అణ్వస్త్రమే అజెండా.. వచ్చేవారం ట్రంప్, పుతిన్, జిన్ పింగ్ కీలక భేటీ..!
అణ్వస్త్ర రేసు రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల దగ్గర వేల అణ్వాయుధాలున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న చివరి అణ్వస్త్ర ఒప్పందం (న్యూ స్టార్ట్) గత ఫిబ్రవరిలోనే ముగిసింది. దీంతో అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద అణు నిల్వలపై ఎలాంటి పరిమితులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో చైనాను కూడా భాగస్వామ్యం చేస్తూ కొత్త ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు.
అయితే, ఈ ప్రతిపాదనపై చైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అమెరికా, రష్యాల వద్ద సుమారు 5,000కు పైగా అణ్వస్త్రాలు ఉండగా, చైనా వద్ద కేవలం 600 మాత్రమే ఉన్నాయని అంచనా. తమకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అణ్వస్త్రాలు ఉన్న దేశాలతో సమానంగా ఒప్పందం చేసుకోవడానికి బీజింగ్ విముఖత చూపుతోంది. అయినప్పటికీ, ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచంలో తమ పెరుగుతున్న పలుకుబడిని, ప్రతిష్టను చాటుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు, అమెరికా, చైనాలతో సమానంగా తమను కూడా ఒక అగ్రరాజ్యంగా ప్రదర్శించుకోవడానికి పుతిన్‌కు ఈ భేటీ ఒక సువర్ణావకాశం. ముఖ్యంగా ఉక్రెయిన్ విషయంలో తామే కీలక నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలు పంపాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుతిన్, జిన్‌పింగ్ మధ్య బలమైన స్నేహబంధం ఉంది. అదే సమయంలో ట్రంప్ కూడా ఇరు నేతలతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచంలోని మూడు అతిపెద్ద అణుశక్తి దేశాలైన అమెరికా, రష్యా, చైనా అధినేతలు ఒకే వేదికపై సమావేశం కానున్నారు. వచ్చే వారం చైనాలోని టెక్ హబ్ షెన్జెన్లో జరిగే ‘ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్’ (ఏపీఈసీ) సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ఈ త్రైపాక్షిక భేటీ జరగనుంది. ఈ మేరకు వైట్ హౌస్ అధికారికంగా ధ్రువీకరించింది.
అయితే, ఈ ముగ్గురు నేతలు కలవడం చరిత్రాత్మకమే అయినప్పటికీ, ఈ చర్చల ద్వారా పెద్దగా ఫలితాలు వస్తాయని ఆశించలేమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ప్రతీకాత్మక సమావేశంగానే మిగిలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.







