తెలంగాణలో గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్!
నగరాల జీవనశైలిని మార్చేస్తూ, పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి చట్టపరమైన రక్షణ, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేకుండా నిత్యం రోడ్లపై శ్రమించే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, క్యాబ్ డ్రైవర్లు, వివిధ సేవారంగాల కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ‘తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం’ విధివిధానాలను అధికారికంగా ఆవిష్కరించింది. శనివారం హైదరాబాద్‌లోని జయభేరీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
ఈ పథకం ద్వారా గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రెండు అత్యంత కీలకమైన భద్రతలను కల్పిస్తోంది. వృత్తిపరమైన ప్రమాదాలు లేదా ఇతర దురదృష్టకర కారణాలతో కార్మికుడు ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు రూ. 5 లక్షల మేర జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద గిగ్ వర్కర్లకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం వర్తింపజేయనున్నారు. దీనివల్ల నిత్యం టార్గెట్ల ఒత్తిడిలో, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే లక్షలాది మంది కార్మికులకు ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైనా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి
గిగ్ వర్కర్లు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం, ఆదాయం లభించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాహుల్ గాంధీని కలిసి తమ దయనీయ పరిస్థితులను, చట్టపరమైన రక్షణ లేకపోవడాన్ని గిగ్ వర్కర్లు వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అప్పట్లో కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్లాట్‌ఫాం సంస్థలు, వర్కర్ల సంఘాల సలహాలు, అభిప్రాయాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ విధివిధానాలను రూపొందించామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
అంతకుముందు శిల్పకళా వేదిక నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు వందలాది మంది గిగ్ వర్కర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. నేతలు స్వయంగా బైక్‌లపై ప్రయాణించి కార్మికులకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం జయభేరీ గ్రౌండ్స్‌లో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. వారి సుదీర్ఘ పని గంటలు, వేతనాల కోతలు, సంస్థల నుంచి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలోనూ పోరాటం కొనసాగుతుందని భరోసానిచ్చారు.
దేశంలో డిజిటల్ గిగ్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, అసంఘటిత రంగ కార్మికులకు చట్టపరమైన రక్షణ కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాట్‌ఫాం కంపెనీల యాజమాన్యాల ఒత్తిడి మధ్య ఎలాంటి సామాజిక భద్రతకు నోచుకోని శ్రామికులకు ప్రభుత్వమే నేరుగా బీమా, ఆరోగ్య రక్షణ కల్పించడం ఒక విప్లవాత్మక ముందడుగు. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, శ్రామిక లోకానికి ప్రభుత్వం అందించిన బలమైన భరోసా. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్‌ను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతాయనడంలో సందేహం లేదు.







