కథ 5: చావులకొండ – రావి కొండలరావు
Ravi Kondala Rao Hasya Kathalu – Part5
అక్కడ ఎండ తీవ్రంగా వున్న వేళలో కూడా చల్ల గానే వుంటుంది. ఆ స్థలం అలాంటిది. దూరంగా హోరెత్తకుండా నోరెత్తకుండా పూర్ణ గర్భిణిలా నిదానంగా ఓ చిన్న నది ప్రవహిస్తూ వుంటుంది. ఇటూ అటూ కొండలున్నా కొండల చుట్టూ పచ్చని విశాలమైన చెట్లు. సాధారణంగా మనిషి జాడ, జంతువు జాడా కనిపించవక్కడ. పక్షులు మాత్రం తిరుగుతూ వుంటాయి; పిట్టలు సుఖంగా ఎగురుతూ వుంటాయి. పెద్దగా గాలి వీచినప్పుడో, పక్షులు అరిచినప్పుడో తప్ప, ఇతర శబ్దం అంటూ వినిపించదు. అలాంటి చోట, ఆ గుబురు చెట్ల మధ్య ఎత్తయిన ఓ కొండ వుంది. ఆ కొండ ఎక్కడానికి చాలా వీలుగా, మెట్లున్నట్టుగా కనిపిస్తుంది. అలా సులభంగా పైకి ఎక్కి ఎక్కి, నిలబడి అటు పక్కగా కిందికి చూస్తే అగాధంలా కనిపిస్తుంది. కింద వున్న బండరాళ్లన్నీ పెద్దసైజు గోలీకాయలు అలా అలా పడేసినట్టుగా కనిపిస్తాయి. ఇంకా జాగ్రత్తగా చూస్తే పిచికలు కంటే చిన్నవైన పిట్టలు కనిపిస్తాయి. కాని అవి చిన్న పిట్టలు కావు. పెద్ద పెద్ద రాబందులు. కొన్ని పైకి ఎగురుతూ, కొన్ని గంతులు వేస్తూ, కొన్ని పోట్లాడుకుంటూ కనిపిస్తాయి. పైన, చుట్టూ అంత ప్రశాంత వాతావరణం కింద మాత్రం భయంకర వాతావరణం.
అలాంటి వాతావరణంలో – మనుషులు రావడానికి భయపడే ఆ స్థలంలో – ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. ఇద్దరూ కొండమీద, బండరాళ్లమీద జేరబడి కూచుని వున్నారు. వాళ్ల పక్కన లాటీకర్రలూ టోపీలూ వున్నాయి. కాకీ బట్టలు వేసుకుని, బీడీలు పీలుస్తూ కబుర్లు చెప్పుకుంటున్న ఆ ఇద్దరూ పోలీసులు. దొంగా ఏ దొరా తిరగని అలాంటిచోట, ఆ కొండమీద పోలీసులెందుకు కూచున్నారు?
ఎందుకంటే – ఆ కొండ ఆత్మహత్యలు చేసుకోడానికి అనువైన కొండ. దాన్ని ‘చావులకొండ’ అంటారు. ఆ కొండ మీద నుంచి దూకగలిగే ధైర్యంవుంటే చాలు – కోశానా బతికే అవకాశం లేదు! కొండ ఎక్కడం సులువు; చావడం సులువు. ఎక్కుతూ వుంటే చూడ్డానికి ఎవరూ వుండరు గనుక, ఆగమని ఆపేవాళ్లు వుండరు. ఇన్ని కారణాల వల్ల అది ‘ఆత్మహత్యలకొండ’ గానూ, ‘చావులకొండ’గానూ ప్రసిద్ధి పొందింది. పరీక్షా ఫలితాలు తెలిసే రోజుల్లోనూ, పెళ్లిళ్లకాలంలోనూ, కరువు కాటకాలు వచ్చినప్పుడు – అలా ఒక్కో సీజన్లో ఆత్మహత్యలకి అక్కడ గిరాకీ ఎక్కువగా వుంటుంది. మామూలు రోజుల్లో అయితే ఒకటీ అరా జరిగినా, ఈ మధ్య ఎందుకనో సీజన్ కాకపోయినా వారానికి ఇద్దరూ ముగ్గురూ అక్కడ ప్రాణాలు తీసు కుంటున్నారని, ప్రభుత్వం అక్కడ డ్యూటీల మీద పోలీసువాళ్లని ఏర్పాటు చేసింది. ఆ పోలీసులు బండరాళ్ల వెనక కనిపించకుండా కూచుని, ఆత్మహత్య చేసుకోడానికి వచ్చేవాళ్లను ఛట్టున పట్టుకుని, నివారించి, అరెస్ట్ చేసి, కేసు రాసి స్టేషన్కి తీసుకెళ్లి కూచోబెడతారు. ఆ సంకల్పంతోనే ఆ ఇద్దరు పోలీసులూ అక్కడ డ్యూటీ చేస్తున్నారు.
అరగంటపాటు ఇద్దరూ మౌనంగా వున్నాక, “బోరుకొడుతుందెహె” అన్నాడు చిన్న మీసం గల పోలీసు బీడీ పారేసి,
“తప్పదు” అని పెద్ద మీసం వాడు బీడీ దమ్ములాగి ఒళ్ళు విరుచుకుంటూ లేచి – ” ఇవాళ నాలుగోరోజు. మరి బోరెత్తదా” అన్నాడు.
“అయితేనేం – ఇదే బావుందన్నా. పొద్దున్న వస్తున్నాం. ఇంత చల్ల గాలి పీలుస్తూ హాయిగా కూచుంటున్నాం. తెచ్చుకున్నదేదో తింటున్నాం, సాయంకాలానికి వెళ్లి పోతున్నాం” అన్నాడు చిన్న మీసం పోలీసు బండకి మరింత జేరబడి.
“నువ్వు చెప్పిందీ నిజమే. మినిస్టర్లు వస్తున్నారని అక్కడ కాపలాకి వెళ్లు దొంగలు ఎక్కువగా పడుతున్నారు గనక రాత్రిళ్లు ఆ చోట కాపలాలు కాయి – – ఎక్కడో దొమ్మీ జరుగుతోంది గనక అక్కడికి పరుగెత్తు, అక్కడేదో మర్డర్ జరిగింది, వెళ్లి వాళ్లని పట్టుకో అని చెప్పకుండా, ఈ కొండమీద వేసిన డ్యూటీ బాగానే వుందిలే”
“ఐనా, మినిష్టర్లకు కాపలాలు కాయమంటే నాకు సెడ్డ బయం అన్నా” అన్నాడు చిన్నవాడు.
–
“ఏం నిన్ను చూడగానే టాన్స్ఫర్ చేస్తారనా, పెమోషను ఇవ్వరనా?”
“అదేంకాదులే? మినిష్టర్లకీ, పెద్దోళ్లకీ కాపలాలంటే ఎందుకు?
ఆళ్లనెవడూ
కొట్టకుండా, కాల్చకుండా గదా. నాకొడుకులు ఆళ్లని కొట్టబోయారనుకో అయ్యి మనకి తగుల్తాయిగదా – అదీ బయం”
“అదా! ఏం చేస్తాంలే! ఎవడికి ఎప్పుడు ఎలా రాసిపెట్టుందో అలా జరగాల్సిందే గద. ఇంకోటుందిరోవ్ పెద్దోళ్లకి కాపలాలు కాస్తూ మనం చచ్చిపోయాం అనుకో, ప్రభుత్వం బాగా చూస్తుంది. కుటుంబానికి మంచి డబ్బు, మనకి పేరూను. అయితే అలాంటిది అంత సులభంగా జరగదులే.” అన్నాడు పెద్దమీసం పోలీసు, మూత లేని పాతరకం ప్లాస్కులో చల్లగా అయిపోయిన టీని కొంత గొంతులో పోసుకుంటూ.పెద్దమీసం ఎటో చూస్తున్నాడు!
“అన్నట్టు అన్నా అడగాలనుకుంటూ మరిచిపోతున్నాను కోటిలింగాల గూడెంలోని కానిస్టేబులు ఎంకటేశర్లు కేసు ఏమయింది?” అని అడిగాడు చిన్నవాడు పెద్దవాడి పక్కనే వొచ్చి కూచుంటూ.
“ఇంకా ఏంలేదుగానీ, ఆడు నేరం చేసినట్టు మాత్రం తేలిపోయింది”
“టేశన్లో ఉన్నదాన్ని ఆడు రేప్ చెయ్యలేదనీ, అదే అలా కేసెట్టిందనీ అన్నారు…..
“అన్నారు. సూపరెంటు ఆరా తీశాడు. ఆ పిల్లని తనికీ చేసిన డాక్టర్లు ఒప్పుకున్నారుగదా”
“దొంగ సర్టిఫికెట్లన్నారు…”
“ఏం కాదురా, అలాగే అన్నారు అందరూ. ఆడే చేశాడు. చేసినట్టు ఒప్పుకున్నాడు గదా… పోయేకాలం కాకపోతే, ఏం బుద్ధి చెప్పు ఆడిది! అలాటోళ్లనుంచే డిపాటుమెంటు అంతటికీ చెడ్డపేరు!”
పెద్దమీసం పోలీసు వొళ్లు విరుచుకుంటూ లేచి, పైన చూస్తూ నిలబడ్డాడు.
“ఏవుందన్నా పైన? ఇందాకట్నుంచి అలా చూస్తున్నావు?”
“పెమోషను”
ఆమాటకి చిన్నవాడూ పైకి చూసి, “నాకేం కనిపించడం లేదే” అన్నాడు.
“అదే- అంతా శూన్యమేనని చెప్పడం! ఏంటో ఎప్పుడో! ఈ ఉద్యోగంలోకి రాకుండా, ఇంకోదానికెళ్లినా బాగుపడేవాణ్ణి. చూశావురా నా పెద్దకొడుకు రాఘవులు – ఆడికీ పోలీసుద్యోగమే కావాలిట. ఈ కష్టాలు అర్థం చేసుకోడు!”
“ఎక్కడి కష్టాలు అక్కడే వుంటాయిలే అన్నా. ‘ఈ రోజుల్లో పోలీసుద్దోగా లే బాగున్నాయి’ అన్నవోళ్లు లేరా!… మా మరదలు మొగుడికి సెంటర్లో మంచి ఉదోగం. ఆడు అది బాగోలేదంటాడు!”
అలా మాట్లాడుకుంటూ పెద్ద, చిన్న పోలీసులిద్దరూ బీడీలు వెలిగించారు. ఎండ ధీమాగా వెలిగిపోతూనే వుంది. కొండ మీద నుంచి చూస్తే దూరంగా వెళ్తున్న బస్సు, పిల్లలు ఆడుకునే కారు సైజులో జారిపోతోంది. పోలీసులిద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్లుండి, అటూ ఇటూ తిరుగుతూ వుంటే, ఎవరో వస్తున్న అలికిడయి, చట్టున బండల వెనక నక్కారు.
“ఎవడో మనిషిస్తున్నాడో” అన్నాడు పెద్ద పోలీసు నెమ్మదిగా.
“రానీ రానీ”
వాళ్లు అనుకున్నట్టే రొప్పుతూ ఆయాసపడుతూ ఒక మనిషాచ్చాడు అక్కడికి. పోలీసులు నక్కివున్న బండకే నీరసంగా జేరబడ్డాడు. కాస్సేపటికి లేచి, నిటారుగా నిలబడి, ఆకాశం వంక చూసి, రెండు చేతులూ పైకెత్తి నమస్కరించాడు. ఆ విన్యాసాన్ని ఇద్దరు పోలీసులూ గమనించారు. ఒకర్నొకరు చూసుకుని లేవబోయారు. వచ్చిన మనిషి అటూ ఇటూ చూసి, వచ్చిన దారినే కిందకి దిగసాగాడు.
“ఎవడో పిచ్చాడు గురూ” అన్నాడు చిన్నమీసం నెమ్మదిగా. “ఎందుకొచ్చినట్టు? ఎందుకు పోతున్నట్టు?”
“చెప్పానుగదా – పిచ్చోడని! చిరిగిపోయిన జుట్టు, ఆ వాలకం అంతా అలాగే వుంది.”
పది పదిహేను అడుగులు కిందికి దిగిన ఆ మనిషి ఒక్కసారి వెనక్కి తిరిగి జోరుగా పైకి పరుగెత్తాడు. పరుగెత్తుతూ బండరాళ్లు దాటబోతూ వుంటే, పెద్దపోలీసు “ఆగు” అని కేకపెట్టి, ఛట్టున వెళ్లి జబ్బ పట్టుకున్నాడు. అతను విడిపించుకోడానికి పెనుగులాడబోతే, రెండో పోలీసు కూడా వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు.
“ఎవరయ్యా నువ్వు?” అని అడిగాడు పెద్ద పోలీసు.
“నేనెవరైతేనేం నన్ను విడిచిపెట్టండి. నేను మోక్షం వెతుక్కుంటున్నాను. విముక్తికోసం పరుగెత్తుతున్నాను. విడిచి పెట్టండి” అని అరిచాడు అతను.
“అదేం కుదరదు. అందుకే వున్నాం మేమిక్కడ. మర్యాదగా వెనక్కి నడు. అక్కడే నీకు మోచ్చం” అన్నాడు చిన్న పోలీసు.
“ఇదిగో, నీలాంటివాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే మేము ఇక్కడ కాపలా కూచున్నాం. ఎవడూ రాలేదనుకుంటూ వుంటే, నువ్వొచ్చావు నిన్నొదుల్తామా – పద” అని లాగాడు పెద్దపోలీసు.
“బాధలు పడలేక, బతుకుమీద విరక్తి కలిగి చచ్చిపోదామని నేననుకుంటూ వుంటే, ఇక్కడ కూడా నాకు బాధలేనా? నా చావు నన్ను చావనివ్వండి. నాప్రాణంమీద మీకేం అధికారం లేదు – వదలండి” అన్నాడు పెనుగులాడుతూ ఆ మనిషి, “ఎవరిదయినా సరే, ప్రాణం తీసుకోడం నేరం. నడు కిందికి”
“సార్! నా ప్రాణం నేను తీసుకుంటున్నాను – మిమ్మల్ని తియ్యమనడంలేదు; మీ ప్రాణం నేను తియ్యడంలేదు ప్లీజ్ ! నన్నొదలండి”
“మరీ ఎక్కువ వాదించావంటే లాటీలతో నాలుగు కొట్టి, కిందపడేసి లాక్కుపోతాం జాగర్త” అన్నాడు చిన్నవాడు.
ఆ మనిషి లాభంలేదని, పెనుగులాడ్డం తగ్గించాడు. నీటి బుగ్గలోంచి నీరొచ్చినట్టు, కళ్లమ్మట నీళ్లు జలజలా పొంగాయి.
“ఈ భూమ్మీద ఇంకా నేను బతకాల్సిందేనన్నమాట. నాకింకా ఆయువు మూడలేదు కాబోలు; ఈ చెరసాలనుంచి ఇప్పట్లో విముక్తి లేదు కాబోలు” అన్నాడు. అతను నిస్పృహతో.
“నీకీ భూమ్మీద నూకలు చెల్లలేదను” అన్నాడు చిన్నపోలీసు గట్టిగా చెవిటివాడి దగ్గర అరిచినట్టు. ఆ మనిషి నీరు నిండిన ఎర్రని కళ్లతో అతనికేసి చూసి – “నూకలు ఎప్పుడో చెల్లిపోయాయి. ఇన్ని మెతుకులు తిని ఎన్నాళ్లయిందో, నా కుటుంబానికి పెట్టి ఎన్నాళ్లయిందో” అని భోరున ఏడ్చాడు.
ఆ ఏడుపుకి పోలీసుల మనసులు కాస్త కరిగాయి. పట్టుకున్న చేతుల్ని వదిలేసి, * ఏడవకు- ఇలారా. ఇలా కూచో” అని కూచోబెట్టారు రాయిమీద.
“పాపం – నువ్వు కష్టాల్లో వున్నట్టున్నావు. ఏంటి కత?” అని అడిగాడు. చిన్నపోలీసు.
“కథంతా చెప్తాను. విన్నతర్వాత మాత్రం నన్ను ఆపకండి. నేను చేస్తున్నది తప్పనిపిస్తే నన్ను అరెస్టు చెయ్యండి. రైటనిపిస్తే చావనివ్వండి. నేనూ ఎంతో ఆలోచించి, ఎన్నో ప్రయత్నాలు చేసి, ఆఖరికి ఇదే పరిష్కారం అని నమ్మి – ఆత్మహత్యకి పూనుకున్నాను.
నిద్రమాత్రలకి కూడా డబ్బుల్లేవు గనక, ఈ కొండని నమ్ముకున్నాను.”
“సరే చెప్పు”
ఆ మనిషి తన కథంతా చెప్పాడు. అన్నీ కన్నీళ్లే! కష్టాలే! బాగా చదువుకున్న దుర్భరమైన బతుకు. సంపాదన చాలకపోవడం, సంసారం ఈదలేక పోవడం, అప్పులు చెయ్యడం, అవి తీర్చలేకపోవడం, ఆబాకీల వాళ్లు కొట్టడం, తిట్టడం అంతా అదే కథ. అలాంటి పరిస్థితిలో అతనింకేమీ చెయ్యలేడు. బతికి వుంటే అప్పుల వాళ్ళు బతకనివ్వరు. వాళ్ల చేతుల్లో చచ్చేకంటే, తనేమైనాడో తెలియ కుండా ఇలా చావడమే మేలు!
సవిస్తరంగా చెప్పిన అతనికథంతా విన్నారు పోలీసులు. కొన్ని సంఘటనలు మరీ దారుణం గానూ, కొన్ని హృదయ విదారకం గానూ వున్నాయి! నిజం! అతనికి ఇంకో దారిలేదు! పోలీసులిద్దరూ కొంతసేపు మౌనం వహించారు.
“ఇహ నన్ను చావనిస్తారా” అని లేవబోయాడా మనిషి,
“అది మాత్రం కుదరదు గురూ! అహో!… అసలే మేం పోలీసులం – మాదగ్గరా! పద, నేరం నేరమే” అన్నాడు చిన్నవాడు.
“నేను ముందే చెప్పుకున్నాను. నాకథంతా విన్నాక మాత్రం నన్ను ఆపు జేయొద్దని. ఇప్పుడు నన్ను అరెస్టు చేసి, కోర్టుకి లాగి శిక్ష వేయిస్తే – ఏం బావుకుంటాను చెప్పండి. నా కుటుంబానికి అదో మచ్చ.”
పెద్ద పోలీసు బీడీ వెలిగించి, ఎటో చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. చిన్నవాడు మెల్లిగా వెళ్లి – “అన్నా! పోనీ, ఈడిని చావనిద్దామా పాపం!” అన్నాడు నెమ్మదిగా.
“ఛీ! మనం ఇక్కడ వుండగా, మన కళ్లెదుట వాడు నేరం చెయ్యడమా!… కాకపోతే ఒకటి చేద్దాం. బాగా నచ్చజెప్పి, ఈ సారికి వార్నింగ్ ఇచ్చి, ఇంటికి పంపేద్దాం. కేస్ బుక్ చెయ్యొద్దు.”
“ఆడు మళ్లీ వస్తాడు”
“వాడి కర్మ. మనం డ్యూటీలో లేకపోయిన తర్వాత వాడిష్టం, మనమేం చేస్తాం”
పోలీసులిద్దరూ అతని మీద జాలిపడి, బాగా నచ్చ జెప్పారు. తాము ఈ పరిస్థితిలో చెయ్యగలిగేదేమీ లేదని, ‘వార్నింగ్’ తీసుకుని ఇంటికి వెళ్లమనీ. చిన్న పోలీసు – సంసారం, జీవితం, పట్టుదల, కృషి, ధైర్యం లాంటి మాటలన్నీ వాడి, అతనికి నచ్చజెప్పాడు.
“అంచేత, నిన్ను చూసినట్టు మా పెద్దలకి మేం చెప్పం. నువుకూడా మమ్మల్ని చూసినట్టు చెప్పకు. హాయిగా ఇంటికెళ్లు. మామాట వినకపోతే మాత్రం అరెస్టు చేసి లాక్కుపోతాం” అని గట్టిగా చెప్పారు ఇద్దరూ కలిసి. ఆ మనిషి ఏం అనుకున్నాడో ఏమో, ఇంకేం చెయ్యలేక, ఇద్దరికీ నమస్కారాలు పెట్టి, శరీరం ఈడ్చుకుంటూ కొండ దిగిపోయాడు.
“అమ్మయ్య. అన్నా! ఇన్నిరోజులూ వూరికే వున్నా ఓ నిండు ప్రాణాన్ని కాపాడాం. అది చాలు. ఆడు మళ్లీ వచ్చాడా – ఈసారి మన చేతిలో చచ్చాడే”
“పాపం” అన్నాడు పెద్ద పోలీసు ఆ మనిషి దిగుతున్న వేపే జాలిగా చూస్తూ.
“డ్యూటీకింకా రెండు మూడు గంటలున్నట్టుంది. ఇవాళింక ఎవడూ రాడు. పోదామా అన్నా” అన్నాడు చిన్నవాడు.
“అదెలా పోతాంరా! డూటీ డూటీయే”
“ఐతే పద! అలా కిందికెల్లి ఏడిగా టీ తాగొద్దాం. బీడీలు కూడా అయిపోయి నట్టున్నాయి.
“నేను రాలేన్రా. వచ్చినా మళ్లీ ఎక్కలేను. వీలైతే నువ్వే వెళ్లి పుణ్యం కట్టుకో” అన్నాడు పెద్ద పోలీసు.
“సర్లే. అదీ నిజమే. నేనే ఎల్తాను. నీదగ్గర ఎంతుంది అన్నా – నాదగ్గర రెండు నోటుంది”
–
పెద్ద మీసం పోలీసు వున్న ఐదారు జేబుల్లోనో చేతులు పెట్టి వెతికాడు ఏ తగ్గలేదు.
“సర్లే. మళ్లీ రేపు ఎలాగూ ఇక్కడికి రావాలిగా. ఆ కొట్టోడికి అరువు పెట్టొస్తాలే ” అని డొక్కు ఫ్లాస్కు తీసుకుని టోపీ సర్దుకుంటూ కిందకి దిగాడు చిన్న పోలీసు.
రెండు బీడీ కట్టలూ, ప్లాస్కు నిండా టీ పట్టుకుని, ఆయాసంతోనే ఈల పాట పాడుతూ వచ్చాడు చిన్న పోలీసు – “అన్నా” అని పిలుస్తూ. టోపీ, లాటీ అక్కడ కనిపించాయిగాని అన్న కనిపించలేదు. ఒంటేలు కెళ్లాడేమోనని అటూ ఇటూ చూశాడు. కనిపించలేదు. ” అన్నా” అని ఇంకాస్త గట్టిగా పిల్చాడు సమాధానం రాలేదు. చిన్నపోలీసు కంగారు కంగారుగా ” అన్నా అన్నా” అని పిలుస్తూ అటూ ఇటూ తిరిగి కిందికి చూడ్డంతో – అగాధంలో కాకీబట్టల మనిషి కనిపించాడు! “అన్నా” అని గట్టిగా ఓ కేక పెట్టి, గుండెలు బాదుకుంటూ, పిచ్చివాడిలా తిరిగాడు. పొరపాటున అన్న పడిపోయాడా… ఇందాకటి మనిషిగాని మళ్ళీ వచ్చి అన్నని తోసేశాడా!… చిన్నపోలీసు దిగ్గున కూలబడ్డంలో, చెయ్యి అన్న టోపీమీద పడి, అది కదిలింది. టోపీకింద వున్న ఉత్తరం గాలికి రెపరెప లాడింది. వణుకుతున్న చేతులతో, ఆత్రుతగా తీసి చిన్న పోలీసు ఆ ఉత్తరం చదివాడు.
“తమ్ముడూ!
నా సమస్యలు ఎవరికి చెప్పుకోను! ఎన్నాళ్ల నుంచో నేనూ ఎన్నో బాధలతో సతమతమవుతున్నాను. ఎదిగిన అమ్మాయిలకి పెళ్లిళ్లు చెయ్యలేక, తక్కిన పిల్లలకి చదువులు చెప్పించలేక ఎన్ని అవస్థలు పడుతున్నానో, నీకూ తెలుసు. నేను చేసిన అప్పులు, చేస్తున్న అప్పులూ ఎలా తీర్చాలో ఏం చెయ్యాలో తెలియక, ఉన్న బాధల్ని చెప్పుకోలేక, దిగమింగలేక అవస్థ పడుతున్నాను. ఈ కష్టాలనుంచి ఎలా విముక్తి పొందాలో వాటిని ఎలా పరిష్కరించాలో తెలియక అవస్థ పడుతున్న స్థితిలో ఇందాక వచ్చిన మనిషి నాకళ్లు తెరిపించాడు. అతను చెప్పిన బాధలు, కష్టాలే నావీనూ! ఆ మనిషి నిస్సహాయస్థితి అర్థమైంది. ఆత్మహత్యకి మించిన పరిష్కారం లేదన్నట్టుగా విడమరచి చెప్పాడు. నాకు పరిష్కారం దొరికింది. ఇంక నేను కనిపించను. నన్ను క్షమించమని అందరితోనూ చెప్పు! – నీ అన్న.”
చిన్నపోలీసు ఆ ఉత్తరం చదివి, మతిపోయినవాడిలా ఆ మూలకీ ఈ మూలకీ పరుగెత్తి అగాధంలోకి చూస్తూ “అన్నా” అని గట్టిగా ఓ అరుపు అరిచి కూలబడ్డాడు. కొండలన్నీ ” అన్నా” అని దీర్ఘం తీస్తూ ప్రతిధ్వనించాయి!







