హరీశ్ రావు గడ్డపై కవిత సమరభేరి!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సిద్దిపేట గడ్డపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సిద్దిపేటలో పార్టీ ఆఫీస్ భవన నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో కేవలం కుటుంబ పాలన, అవినీతే మిగిలిందని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, కానీ ఇక్కడ ప్రజలు నిత్యం ఆందోళన, భయంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నుంచి తమ పోరాటాన్ని ప్రారంభించి, సిద్దిపేటలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.
హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హరీశ్ రావు కేవలం నీళ్ల దొంగ, నిధుల దొంగ మాత్రమే కాదని, బొగ్గు దొంగ కూడా అంటూ ఘాటు విమర్శలు చేశారు. బొగ్గు డంపింగ్ యార్డ్ పేర్లతో పర్మిషన్లు తీసుకొని సింగరేణిని దోచుకున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, రూ. 93 వేలు కోట్లు ఖర్చు పెట్టినా ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం లక్ష ఎకరాలకే నీళ్లు ఇచ్చారని విమర్శించారు. ఎన్జీఆర్ఐ రిపోర్ట్ ఉన్నప్పటికీ బండ్ లీకులను కవర్ చేసేందుకు హరీశ్‌రావు బ్లాస్టింగ్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నిమ్స్ ఆస్పత్రిలో రూ. 25 కోట్ల ఈపీఎఫ్ ఫండ్ మళ్లింపుపై వంద కోట్ల స్కామ్ జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ అవినీతి ఆరోపణలపై స్పష్టతనివ్వాలని కవిత డిమాండ్ చేశారు. ‘గుంటనక్కతో గుంపు మేస్త్రీ లాలూచీ పడ్డారు’ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఏకకాలంలో విమర్శలు గుప్పించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను బెదిరించి రూ. 2 వేల కోట్ల పాల వ్యాపారం చేశారని, రిజిస్ట్రేషన్ ఆఫీస్ మార్పులోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఐదు ఎకరాల భూమిని ఆక్రమించారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైనప్పటికీ, వారి కుటుంబాలకు తగిన న్యాయం జరగలేదని, కానీ హరీశ్‌రావు ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయని విమర్శించారు.
తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడాది పాటు మేధావులతో చర్చించి, 50 కమిటీలు వేసి ప్రజా సమస్యలపై పోరాడేందుకే పార్టీ పెట్టానని కవిత స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలోనూ ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన సంకల్పమని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కుటుంబ పాలనకు, అవినీతికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సిద్దిపేటలో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని, ప్రజలు తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు భయపడకుండా ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.







