ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఏపీ ప్రగతి నమూనా ప్రపంచానికి చాటుతాం: ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్
రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల గ్రౌండింగ్…ఆరు నెలల్లోనే ‘గూగుల్’కు శంకుస్థాపన : సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, నవంబర్ 13 :- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం సాధిస్తోన్న పురోగతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా విశాఖపట్నంలో ‘టైమ్ ఇంపాక్ట్ డిన్నర్’ కార్యక్రమం నిర్వహించారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా గురువారం రాత్రి ది పార్క్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘టైమ్’ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డామియన్ డగ్లస్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. సుమారు 100 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార, ప్రభుత్వ రంగ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు సానుకూల వాతావరణం, వేగవంతంగా ప్రాజెక్టుల అమలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టులు వేగంగా గ్రౌండింగ్ అవ్వడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ హబ్ ఏర్పాటుకు 2025 అక్టోబర్‌లో ప్రకటించగా, కేవలం ఆరు నెలల్లోనే 2026 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం, పెట్టుబడుల అమలులో చిత్తశుద్ధి ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు.
అద్భుత నాయకత్వం-అసాధారణ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల పురోగతిని ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘టైమ్’ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు రావాలని, అప్పటికి రాష్ట్రం సాధించిన ప్రగతిని స్వయంగా పరిశీలించి ప్రపంచానికి తెలియజేయాలని ‘టైమ్’ సంస్థను ఆహ్వానించారు. ‘టైమ్’ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డామియన్ డగ్లస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అసాధారణ అభివృద్ధి తనకు ఎంతో ఆసక్తి కలిగించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అనేక విజయాలు…అద్భుత నాయకత్వం, దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విజయగాథను, రాష్ట్ర అభివృద్ధి నమూనాను ప్రపంచానికి పరిచయం చేస్తామని డగ్లస్ వెల్లడించారు.
‘బిల్డ్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ గ్రోత్’పై ప్యానల్ చర్చ
ముఖ్యమంత్రి ముఖాముఖి అనంతరం ‘బిల్డ్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ గ్రోత్’ అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ నిర్వహించారు. వరాహ క్లైమేట్ఏజీకి చెందిన మధుర్ జైన్, పబ్లిసిస్ గ్రూప్ సీఈఓ అనుప్రియ ఆచార్య, ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ మిట్టల్, ఆసియా అభివృద్ధి బ్యాంకు సౌత్ ఆసియా విభాగం ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా పాల్గొన్నారు. టైమ్100 నెక్ట్స్ఇండియా సీనియర్ ప్రొడ్యూసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ గాయత్రి రంగాచారి షా ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించారు. ప్రపంచ వృద్ధికి దోహదపడే భాగస్వామ్యాలు, భవిష్యత్ అవకాశాలు, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.







