ట్రంప్ ప్రభుత్వంలో ఎన్విడియా చిప్స్ కలకలం.. స్కాట్ బెస్సెంట్ తీవ్ర విమర్శలు!
కృత్రిమ మేధ (AI) దిగ్గజ సంస్థ ఎన్విడియా(Nvidia) చుట్టూ అలుముకున్న చైనా గూఢచర్యం వ్యవహారం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. అత్యంత శక్తిమంతమైన చిప్స్‌ను చైనాకు ఎగుమతి కాకుండా అడ్డుకోవడంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) తీవ్రమైన కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించే అంశంపై శ్వేతసౌధంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల మధ్య ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ (Scott Bessent) ఒక మీడియా ఇంటర్వ్యూలో ఎన్విడియాతో పాటు వాణిజ్య మంత్రి లుట్నిక్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన చిప్‌ను తయారు చేస్తున్న ఎన్విడియా సంస్థ.. తన అంతర్గత వ్యవహారాల్లో గూఢచర్యాన్ని నిరోధించడంలో తగినంత బలమైన నియంత్రణలను ఏర్పాటు చేసుకోలేదని బెస్సెంట్ ఆరోపించారు. అంతేకాకుండా, చిప్స్ ఎగుమతి ప్రక్రియలో పలు లొసుగులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్(MegaSpeed) సంస్థను నిషిద్ధ సంస్థల జాబితాలో చేర్చాల్సిందిగా గత కొన్ని నెలలుగా కోరుతున్నప్పటికీ, హోవార్డ్ లుట్నిక్ నేతృత్వంలోని వాణిజ్య శాఖ ఆ విషయాన్ని పట్టించుకోలేదని బెస్సెంట్ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. అయితే, వాణిజ్య మంత్రి లుట్నిక్‌పై ట్రంప్‌కు పూర్తి విశ్వాసం ఉందని శ్వేతసౌధం ప్రతినిధి వెల్లడించడం గమనార్హం.
జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత వహిస్తూ వాణిజ్య మంత్రి లుట్నిక్ కచ్చితంగా కాంగ్రెస్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ కెన్నడీ (John Kennedy) స్పష్టం చేశారు. ఎన్విడియా చిప్స్ ఎగుమతులు , గూఢచర్య నిరోధక వైఫల్యాలపై అమెరికా రాజకీయ వర్గాల్లో ఈ వివాదం మరింత ముదురుతోంది.







