సజ్జనార్ బదిలీ వెనుక అసలు కథేంటి?
తెలంగాణ పోలీస్ శాఖలో జరిగిన భారీ ప్రక్షాళన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బదిలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 సెప్టెంబర్ 30న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. కేవలం 13 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి రావడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఆయన్ను అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర, పౌర రక్షణ విభాగం డీజీగా మరియు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది. సజ్జనార్ స్థానంలో 1995 బ్యాచ్ సీనియర్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను కొత్త కొత్వాల్‌గా నియమించింది.
సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగంలో బదిలీలు సర్వసాధారణం. కానీ, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతూ, క్షేత్రస్థాయిలో దూకుడుగా పనిచేస్తున్న అధికారిని ఏడాది తిరక్కముందే అప్రాధాన్య పోస్టుగా భావించే విభాగానికి పంపడం వెనుక లోతైన కారణాలు లేకపోలేదని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఆకస్మిక మార్పు వెనుక ప్రధానంగా మూడు కోణాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
సజ్జనార్ ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ చూపిస్తారు. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. ‘హెచ్-న్యూ’ విభాగాన్ని బలోపేతం చేసి అంతర్రాష్ట్ర ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అంతకుమించి, నగరంలో పేరుకుపోయిన ఆహార కల్తీ ముఠాలపై ఆయన చేపట్టిన ఆకస్మిక దాడులు బడా వ్యాపార వర్గాల్లో కలకలం రేపాయి. ఈ కఠిన చర్యలు కొందరికి మింగుడుపడలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరానికి సీపీగా ఉండటమంటే కేవలం శాంతిభద్రతలే కాదు, ప్రభుత్వ పెద్దలతో నిరంతర సమన్వయం కూడా అత్యంత కీలకం. ఇటీవలి కాలంలో కొన్ని కీలక అంశాలు, శాంతిభద్రతల నిర్వహణ విషయంలో ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలకు, సజ్జనార్‌కు మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వతంత్ర నిర్ణయాలతో దూసుకెళ్లే ఆయన శైలి, అధికార యంత్రాంగంలోని కొందరికి అసౌకర్యం కలిగించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే సజ్జనార్ బదిలీ పూర్తిగా పరిపాలనాపరమైన మార్పుగానే ప్రభుత్వం చెప్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపట్టబోయే కీలక పాలనా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, అలాగే కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ బాధ్యతలకు తీసుకువచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
1996 బ్యాచ్‌కు చెందిన సజ్జనార్ కెరీర్ ఆద్యంతం సంచలనాలే. వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ (2008) నుంచి సైబరాబాద్ సీపీగా దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ (2019) వరకు, ఆ తర్వాత నష్టాల్లో ఉన్న టీజీఎస్ఆర్టీసీని ఎండీగా లాభాల బాట పట్టించే ప్రయత్నం వరకు ఆయనది ప్రత్యేక శైలి. హైదరాబాద్ సీపీగా ‘డే విత్ ద సీపీ’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోలీసుల పట్ల భయం పోగొట్టడం, మహిళల రక్షణ కోసం ‘స్పందన’ వాహనాలు, షీ నేత్ర బృందాలను పరుగులు పెట్టించడం, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ వ్యవస్థతో ట్రాఫిక్ చిక్కులు తప్పించడం వంటివి నగరవాసులకు బాగా చేరువయ్యాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఆయన చేసిన భావోద్వేగ పోస్ట్, ప్రజల ఆదరణను మరువలేనని చెప్పడం చూస్తేనే నగరంతో ఆయనకున్న అనుబంధం అర్థమవుతుంది.
ప్రభుత్వానికి అధికారులను బదిలీ చేసే పూర్తి హక్కు ఉంటుంది. కానీ డ్రగ్స్ రహిత హైదరాబాద్, కల్తీ లేని ఆహారం, మహిళల భద్రత కోసం సజ్జనార్ వేసిన బలమైన పునాదులు ఇప్పుడు ఏమవుతాయి? కొత్త సీపీ మహేశ్ భగవత్ ఆ సంస్కరణలను అదే వేగంతో ముందుకు తీసుకెళ్తారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆ దాడులకు బ్రేక్ పడుతుందా? అన్నదే సామాన్య హైదరాబాదీని వేధిస్తున్న అసలు ప్రశ్న. మంచి పనిచేస్తున్న అధికారిని పక్కకు తప్పించినప్పుడు, ఆ నిర్ణయం వెనుక ఉన్న హేతుబద్ధతను ప్రజలకు వివరించాల్సిన నైతిక బాధ్యత పాలకులపై ఎప్పుడూ ఉంటుంది.







