ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్స్ (FICA) దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌లో ఉన్న లాండర్హేవన్లో ఎన్నారైలందర్నీ కలిపి ఘనంగా ఈ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఓ పరిచయ కార్యక్రమం కూడా జరిగింది.
ఈ సందర్భంగా సంప్రదాయ దీపాలను వెలిగించడంతో ఈ కార్యక్రమం అధికారికగా ప్రారంభమైంది. “ఒకే భారతదేశం” అనే ఇతివృత్తం ఆధారంగా ప్రదర్శనలను చేశారు. ఈ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 40 మంది ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు ఒహాయో స్టేట్ సెనేటర్ కేసీ వెయిన్‌స్టీన్; మేఫీల్డ్ హైట్స్ మేయర్ డయాన్ ఎం. స్నైడర్; సోలన్ మేయర్ ఎడ్వర్డ్ క్రాస్; షేకర్ హైట్స్ మేయర్ డేవిడ్ ఇ. వీస్; మరియు కుయాహోగా కౌంటీ పబ్లిక్ లైబ్రరీ సీఈఓ జమార్ ఓ. రామింగ్తో సహా పలువురు స్థానిక మరియు కమ్యూనిటీ నాయకులు హాజరయ్యారు. ఒహాయో స్టేట్ మాజీ సెనేటర్ నీరజ్ అంటానీ, మార్గరెట్ డబ్ల్యూ. వాంగ్ అండ్ అసోసియేట్స్ కు చెందిన మార్గరెట్ వాంగ్, మరియు లేక్‌ల్యాండ్ కమ్యూనిటీ కాలేజ్ అధ్యక్షుడు సునీల్ అహుజా కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు వివిధ రంగాలలో, వార్తా పత్రిక కమిటీలతో అనుబంధం వున్న సభ్యులు చేస్తున్న సేవలను గుర్తించి, గౌరవించింది. సిన్సినాటికి చెందిన ‘జూమ్ 513’ అనే బ్యాండ్ సంగీత ప్రదర్శన కూడా జరిగింది. ఆ తర్వాత విందు సమయంలో బాలీవుడ్ పాటలను ఆలపించారు. భోజనం మరియు బాణాసంచా కాల్చడంతో వేడుకలు ముగిశాయి.







