ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ… సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.1.41 లక్షల కోట్లతో ఒప్పందాలు
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు
జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు
ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి చేయూతగా ఐటీసీ, హీరో మోటార్స్ కార్ప్
ఐటీసీ, హీరో మోటార్స్ కార్పోరేషన్ సంస్థలకు సీఎం చంద్రబాబు అభినందనలు
విశాఖ, నవంబరు13: సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజూ దిగ్గజ కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్రీన్ జెన్, ఎయిర్ ట్రంక్- జేసీకే ఇన్ ఫ్రా, డిక్సన్ టెక్నాలజీస్, కాకినాడ సీపోర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రభుత్వ శాఖలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే తొలిసారి పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములుగా మారుతూ ఐటీసీ, హీరోమోటార్స్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1,41,585 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 12 ఒప్పందాలను వివిధ కంపెనీలు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం జిందాల్ గ్రూప్ రూ.15 వేలకోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతి జిల్లాలో ఆర్బిటల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.510 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
పునరుద్పాక ఇంధన రంగంలో గ్రీన్ జెన్ రెన్యూబుల్ ఎనర్జీ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీనెడ్ క్యాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రంగంలోనే రూ.6,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గానూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఒప్పందం చేసుకుంది. డేటా సెంటర్ క్యాంపస్‌ల ఏర్పాటు, 1400 మెగావాట్ల టెలికామ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఐటీ విభాగంతో ఎయిర్ ట్రంక్ ఇండియా- జేసికే ఇన్ఫ్రా ఒప్పందం చేసుకుంది. రూ.1,03,018 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 3,120 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎయిర్ ట్రంక్- జేసీకే ఇన్ ఫ్రా సంస్థలు ఒప్పందంలో పేర్కొన్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కాకినాడ పోర్టులో మెకనైజ్డ్ బెర్త్, రీగ్యాసిఫికేషన్ ప్లాంట్, షిప్ బిల్డింగ్, రిపేర్ కాంప్లెక్సు ఏర్పాటు కోసం ఏపీ మారిటైమ్ బోర్డుతో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
రూ.6452 కోట్ల పెట్టుబడితో మెకనైడ్జ్ బెర్త్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు చేయటుతో 852 మందికి ఉద్యోగాలను కల్పించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రాజధాని అమరావతిలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటు కోసం ఏపీసీఆర్డీఏ ఈఐహెచ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.175 కోట్ల పెట్టుబడితో, 150 మందికి ఉద్యోగాల కల్పించనున్నట్టు తెలిపింది.

పీ4కు చేయూతగా ఒప్పందాలు
రాష్ట్రంలో అమలు చేస్తోన్న ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి సంబంధించి సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ఆర్దిక సహకారం అందించేందుకు హీరో మోటార్ కార్పోరేషన్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది. 10వ తరగతి చదివి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్ధులకు రూ.2.9 లక్షల చొప్పున స్కాలర్షిప్ అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ ఒప్పందం చేసింది. బ్రిజ్ మోహన్ ముంజాల్ స్కాలర్షిప్లను విద్యార్ధులకు అందించేందుకు గానూ రూ.32.48 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని 25 వేల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ఐటీసీ లిమిటెడ్ స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ తో ఒప్పందం చేసింది. 25 వేల మంది బంగారు కుటుంబాలకు జీవనోపాధి, జీవన ప్రమాణాలు పెంచేలా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన 11 ఎంఓయూలు, 1 జీవో జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు, 10,919 మందికి ఉద్యోగాల జరుగనుంది.

ప్రాజెక్టుల గ్రౌండింగ్ ముఖ్యం
ఒప్పందాలు చేసుకోవటంతో పాటు ప్రాజెక్టులు గ్రౌండింగ్‌పై దృష్టి పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టులు గ్రౌండ్ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్షిప్ ను 1120 మంది విద్యార్ధులకు ఆర్ధిక సహకారం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ముందుకు రావటం సంతోషదాయకమని అన్నారు. ఐటీసీ కూడా సామాజిక బాధ్యతగా పీ4కు సహకారం అందిస్తున్నందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ లాంటి విద్యా సంస్థలు ముందుకు వచ్చి ఏపీని ప్రయోగశాలగా మార్చుకోవాలని.. పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేయాలని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు సామాజిక, ఆర్ధిక భద్రత అందించటంలో ముందుందని అన్నారు. యాక్సెస్ టూ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబం హ్యాపీ, హెల్తీ వెల్తీగా ఉండాలన్నదే తన తాపత్రయం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.







