ఏపీ సర్కార్ పై కేంద్రం ప్రశంసల వర్షం..!
ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల అతలాకుతలం చేసిన ‘మురసు’ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర అంతర్-మంత్రిత్వ బృందం (IMCT) రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ మరియు పునరుద్ధరణ చర్యలపై ప్రశంసలు కురిపించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం శుక్రవారం నుంచి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభించింది. తుపాను తీరం దాటిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే..
విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్వర్క్, దెబ్బతిన్న రోడ్డు కనెక్టివిటీని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడం అత్యంత అభినందనీయమని కేంద్ర బృందం కొనియాడింది. విపత్తు సమయంలో ప్రాణనష్టాన్ని నివారించడంలో మరియు సహాయక చర్యలు చేపట్టడంలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలతో పాటు రాష్ట్ర యంత్రాంగం అందించిన సేవలను కేంద్ర బృందం ప్రత్యేకంగా అభినందించింది. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాధిత రైతులతో నేరుగా మాట్లాడిన కేంద్ర ప్రతినిధులు, దెబ్బతిన్న వరి, ఉద్యాన పంటలను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
సాంకేతికతను వినియోగించుకుంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని కేంద్ర బృందం అభిప్రాయపడింది. మరోవైపు, ‘మురసు’ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు రోడ్లు, విద్యుత్ మరియు ఇతర మౌలిక సదుపాయాలకు కలిపి మొత్తం రూ. 2,484.43 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి నివేదించారు. శనివారం కూడా పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం, ఆదివారం ఈ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి తమ పరిశీలన వివరాలను వెల్లడించనుంది.







