న్యూయార్క్ వెటరన్స్ డే పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా సునీతా విలియమ్స్
అమెరికా: న్యూయార్క్‌లో నవంబర్ 11న జరిగిన ప్రతిష్టాత్మక వెటరన్స్ డే పరేడ్‌కు భారతీయ అమెరికన్ వ్యోమగామి, రిటైర్డ్ నేవీ కెప్టెన్ సునీతా విలియమ్స్ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించి ఘనత వహించారు. సైనిక సభ్యులకు నివాళులర్పించే ఈ వేడుకలో మాన్‌హట్టన్ ఫిఫ్త్ అవెన్యూలో జరిగిన భారీ ఊరేగింపునకు ఆమె నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని కూడా పాల్గొన్నారు. నావీలో తాను గడిపిన సమయమే తన జీవితానికి పునాది వేసిందని, అన్ని సవాళ్లను ఎదుర్కొనేలా తనను సిద్ధం చేసిందని సునీతా విలియమ్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అద్భుత అనుభవం..
సైన్యంలో చేరినప్పుడు తాను ఎప్పుడూ ఒక వెటరన్ అవుతానని అనుకోలేదని, నావీతో పాటు మెరైన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అధికారులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని ఆమె తెలిపారు. అంతరిక్షంలో మొత్తం 608 రోజులు గడపడంతో పాటు, మహిళా వ్యోమగామిగా అత్యధికంగా తొమ్మిది స్పేస్‌వాక్‌లు (62 గంటలు) పూర్తి చేసిన రికార్డు ఆమె సొంతం. 107వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ పరేడ్‌లో వేలాది మంది మాజీ సైనికులు, సాయుధ దళాల యూనిట్లు, మున్సిపల్ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
ఈ పరేడ్‌కు ముందు రోజు యూఎస్ఎస్ శాన్ ఆంటోనియో నౌకలో జరిగిన మెరైన్ కార్ప్స్ 251వ వార్షికోత్సవ వేడుకల్లోనూ ఆమె పాల్గొన్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో సుదీర్ఘకాలం చిక్కుకుపోయి, స్పేస్ఎక్స్ క్రూ-9 వెహికల్ ద్వారా భూమికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. సునీతా విలియమ్స్ గతంలో తన అంతరిక్ష ప్రయాణాల్లో భగవద్గీత, ఉపనిషత్తులను కూడా వెంట తీసుకెళ్లడం ద్వారా తన సాంస్కృతిక వేళ్లతో అనుబంధాన్ని చాటుకున్నారు.







