ఒబామాను అవమానించిన ట్రంప్.. జర్నలిస్ట్ షాకింగ్ రియాక్షన్! అసలేం జరిగింది?
ఒక దేశానికి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కాస్త ఆలోచించి, ఆచి తూచి మాట్లాడతారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలాంటి మొహమాటాలేవీ పెట్టుకోలేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తావన రాగానే తనదైన స్టైల్లో కామెంట్స్ మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ కూడా మొదట సాధారణంగానే విన్నారు. కానీ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఒక మాటతో ఆయన ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత కూడా ఆ విషయం ఆయనను వదల్లేదు. చివరకు అదే టీవీ కార్యక్రమంలోనే తన అసహనాన్ని బయటపెట్టారు. ఇంతకీ ట్రంప్ ఏం అన్నారు? ఒబామా విషయంలో ఆయన అంతలా ఎందుకు స్పందించారు? ఈ వ్యవహారంలో ట్రంప్‌కే ఎదురైన మరో ప్రశ్న ఏమిటి?
ఒబామాతో పోటీ పడితే నాదే విజయం.. ట్రంప్ అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు ఉన్నారు?
స్టీఫెన్ ఏ. స్మిత్ తన Straight Shooter కార్యక్రమం కోసం వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను దాదాపు 48 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అమెరికా రాజకీయాలు, ఎన్నికలు, నాయకుల ప్రజాదరణ గురించి చర్చ జరిగింది. మాటల మధ్యలో స్మిత్ ఒక ఊహాజనిత ప్రశ్నను ట్రంప్ ముందు ఉంచారు. ఒకవేళ ఒబామాతో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం వస్తే ఎవరు గెలుస్తారని అడిగారు.
ఈ ప్రశ్నకు ట్రంప్ ఏమాత్రం తడబడలేదు. తనకు ఒబామా కంటే చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయని, టెక్సాస్, ఫ్లోరిడా వంటి కీలక రాష్ట్రాల్లో తన పేరిటే అత్యధిక ఓట్ల రికార్డులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో ఒబామాను ఓడించడం తనకు పెద్ద కష్టమేమీ కాదన్నట్లుగా మాట్లాడారు. స్మిత్ కూడా మరోసారి స్పష్టత కోరుతూ.. అంటే ఒబామాను సులభంగా ఓడిస్తానని చెబుతున్నారా? అని అడిగారు. దానికి ట్రంప్ అవునని సమాధానమిచ్చారు.
అసలు కథ అక్కడితో ఆగలేదు. ఒబామా గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు ఆయనను ‘హైలీ ఓవర్రేటెడ్’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే ఒబామాకు ఉన్న గుర్తింపు, ప్రజాదరణ ఆయన నిజమైన పనితీరు కంటే ఎక్కువని చెప్పాలన్నది ట్రంప్ ఉద్దేశం. ఈ మాట వినగానే స్మిత్ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. వెంటనే ఒబామాను అంత తక్కువగా ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు.
ఒబామాను అంత అవమానిస్తారని అనుకోలేదు.. స్మిత్ ఏమన్నారంటే?
ట్రంప్ వ్యాఖ్యలపై స్టీఫెన్ ఏ. స్మిత్ స్పందించిన తీరు ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రధాన ఆకర్షణగా మారింది. CNNలోని Laura Coates Live కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇంటర్వ్యూలో జరిగిన విషయాలను ప్రస్తావించారు. ట్రంప్ తాను ఒబామాను ఎన్నికల్లో ఓడించగలనని అనడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, కానీ ఒబామా గురించి అంత నిర్లక్ష్యంగా, అగౌరవంగా మాట్లాడతారని మాత్రం ఊహించలేదని చెప్పారు.
ట్రంప్ తనపై తనకు అపారమైన నమ్మకం ఉండే వ్యక్తి అని స్మిత్‌కు తెలుసు. అందుకే తాను గెలుస్తానని చెప్పడం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. కానీ అమెరికాకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా గురించి మాట్లాడేటప్పుడు కనీస గౌరవం కూడా చూపించకపోవడం మాత్రం తనను షాక్‌కు గురిచేసిందని వెల్లడించారు. నిజం చెప్పాలంటే ట్రంప్ నుంచి అలాంటి వ్యాఖ్యలు వస్తాయని తాను అస్సలు అనుకోలేదని స్పష్టం చేశారు.
నేను ప్రజలను కలుపుతాను.. ఒబామా మాత్రం విభజించారు!
ఒబామాను మంచి అధ్యక్షుడిగా తాను భావించడం లేదని ట్రంప్ తన ఇంటర్వ్యూలో మరింత వివరించారు. ఆయన ప్రజలను కలిపే నాయకుడు కాదని, అమెరికన్ల మధ్య విభేదాలు సృష్టించే వ్యక్తిగా అభివర్ణించారు. అదే సమయంలో తనను తాను ప్రజలందరినీ కలిపి ఉంచే నాయకుడిగా చెప్పుకున్నారు. దేశంలో విజయాలు సాధించడం ద్వారా ప్రజలను ఒక్కటి చేస్తున్నానని వివరించారు.
అయితే ఇక్కడ స్మిత్ మరో ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీరు ప్రజలను ఎలా కలుపుతున్నారు? అని నేరుగా అడిగారు. దానికి ట్రంప్ దేశం సాధిస్తున్న విజయాలే అందుకు కారణమని సమాధానమిచ్చారు. అంటే ఒబామా పాలనపై విమర్శలు చేస్తూనే, తన పాలనను అందుకు పూర్తి భిన్నంగా చూపించుకునే ప్రయత్నం చేశారు.
ట్రంప్‌కు మరోసారి ఎదురైన ఇబ్బందికరమైన ప్రశ్న.. Approval Rating సంగతేంటి?
ఇంటర్వ్యూలో ఒబామా ప్రస్తావన మాత్రమే కాదు.. ట్రంప్ ప్రజాదరణ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎన్నికల తర్వాతి పరిణామాలను ప్రస్తావిస్తూ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. ఎన్నికల మరుసటి రోజు అమెరికా స్టాక్ మార్కెట్ విలువ ఏకంగా 3 ట్రిలియన్ డాలర్లు పడిపోయిందని చెబుతూ, డెమోక్రాట్లకు ప్రజల్లో అంతగా ఆదరణ లేదన్నట్లుగా మాట్లాడారు.
అయితే స్టీఫెన్ ఏ. స్మిత్ వెంటనే మరో కోణాన్ని ముందుకు తీసుకొచ్చారు. డెమోక్రాట్ల గురించి మాట్లాడుతున్నారే కానీ, మీ సొంత ప్రజాదరణ సంగతేంటి? అన్నట్లుగా ట్రంప్‌ను ప్రశ్నించారు. మీ ఆమోద రేటింగ్ డెమోక్రాట్ల కంటే కూడా తక్కువగా ఉందని గుర్తుచేశారు. దీంతో ఇంటర్వ్యూలో ట్రంప్ తన విజయాల గురించి చెప్పుకుంటున్న సమయంలోనే ఆయన రాజకీయ ప్రజాదరణపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇవి కూడా చదవండి
రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ట్రంప్ వైఖరి ఇదేనా?
ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ రాస్ డౌతాట్తో మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన శత్రువుల్లో కొందరిని ద్వేషిస్తానని, వారిని ఎప్పటికీ క్షమించలేనని చెప్పారు. 60 Minutes కార్యక్రమంలో డౌతాట్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, స్వర్గానికి వెళ్లాలంటే రాజకీయ శత్రువులను క్షమించాల్సి వస్తే ఏం చేస్తారని అడిగారు. వారిని క్షమించగలనని చెప్పడం నిజాయతీగా ఉండదని ట్రంప్ సమాధానమిచ్చారు.
ఒబామాపై తాజా వ్యాఖ్యలు కూడా ఈ నేపథ్యంలో చర్చకు వచ్చాయి. ఒకవైపు తనను తాను ప్రజలను కలిపే నాయకుడిగా ట్రంప్ అభివర్ణించుకుంటుంటే, మరోవైపు మాజీ అధ్యక్షుడి గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం విమర్శలకు కారణమయ్యాయి. అందుకే ట్రంప్‌తో ఇంటర్వ్యూ చేసిన స్మిత్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొత్తానికి…
ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పిన మాటల కంటే, వాటిని విన్న తర్వాత స్టీఫెన్ ఏ. స్మిత్ ఇచ్చిన స్పందనే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది. ఒబామాను ఓడిస్తానని చెప్పడం ఒక ఎత్తయితే, ఆయన నాయకత్వాన్ని పూర్తిగా కొట్టిపారేయడం మరో ఎత్తు. ట్రంప్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదన్న స్మిత్ మాటలే ఈ ఇంటర్వ్యూలో అసలు హైలైట్‌గా నిలిచాయి
—సూర్య ప్రకాష్ జోశ్యుల







