా నిలుస్తోంది. ఆర్థిక ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అయితే, ఈ మెరుపుల వెనుక ఓ చేదు నిజం దాగి ఉంది. ఈ విషయాన్ని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) త్రైమాసిక నివేదిక బట్టబయలు చేసింది. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగ రేటు ఏకంగా 18.5 శాతానికి చేరుకుంది. జాతీయ స్థాయిలో జమ్మూ కాశ్మీర్ (31.3%) తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు కేవలం 8.8 శాతంగా ఉంటే, తెలంగాణలో అది రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం రాష్ట్ర పట్టణ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
ఈ గణాంకాలను మరింత లోతుగా విశ్లేషిస్తే, సమస్య కేవలం ఉద్యోగాలు లేకపోవడం మాత్రమే కాదని అర్థమవుతోంది. అసలు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యమే అత్యంత తక్కువగా ఉందని స్పష్టమవుతోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం, తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన ప్రతి వంద మంది మహిళల్లో కేవలం 32 మంది మాత్రమే శ్రామిక శక్తిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో వాస్తవంగా ఉపాధి పొందుతున్న వారి నిష్పత్తి కేవలం 26 శాతం మాత్రమే. మిగిలిన 6 శాతం మంది పని చేయడానికి సిద్ధంగా ఉండి, అవకాశాల కోసం అన్వేషిస్తూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు మాత్రమే ఉపాధి వేటలో ఉన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరం ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ తెలంగాణలో 56 శాతం మంది మహిళలు శ్రామిక శక్తిలో భాగస్వాములుగా ఉండగా, పట్టణాల్లో అది 32 శాతానికి పడిపోయింది. 2017-18, 2023-24 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళల వాటా 54.8 శాతం నుంచి 61.9 శాతానికి పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత 2020-21లో గ్రామీణ మహిళల ఉపాధి వాటా 45.1 శాతానికి చేరుకోగా, పట్టణ ప్రాంతాల్లో అది 2019-20లో ఉన్న 20.5 శాతం నుంచి 19.7 శాతానికి క్షీణించింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ ఉపాధి పెరుగుదల ఆర్థిక స్వావలంబన కంటే, కుటుంబ అవసరాల కోసం చేసే ‘ఒత్తిడితో కూడిన పని’ అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఝార్ఖండ్ (17%), హిమాచల్ ప్రదేశ్ (14.5%), ఉత్తరాఖండ్ (14.1%) కంటే తెలంగాణలో ఎక్కువగా పట్టణ మహిళా నిరుద్యోగం నమోదు కావడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది నైపుణ్యాల అంతరం. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉపాధి అవకాశాలు అత్యంత వేగంగా సాంకేతికత వైపు మళ్లుతున్నాయి. ఆధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా మహిళల్లో సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం వారిని ఉద్యోగ వేటలో వెనక్కి నెడుతోందని నిపుణులు చెప్తున్నారు. రెండోది సామాజిక, మౌలిక సదుపాయాల అడ్డంకులు. నగరాల్లో సుదీర్ఘ ప్రయాణ సమయాలు, పని ప్రదేశాల్లో భద్రత పట్ల ఆందోళనలు, ఇంటి వద్ద పిల్లలు, వృద్ధుల సంరక్షణ బాధ్యతలు మహిళలను శ్రామిక శక్తికి దూరం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఒకవైపు అతి తక్కువ మంది మహిళలు ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెట్టడం, మరోవైపు అలా వచ్చిన వారికి కూడా సరైన ఉపాధి లభించకపోవడం తెలంగాణ ఆర్థిక వృద్ధికి పెను సవాలుగా మారింది. కేవలం ఐటీ, మౌలిక సదుపాయాల కల్పనతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు. నగర ప్రణాళికల్లో మహిళల భద్రతకు పెద్దపీట వేయడం, సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు తక్షణ అవసరం. వీటితో పాటు, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తేనే, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో అర్థభాగం సగర్వంగా అడుగులు వేయగలదు.







