నేను పక్కా కాంగ్రెస్ వాదిని.. మోడీతో ఉన్నది స్నేహమే అన్న పిట్రోడా..!
ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా.. తనవ్యాఖ్యలపై విపరీత అర్థాలు తీయొద్దని విమర్శకులు, నేతలకు సూచించారు. ప్రధాని మోడీతో తనకు ఉన్నది కేవలం వ్యక్తిగత స్నేహం మాత్రమేనని, రాజకీయంగా ఆయన సిద్ధాంతాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. మోడీని తన గుజరాతీ మిత్రుడన్న పిట్రోడా.. వ్యక్తిగతంగా ఎంతో ఆప్యాయత చూపిస్తారని, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వ్యక్తని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ శామ్ పిట్రోడా, ఆయన భార్య అంజనా బెన్లకు దీపావళి, గుజరాతీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య సాధారణంగా తీవ్ర రాజకీయ వైరం ఉండే నేపథ్యంలో, వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామంపై శామ్ పిట్రోడా మరోసారి స్పందిస్తూ.. సాధారణ పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడంలో తప్పేముందని, దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. మోడీ ప్రధాని కాకముందు నుంచే ఆయనతో తనకు పరిచయం ఉందని, గతంలో ఆయన ఇంటికి కూడా వెళ్లానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో ప్రధానికి ఉన్న సంబంధాలు వేరని, తనది పూర్తిగా వ్యక్తిగత స్నేహం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను పిట్రోడా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయం, వ్యక్తిగత మర్యాదలు వేర్వేరు అని ఆయన పేర్కొన్నారు.







