ట్రంప్‌కు నిద్రలేని రాత్రులు? తెల్లవారుజామునే సోషల్ మీడియాలో ఫైర్.. అసలు భయం ఇదేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో డెమొక్రాట్లకు పట్టు పెరగడంతో వైట్‌హౌస్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం, ఆయన కుటుంబ సభ్యులు, కీలక క్యాబినెట్ మంత్రులపై విచారణలు జరిపిస్తామని డెమొక్రాట్లు ప్రకటించడం అధ్యక్షుడికి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 5:50 గంటలకే ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక Truth Socialలో ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
డెమొక్రాట్లపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు
డెమొక్రాటిక్ పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ ట్రంప్ వరుస పోస్టులు పెట్టారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరులైన రాజకీయ నాయకుల బృందం డెమొక్రాట్లలో ఉందంటూ ఆరోపించారు. ముఖ్యంగా మిన్నెసోటా, కాలిఫోర్నియా వంటి డెమొక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో భారీ అవినీతి జరిగిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తన మొదటి పదవీకాలం నుంచి ఇప్పటివరకు తాను అధ్యక్షుడిగా జీతం తీసుకోలేదని కూడా ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. తాను అవినీతికి పూర్తిగా వ్యతిరేకమని, డెమొక్రాట్లు మాత్రం అవినీతిపరులని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్లు గట్టిగా పోరాడకపోతే దేశం ఉనికే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
ట్రంప్ కుటుంబం, క్యాబినెట్‌పై విచారణలకు సిద్ధమవుతున్న డెమొక్రాట్లు
ఈ వివాదానికి అసలు కారణం కాంగ్రెస్‌లో మారుతున్న రాజకీయ బలాబలాలే. మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత జనవరిలో హౌస్, సెనేట్లపై నియంత్రణ సాధించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంపై విచారణలు ప్రారంభిస్తామని డెమొక్రాట్లు ప్రకటించారు.
ట్రంప్ వ్యక్తిగత వ్యవహారాలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ప్రభుత్వంలోని కీలక మంత్రుల నిర్ణయాలను కూడా పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కుటుంబం భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందిందనే ఆరోపణలు కూడా ఈ విచారణల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.
జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్ల విడుదల వ్యవహారాన్ని ప్రభుత్వం ఎలా నిర్వహించింది? వైట్‌హౌస్‌లో నిర్మిస్తున్న భారీ బాల్రూమ్ ప్రాజెక్టు వెనుక ఉన్న ఖర్చులు, నిర్ణయాలు ఏమిటి? ఇతర నిర్మాణ పనుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా? ఇమ్మిగ్రేషన్ అమలులో ICE అనుసరిస్తున్న కఠినమైన విధానాల్లో నిబంధనలు ఉల్లంఘించారా? వంటి అంశాలపై డెమొక్రాట్లు దృష్టి పెట్టే అవకాశముంది.
‘Lawyer Up’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమొక్రాట్ల హెచ్చరిక
ఈ పరిణామాల మధ్య హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డెమొక్రటిక్ ఎంపీ రాబర్ట్ గార్సియా చేసిన రెండు పదాల వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ‘Lawyer Up’ అని హెచ్చరించారు. అంటే న్యాయవాదులను సిద్ధం చేసుకోండన్నది ఆయన సందేశం.
ట్రంప్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు తమకు ఉన్న సబ్పీనా అధికారాలను ఉపయోగిస్తామని డెమొక్రాట్లు సంకేతాలిచ్చారు. అవసరమైతే ట్రంప్ కుటుంబ సభ్యులు, క్యాబినెట్ అధికారులు, ఇతర ప్రభుత్వ ప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంటుంది.
పన్నుల వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన ట్రంప్
ఉదయం 6:28 గంటలకు ట్రంప్ మరో పోస్టుతో డెమొక్రాట్లపై విరుచుకుపడ్డారు. తన మొదటి పదవీకాలానికి సంబంధించిన పన్నుల రికార్డులను డెమొక్రాట్లు బయటపెట్టడాన్ని ప్రస్తావించారు.
2015 నుంచి 2020 మధ్య తాను చెల్లించిన ఫెడరల్ ఆదాయపు పన్నుల వివరాలను బయటకు తీసుకొచ్చేందుకు డెమొక్రాట్లు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారని ట్రంప్ ఆరోపించారు. తనపై తప్పులు నిరూపించేందుకు అత్యుత్తమ అకౌంటెంట్లను నియమించారని, ఏడాది పాటు పరిశీలించిన తర్వాత కూడా తాను పన్నులు సక్రమంగానే చెల్లించానని తేలిందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈసారి కూడా తప్పుడు ఆరోపణలతో రిపబ్లికన్లను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యూహాల ద్వారానే డెమొక్రాట్లు విజయం సాధించారని ఆరోపించారు.
డెమొక్రాట్లను బెదిరించే ప్రయత్నంలో వైట్‌హౌస్?
మరోవైపు డెమొక్రాట్ల విచారణల ప్రయత్నాలను అడ్డుకునేందుకు వైట్‌హౌస్ కూడా రంగంలోకి దిగింది. వైట్‌హౌస్ కౌన్సెల్ విల్ షార్ఫ్.. రాబర్ట్ గార్సియాకు ఒక లేఖ రాశారు.
ప్రభుత్వ అధికారులపై రాజకీయ కక్షతో విచారణలు చేపట్టడం, వారిని భయపెట్టే ఉద్దేశంతో సబ్పీనాలు జారీ చేయడం చట్టవిరుద్ధం కావచ్చని ఆ లేఖలో హెచ్చరించారు. రాజ్యాంగ పరిమితులను దాటి విచారణలు జరిపితే, సంబంధిత చర్యలపై కూడా దర్యాప్తు అవసరం రావచ్చని పేర్కొన్నారు.
అయితే ఈ లేఖపై రాబర్ట్ గార్సియా తీవ్రంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం ఏదో దాస్తోందనే అనుమానాన్ని ఈ లేఖ మరింత పెంచుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అనేది ప్రభుత్వంలోని మరో సమాన అధికార వ్యవస్థ అని, వైట్‌హౌస్ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.
ట్రంప్‌కు ముందున్న రెండేళ్లు ఎలా ఉండబోతున్నాయి?
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడికి వైట్‌హౌస్‌లో అధికారం ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌లో ప్రత్యర్థి పార్టీకి బలం పెరిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, అధికారుల నుంచి సమాచారం సేకరణ, సబ్పీనా నోటీసులు.. ఇలా అనేక మార్గాల్లో అధ్యక్షుడిపై రాజకీయ ఒత్తిడి పెంచవచ్చు.
అందుకే ట్రంప్ రెండో పదవీకాలంలో మిగిలిన రెండేళ్లు కీలకంగా మారనున్నాయి. తన ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను ఎదుర్కోవడంతో పాటు, కాంగ్రెస్ విచారణలను కూడా ఆయన ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గార్సియా మాత్రం తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. ప్రజలను మోసం చేసినా, అమెరికన్లను దోచుకున్నా విచారణ తప్పదని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థల అధిపతులైనా, ప్రభుత్వ అధికారులైనా న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







