భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ డేంజర్ బెల్..!
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్‌లో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన సంస్థ, ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి అత్యవసర స్పందన అయిన గ్రేడ్-3 ఎమర్జెన్సీని ప్రకటించింది. అంతేకాకుండా, ఎల్‌నినో వల్ల అత్యధిక ఆరోగ్య ముప్పు ఎదుర్కొనే హైరిస్క్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కొనసాగనుంది. దీనివల్ల దేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగి వడగాలులు విపరీతంగా వీస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్, ప్రాణాంతకమైన వడదెబ్బ బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణంలో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల వల్ల కేవలం ఎండల తీవ్రతే కాకుండా..
ఇవి కూడా చదవండి
డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు, అంటువ్యాధులు వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు ఇప్పటికే గుండె, కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ ఎండలు, వాతావరణ మార్పులు మరింత ప్రమాదకరంగా మారనున్నాయి. మరోవైపు వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వ్యవసాయ రంగంపై కూడా తీవ్రంగా పడనుంది. పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి, రాబోయే రోజుల్లో ఆహార కొరత, ఆహార సంక్షోభ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటి నుంచే తన ఆరోగ్య రంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంస్థ సూచించింది.







