డల్లాస్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దీపావళి వేడుకలు..
డల్లాస్(అలెన్)లోని రాధాకృష్ణ దేవాలయంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ ప్రాంతం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, సందర్శకులు ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయని, అందరూ కలిసి ఆనందంగా బాణసంచా కాల్చారు. అలెన్ మేయర్ క్రిస్ ఎ.షుల్మీస్టర్(Chris A. Schulmeister)తో పాటు పలువురు నగర అధికారులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దీపావళి సంప్రదాయాలను, సమాజ ఐక్యతను పెంపొందించడంలో ఆలయం చేస్తున్న కృషిని గుర్తించి, అలెన్ నగరం నవంబర్ 5-7, 2026 తేదీలను అధికారికంగా ‘దీపావళి-ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ వీక్’ (Diwali-Festival of Lights Week) గా ప్రకటించింది.
బాణసంచా కాల్పులతో పాటు భజన్ క్లబ్బింగ్ కచేరీ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడికి అంకితం చేసిన భజన పాటలకు భక్తులు ఉత్సాహంగా పాడుతూ నృత్యం చేశారు. ప్రదర్శించిన ‘రామలీల’ నాటకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముని పవిత్ర గాథ తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ‘గోవర్ధన అన్నకూట్ పూజ’, ‘గుజరాతీ నూతన సంవత్సరం’ వేడుకలు ఈ ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి. బృందావన వాసులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘట్టాన్ని ప్రతిబింబించేలా ఆలయంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన గోవర్ధన అలంకార ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.







