ఎల్‌నినో ప్రభావం ఎక్కడ ఎక్కువ? ఏ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది ?
ప్రపంచంలోని ఒక మూలన సముద్రం వేడెక్కుతోంది. కానీ దాని సెగ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకూ తగులుతోంది. ఎక్కడో కరువు కాటేస్తుంటే.. మరెక్కడో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే భరించలేనంత వేడి, ఉక్కపోత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వెనుక ఉన్నది ఎల్‌నినో. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రపంచ వాతావరణాన్ని కొత్త మలుపు తిప్పుతున్నాయి. రాబోయే నెలల్లో ఈ ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి. మరి ఈసారి ఎల్‌నినో ప్రభావం ఏయే దేశాలపై ఎక్కువగా ఉండబోతోంది? ఎక్కడ వేడి, ఎక్కడ కరువు, ఎక్కడ వరదలు ముంచుకొస్తాయి?
165 రోజులుగా రికార్డు స్థాయి వేడి!
ఈ ఏడాది వేసవిలో ప్రారంభమైన ఎల్‌నినో ఇప్పుడు అసాధారణ తీవ్రతకు చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వరుసగా 165 రోజుల పాటు రికార్డు స్థాయిలో కొనసాగాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 3.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. 2015 నవంబర్‌లో నమోదైన గత రికార్డును కూడా ఈసారి అధిగమించాయి.
నవంబర్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. డిసెంబర్ లేదా జనవరిలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సగటున 4.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. 1850 నుంచి నమోదైన చారిత్రక వాతావరణ రికార్డులతో పోలిస్తే ఇది అత్యంత అసాధారణ స్థాయి.
సముద్రంలో భారీగా పేరుకుపోయిన వెచ్చని నీటి కారణంగా ఈ ఎల్‌నినో ప్రభావం 2027 ప్రథమార్థం వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అసలు ఎల్‌నినో ప్రపంచ వాతావరణాన్ని ఎలా మార్చేస్తుంది?
ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య భూమధ్యరేఖ ప్రాంతాల్లో సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కే సహజ ప్రక్రియ. సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి ఇది ఏర్పడుతుంది.
సముద్ర జలాలు వేడెక్కినప్పుడు అక్కడి మేఘాలు, ఉరుములు, వర్షాల ఏర్పాటులో మార్పులు వస్తాయి. దీంతో వాతావరణంలోని పై పొరల్లో వీచే జెట్‌స్ట్రీమ్ గాలుల వేగం, దిశ కూడా మారుతాయి. ఈ గాలులే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తుపానులు, వర్షాలు, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి.
అంటే పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన వేడి అక్కడికే పరిమితం కాదు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను మార్చగలదు.
భారత్‌తో పాటు ఏయే ప్రాంతాల్లో రికార్డు వేడి?
తాజా అంచనాల ప్రకారం నవంబర్ నుంచి జనవరి మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 270 కోట్ల మంది ప్రజలు అసాధారణ స్థాయి వేడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక ప్రాంతంలో ఆ కాలానికి సంబంధించి గతంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల టాప్ 5 శాతంలోకి వెళ్లే పరిస్థితులకు కనీసం 10 శాతం అవకాశం ఉందని అంచనా. ఇది సాధారణ ప్రమాదంతో పోలిస్తే రెట్టింపు.
అధిక ఉష్ణోగ్రతల ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి:
అమెరికాలోని ఉత్తర ప్రాంతాలు, పశ్చిమ తీరం.
కరేబియన్ దీవులు, మధ్య అమెరికా.
దక్షిణ అమెరికాలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు.
పశ్చిమ యూరప్, ఆఫ్రికాలోని విస్తారమైన ప్రాంతాలు.
మధ్యప్రాచ్యం, దక్షిణ భారతదేశం.
ఇండోనేషియా, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలు.
ఆస్ట్రేలియాలోని పశ్చిమ, తూర్పు తీర ప్రాంతాలు.
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ దీవులు.
ముఖ్యంగా దక్షిణ భారతదేశం కూడా అసాధారణ వేడి నమోదయ్యే అవకాశమున్న ప్రాంతాల జాబితాలో ఉండటం గమనార్హం. అయితే ఇది నిర్దిష్ట ప్రాంతాల్లో తప్పనిసరిగా వేడి తరంగాలు వస్తాయని చెప్పే అంచనా కాదు. సాధారణ వాతావరణంతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మాత్రమే సూచిస్తోంది.
ఎక్కడ కరువు.. ఎక్కడ భారీ వర్షాలు?
ఎల్‌నినో కారణంగా వాతావరణంలోని అధిక, అల్ప పీడన వ్యవస్థల స్థానాలు మారుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవి మరింత బలపడటంతో వర్షాలు తగ్గిపోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అసాధారణంగా పెరగవచ్చు.
జనవరి వరకు సుమారు 35 కోట్ల మంది ప్రజలు సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరోవైపు 110 కోట్ల మంది ప్రజలు అధిక వర్షపాతం, వరదల ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు. ఈ అవకాశాలు సాధారణంతో పోలిస్తే కనీసం రెట్టింపు.
కరువు ముప్పు ఉన్న ప్రాంతాలు:
అలాస్కాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ కెనడా.
అమెరికాలోని ఉత్తర రాకీ పర్వత ప్రాంతాలు.
మధ్య అమెరికా.
దక్షిణ అమెరికాలోని ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలు.
ఆఫ్రికాలోని విస్తారమైన ప్రాంతాలు.
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్.
వాయువ్య ఆస్ట్రేలియా, దక్షిణ పసిఫిక్ దీవులు.
భారీ వర్షాలు, వరదల ముప్పు ఉన్న ప్రాంతాలు:
అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ప్రాంతాలు, తూర్పు తీరం.
పెరూ, ఈక్వెడార్ తీర ప్రాంతాలు.
చిలీ, పరాగ్వే, దక్షిణ బ్రెజిల్.
ఉరుగ్వే, అర్జెంటీనా.
పశ్చిమ, తూర్పు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు.
మధ్య, తూర్పు ఆసియా.
ఉత్తర పపువా న్యూ గినియా.
తూర్పు ఆస్ట్రేలియా, పశ్చిమ న్యూజిలాండ్.
ఈ అంచనాలు నిర్దిష్టంగా ఏ రోజు ఎక్కడ వర్షం పడుతుందో చెప్పవు. సాధారణ పరిస్థితులతో పోలిస్తే అధిక వర్షాలు లేదా తీవ్రమైన కరువు ఏర్పడే అవకాశాలను తెలియజేస్తాయి.
280 కోట్ల మందికి ఉక్కపోత ముప్పు!
వేడి, వర్షాలతో పాటు గాలిలో తేమ శాతం కూడా ఈసారి కీలకంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 280 కోట్ల మంది ప్రజలు సాధారణం కంటే అత్యధిక తేమను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలు, ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో తేమ అధికంగా ఉండవచ్చు. దీనివల్ల ఉక్కపోత తీవ్రత పెరిగి శరీరంపై వేడి ఒత్తిడి (Heat Stress) అధికమయ్యే ప్రమాదం ఉంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు కూడా పెరగవచ్చు.
కాలిఫోర్నియాలో వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి గత ఐదేళ్లలో అత్యధిక స్థాయికి చేరుకోవడం నిపుణుల ఆందోళనకు కారణమవుతోంది. రాబోయే ఏడాదిలో పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై ఇప్పటికే పరిశీలనలు కొనసాగుతున్నాయి.
దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఉత్తర న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ అసాధారణ తేమ నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్‌నినో ప్రభావం.. మారచ్చా?
ఎల్‌నినో ఒక్కటే ప్రపంచ వాతావరణాన్ని నిర్ణయించదు. ఇతర వాతావరణ అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రస్తుతం వెలువడుతున్న అంచనాల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా 2027 ప్రారంభంలో ఎల్‌నినో బలహీనపడే కొద్దీ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంది. అయితే ప్రకృతి మార్పులను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







