వాలంటీర్ వ్యవస్థపై రేవంత్ రెడ్డి దృష్టి.. సక్సెస్ అయ్యేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సుమారు లక్ష మంది యువతతో కూడిన క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడం, సంక్షేమ ఫలాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందించడం ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాల పంపిణీలో సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్న అంతరాన్ని పూడ్చాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రతి 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించడం ద్వారా గ్రామాలు, వార్డుల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చనేది వ్యూహకర్తల అంచనా. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ‘ప్రజాబలం’ పేరుతో గ్రామీణ పర్యటనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో సానుకూలతను పెంచే వారధిగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా, చదువుకున్న లక్ష మంది నిరుద్యోగ యువతకు నెలకు సుమారు రూ.10 వేల గౌరవ వేతనంతో ఉపాధి కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఈ విధానం అమలుపై రాజకీయ విశ్లేషకుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2.5 లక్షల మందితో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను అమలు చేసింది. ప్రారంభంలో పథకాల డెలివరీ వేగవంతమై ప్రజాదరణ లభించింది. అయితే రానురాను ఆ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెట్టారనే విమర్శలతో పాటు, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలు ఆ ప్రభుత్వానికి పెద్ద మైనస్‌గా మారాయి. పైగా సొంత పార్టీ నేతలే వాలంటీర్ వ్యవస్థ వల్ల తమను ఎవరూ దేకట్లేదనే ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది.
తెలంగాణలో ఇదే తరహా వ్యవస్థను ప్రవేశపెడితే, రేవంత్ సర్కార్ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రూప్స్, డీఎస్సీ వంటి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను గౌరవ వేతనంతో కూడిన తాత్కాలిక పోస్టులతో మభ్యపెడుతున్నారనే విమర్శను ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకుంటాయి. నియామకాల్లో పారదర్శకత లోపిస్తే, ప్రభుత్వ ఖజానా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు జీతాలు ఇస్తున్నారనే ప్రచారం ఊపందుకుంటుంది. పౌరుల వ్యక్తిగత డేటా భద్రత, చట్టబద్ధత లేని నియామకాలపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల అధికారాలకు వలంటీర్ల వ్యవస్థ సమాంతర అధికార కేంద్రంగా మారితే స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొనవచ్చు.
లక్ష మంది వలంటీర్ల ఆలోచన పరిపాలనాపరంగా వేగాన్ని పెంచే సాధనమే కావచ్చు. కానీ, ఏపీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, పక్కా విధివిధానాలు, పూర్తి పారదర్శకతతో, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దీనిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. లేదంటే, సంక్షేమం కోసం వేస్తున్న ఈ అడుగు ప్రభుత్వానికి రాజకీయంగా బూమరాంగ్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.







