ఏపీలో మళ్ళీ మొదలైన ఎన్నికల ప్రక్రియ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ శనివారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. న్యాయపరమైన చిక్కుల కారణంగా గతంలో ఎన్నికలు నిలిచిపోయిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఈ విడతలో అత్యంత కీలకమైన శ్రీకాకుళం, కాకినాడ(Kakinada), రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఆశావహులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఆయా పట్టణాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 17వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 19వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అనంతరం ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయా పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. పారదర్శకంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి పార్టీలతో పాటు వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలు ఈ 23 పట్టణ స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.







