ట్రంప్‌తో చెడిందా? లేక ఫ్యామిలీ కోసమా? 2028 అధ్యక్ష రేసు నుంచి JD వాన్స్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు?
అమెరికా రాజకీయాలను గమనిస్తున్నవారికి JD వాన్స్ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఆయన రాజకీయ ఆలోచనలకు వారసుడిగా వాన్స్ ఎదుగుతారని చాలామంది భావించారు. 2028లో ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపించాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారినట్లు ఉంది. అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న వాన్స్.. అసలు ఆ రేసులోకి వెళ్లాలా వద్దా అనే విషయంపైనే ఆలోచిస్తున్నారట. అసలేం జరిగింది?
ట్రంప్‌తో కలిసి నడిచిన వాన్స్.. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఎందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు?
వాన్స్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న అంశాల్లో ఇరాన్ యుద్ధం చాలా ముఖ్యమైనది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్యను సమర్థిస్తుండగా, ఈ యుద్ధం వల్ల అమెరికాకు రాజకీయంగా నష్టం జరుగుతోందని వాన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 3న జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఎదుర్కొన్న పరాజయానికి ఈ యుద్ధం కూడా ఒక కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్టులో యుద్ధాన్ని ముగించాలని, అమెరికన్ల రోజువారీ ఆర్థిక సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని, విదేశాంగ విధానాన్ని మరోసారి సమీక్షించాలని సూచించారు.
అయితే ట్రంప్ మాత్రం… ఇరాన్‌తో ఒప్పందం కుదిర్చే ప్రయత్నాలను పక్కనపెట్టి, డెమొక్రాట్ల పాలనలో ఉన్న నగరాలు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోసాలపై దృష్టి పెట్టాలని ట్రంప్ వాన్స్‌కు సూచించినట్లు సమాచారం.
నలుగురు పిల్లల తండ్రిగా మరో ఆలోచన.. ?
రాజకీయాల్లో ఎంత పెద్ద అవకాశం వచ్చినా వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. JD వాన్స్ విషయంలో ఇప్పుడు ఈ అంశం కూడా చర్చకు వస్తోంది. ఆయన భార్య ఉషా వాన్స్ జూలైలో నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా, కొత్తగా మరో చిన్నారి రావడంతో కుటుంబ బాధ్యతలు మరింత పెరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉండటంతో వాన్స్ కుటుంబం ఎక్కడికి వెళ్లినా భద్రతా సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ తప్పడం లేదు. తన పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో పెరగడం పట్ల వాన్స్‌కు కొన్ని సందేహాలు ఉన్నట్లు CNN పేర్కొంది.
మరో ప్రక్క అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడమంటే కేవలం ప్రచారం చేయడం, ఓట్లు అడగడం మాత్రమే కాదు. ఏళ్ల తరబడి రాజకీయ ఒత్తిడి, మీడియా నిఘా, భద్రతా ఏర్పాట్లు, కుటుంబానికి దూరమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ వాన్స్ బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పైగా ఆయన వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు కాకపోతే మరోసారి అవకాశం వస్తుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట. అందుకే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే తొందరపడి అధ్యక్ష రేసులోకి దిగాల్సిన అవసరం లేదని కొందరు సలహా ఇస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
వాన్స్ వెనక్కి తగ్గితే.. రేసులోకి మార్కో రూబియో వస్తారా?
JD వాన్స్ పోటీపై సందేహాలు మొదలవడంతో రిపబ్లికన్ పార్టీలో మరో చర్చ కూడా ఊపందుకుంది. 2028లో ట్రంప్ తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడగల నేతలు ఎవరనే ప్రశ్నకు ఇప్పుడు మార్కో రూబియో, రాన్ డిసాంటిస్, టెడ్ క్రూజ్, బ్రియాన్ కెంప్ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేరు వాన్స్‌కు గట్టి పోటీదారుగా ప్రచారంలోకి వస్తోంది.
అయితే రూబియో మాత్రం వాన్స్‌కు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. వాన్స్ పోటీ చేస్తే తాను ఆయనకు మద్దతు ఇస్తానని ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వాన్స్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఏదైమైనా…
ఒకప్పుడు ట్రంప్ తర్వాతి నాయకుడిగా కనిపించిన JD వాన్స్.. ఇప్పుడు అధ్యక్ష పదవి కంటే ఆ పదవి కోసం చేయాల్సిన రాజకీయ పోరాటం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. 2028లో అమెరికా అధ్యక్ష రేసులో వాన్స్ ఉంటారా? లేక ట్రంప్ రాజకీయ వారసత్వం కోసం మార్కో రూబియో వంటి మరో నేతకు దారి ఇచ్చేస్తారా? అనేది కాలం తేల్చాల్సిన విషయం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







