అంతరిక్ష రంగంలో నూతన గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేష్
స్పేస్ ఎకానమీ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం
విడిభాగాల తయారీ సంస్థలను ఎకోసిస్టమ్ లోకి తీసుకురావడమే లక్ష్యం
డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్, స్పీడ్ ఏపీ ప్రత్యేకతలు
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక చర్చలో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం: అంతరిక్ష రంగంలో నూతన గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ సదస్సుల్లో భాగంగా రెండో రోజు ‘కక్ష్య నుంచి అవకాశాల దిశగా: భారతదేశ నూతన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ’ (From Orbit to Opportunity: India’s New Space Economy) అనే అంశంపై జరిగిన ప్రత్యేక చర్చలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సీఈవో, సీటీవో రోహన్ గణపతి వ్యవహరించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా నియంత్రించే అంతరిక్ష రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటి అని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను ఎలా అభివృద్ధి చేస్తున్నామో పరిశీలిస్తే, ముందుగా ఒక రంగాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, భాగస్వాములను గుర్తించడం, క్రమపద్ధతిలో పెట్టుబడులను ఆకర్షించడం, ఆయా రంగాలకు చెందిన కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం మా విధానం. దీనినే వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటారు. వర్టికల్ ఇంటిగ్రేషన్ ద్వారా స్కైరూట్ (Skyroot) వంటి అంతరిక్ష సంస్థలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసే ఉపకరణాల తయారీ సంస్థలను ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకురావడం లక్ష్యం. ఈ సంస్థలు తయారు చేసే విడిభాగాలు, ఉపవ్యవస్థల సహకారంతో స్కైరూట్ వంటి కంపెనీలు తమ రాకెట్ వాహనాలను రూపొందించి అంతరిక్షంలోకి ప్రయోగించగలుగుతాయి.
పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి
హారిజాంటల్ ఇంటిగ్రేషన్ విషయానికి వస్తే.. ఇక్కడ విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయడం కీలకం. మన అకడమిక్ కరిక్యులమ్ ను ఆధునీకరించడం, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేయడం ఇందులో భాగం. ఇప్పటికే ఇంధన రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి ఐఐటీ తిరుపతితో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాంతంలోని పారిశ్రామిక క్లస్టర్‌కు అనేక ఇంగాట్, సోలార్, వేఫర్, సెల్ తయారీ సంస్థలు వచ్చాయి.
స్పేస్ సిటీ అభివృద్ధికి అవసరమైన పాలసీని రూపొందించాలి
ప్రస్తుతం దేశానికి అవసరమైనది స్పేస్ సిటీ అభివృద్ధికి అనుసంధానమైన సమగ్ర విధానం. అంతరిక్ష పరిశ్రమల ఏర్పాటు, వాటికి సంబంధించిన సంస్థలన్నింటినీ ఒకే వ్యవస్థలో అనుసంధానించే విధానాన్ని భారతదేశం ఇప్పుడు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రాష్ట్రాలు దూకుడుగా ముందుకు వెళ్లాలి. స్కైరూట్ వంటి కంపెనీలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రాలకు తీసుకురావాలి. అనంతరం ఆ రంగానికి సంబంధించిన అన్ని సంస్థలు, విడిభాగాల తయారీదారులు, సరఫరాదారులను క్రమపద్ధతిలో గుర్తించాలి. వీరిలో అత్యధికులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమదారులే. ఈరోజు నేను ఒక ఎంఎస్ఎంఈ సంస్థను కలిశాను. వారు రాకెట్‌కు అవసరమైన షీల్డ్‌ను తయారు చేస్తున్నారు. వారు ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్లో కూడా పాల్గొన్నారు. ఇలాంటి సంస్థలన్నింటినీ ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకురావడమే అసలైన మార్పును తీసుకొస్తుంది.
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది
ఏపీ ఎన్డీయే పాలిత రాష్ట్రం. రాజకీయంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో మాకు భాగస్వామ్యం ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో మా వంతు పాత్ర పోషించే అవకాశం మాకు ఉంది. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, ఏపీలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు అందుకోలేని వేగంతో ముందుకు వెళ్లగలిగే ఇద్దరు గొప్ప నాయకులు మనకు ఉన్నారు. మొత్తం అంతరిక్ష ఎకోసిస్టమ్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పోషించగలిగే పాత్ర ఇదే.
స్పీడ్ ఏపీ ప్రత్యేకత
ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0, ప్రతిపాదిత తిరుపతి స్పేస్ సిటీ వంటి కార్యక్రమాల ద్వారా అంతరిక్ష, ఏరోస్పేస్ పరిశ్రమలకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ఏ విధమైన గుర్తింపు పొందాలని మీరు కోరుకుంటున్నారు, అలాగే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రపంచస్థాయి అంతరిక్ష సంస్థలు ఏపీని ఎంచుకునేలా చేసే ఒక ప్రధాన ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత స్పీడ్. మేం పనులను చాలా వేగంగా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువత అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలతో పోటీపడటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన బలం మా పని వేగమే. ఇది మొదటి అంశం.
ప్రయోగ వ్యయాన్ని తగ్గించాలి
పాశ్చాత్య దేశాల్లో, అలాగే చైనాలో జరుగుతున్న పరిణామాలను మీరందరూ గమనిస్తూనే ఉంటారు. వారు అంతరిక్ష ప్రయోగాల ఖర్చును ఏ విధంగా తగ్గించగలుగుతున్నారు? ఈ అంశంపై మనమందరం కలిసి ఆలోచించాలి. సమష్టిగా ఒక వ్యూహాన్ని రూపొందించాలి. అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రైవేట్ రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా కలిసి పనిచేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అంతరిక్ష రంగంలో అసలైన ప్రత్యేకత ఇదే. ఈ రంగం మధ్యకాలిక, దీర్ఘకాలిక అభివృద్ధికి, సుస్థిరతకు ఇది ఎంతో కీలకమని నేను విశ్వసిస్తున్నాను.
స్పేస్ ఎకానమీ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయాలి
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ చుట్టూ ఒక సమగ్ర ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఈ రంగంలో అవకాశాలను అర్థం చేసుకునే ప్రారంభ దశలోనే ఉన్నాం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్భుతమైన స్టార్టప్ సంస్థలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ రంగంలో మనం ఒక సానుకూల ఉత్సాహాన్ని, ఆసక్తిని సృష్టించగలిగామని నేను భావిస్తున్నాను. కేవలం ప్రోత్సాహకాలతో ఒక ఎకోసిస్టమ్‌ను నిర్మించలేం. ఇందుకు విధానపరమైన ఆలోచనలు, నాయకత్వం కలిగిన వారందరినీ ఒకచోట చేర్చడం అవసరం. పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావాలి. విద్యాసంస్థలను భాగస్వాములుగా చేయాలి. పరిశ్రమలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కలిసినప్పుడే ఒక బలమైన, అభివృద్ధి చెందుతున్న ఎకోసిస్టమ్‌ను సృష్టించగలం. ఆంధ్రప్రదేశ్‌లో మనం చూడబోయేది ఇదే. గౌరవ సీఎం గారు ఒక లక్ష్యాన్ని కలగంటే.. దాన్ని సాకారం చేస్తారు. ఆయన కలలను నిజం చేయడం మా బాధ్యత అని మంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇస్రో ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎయిర్ కమోడోర్ ప్రశాంతి బి.నాయర్, అగ్నికుల్ కో-ఫౌండర్, సీఈవో శ్రీనాథ్ రవిచంద్రన్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కే.ఎన్.సత్యనారాయణ, గెలాక్స్ఐ ఫౌండర్, సీఈవో సుయాష్ సింగ్, స్కైరూట్ ఏరోస్పేస్ కో-ఫౌండర్, సీటీవో డాకా నాగ భరత్ పాల్గొన్నారు.







