ఇంటికో పారిశ్రామికవేత్త మా టార్గెట్: నారా లోకేష్
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో ‘ఏపీ స్టార్టప్ ఎక్స్ఛేంజ్’ (APEX) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ను (One Family, One Entrepreneur) తయారుచేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఆరుగురు స్టార్టప్ నిర్వాహకులను మంత్రి లోకేష్ ప్రత్యేక జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘ఏపీ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2024’ కింద తొలిసారిగా 31 స్టార్టప్ సంస్థలకు తొలి విడతగా రూ. 2.11 కోట్ల ఆర్థిక సాయాన్ని మంత్రి లోకేష్ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకానికి సంబంధించిన చెక్కులు, మంజూరు పత్రాలను ఆయా సంస్థల ప్రతినిధులకు అందించారు.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు పెట్టుబడి, మార్గదర్శకత్వం, మార్కెటింగ్ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ పరిశ్రమ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు 25 ప్రత్యేక పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి లోకేష్ వెల్లడించారు. దీనికి తోడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను అభివృద్ధి చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి పారిశ్రామిక వృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు స్కైరూట్ ఏరోస్పేస్, సాగర్ డిఫెన్స్ వంటి సంస్థలను ఏపీ ప్రోత్సహించినట్లే, నేటి యువ పారిశ్రామికవేత్తల కలలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారు విజయపథంలో దూసుకెళ్లి ఏపీకి, దేశానికి గర్వకారణంగా నిలవాలని లోకేష్ పిలుపునిచ్చారు.







