ఇంట్లోనే ఉండిపోకండి.. మనసుకు ఉత్సాహం, ప్రశాంతత కోసం ప్రకృతితో ఈ అలవాట్లు చేసుకోండి
ప్రస్తుత జీవనశైలిలో చాలామంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. ఉద్యోగం, ఇంటి పనులు, మొబైల్ ఫోన్ (Mobile Phone), సోషల్ మీడియా (Social Media) కారణంగా ప్రకృతితో గడిపే సమయం తగ్గిపోతోంది. వారాంతాల్లో కూడా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం అలవాటుగా మారింది. అయితే మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం కోసం ఖరీదైన విహారయాత్రలు లేదా కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. పెద్దగా శ్రమ లేకుండా సరదాగా చేసుకోగలిగే కొన్ని అవుట్డోర్ హాబీలను (Outdoor Hobbies) అలవాటు చేసుకుంటే రోజువారీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు.
ప్రకృతితో సమయం గడపడానికి ప్రయత్నించదగిన అలవాట్లు

ముందుగా ప్రయత్నించదగిన అలవాటు నేచర్ వాక్. ప్రతిరోజూ ఒకే మార్గంలో కాకుండా సమీపంలోని పార్కులు (Parks), చెట్లతో నిండిన రహదారులను ఎంచుకోవచ్చు. నడక శారీరక చురుకుదనాన్ని పెంచడమే కాకుండా రోజువారీ పనుల నుంచి కొంత విరామాన్ని అందిస్తుంది. అలాగే దగ్గరలోని పార్కులో చిన్న పిక్నిక్ (Picnic) ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన తేలికపాటి ఆహారం తీసుకెళ్లి పుస్తకం చదవడం లేదా ప్రకృతిని ఆస్వాదిస్తూ సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇంట్లో బాల్కనీ (Balcony) లేదా టెర్రస్ (Terrace) ఉంటే చిన్న తోటను పెంచుకోవచ్చు. తులసి, పుదీనా, కొత్తిమీర వంటి మొక్కలను పెంచుతూ వాటి సంరక్షణకు కొంత సమయం కేటాయించవచ్చు. మొక్కలు పెరుగుతున్న తీరును గమనించడం ఆసక్తికరమైన అనుభవం. అదేవిధంగా ఉదయం లేదా సాయంత్రం పార్కులో కూర్చుని పక్షుల కదలికలు, వాటి శబ్దాలను గమనించవచ్చు. ఇది ప్రకృతిపై ఆసక్తిని పెంచే మంచి అలవాటు.
ఖర్చు లేకుండా సరదాగా సమయం గడిపే మార్గాలు

ఫొటోగ్రఫీ (Photography)పై ఆసక్తి ఉన్నవారు మొబైల్ కెమెరాతోనే ప్రకృతిలోని అందాలను చిత్రీకరించవచ్చు. పూలు, చెట్లు, ఆకాశం, సూర్యాస్తమయం వంటి దృశ్యాలను కొత్త కోణాల్లో ఫొటోలు తీయడం సృజనాత్మకతకు పదును పెడుతుంది. సమీపంలోని చెరువు, సరస్సు లేదా బీచ్ (Beach) వద్ద కొంతసేపు గడపడం కూడా మంచి ఎంపిక. నీటి అలలను గమనిస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు. అలాగే నడక సమయంలో సహజంగా నేలపై రాలిన పూలు, ఆకులను సేకరించి వాటితో అలంకరణ వస్తువులు తయారుచేసుకోవచ్చు. చాక్ పీసులతో నేలపై బొమ్మలు గీయడం, చిన్ననాటి ఆటలను మళ్లీ ప్రయత్నించడం కూడా సరదాగా ఉంటుంది.
వస్తువులు కొనుగోలు చేయకుండా షాపింగ్ ప్రాంతాల్లో తిరుగుతూ కొత్త డిజైన్లు, దుస్తులను చూడటం మరో సులభమైన కాలక్షేపం. దీనినే విండో షాపింగ్ (Window Shopping) అంటారు. రాత్రిపూట నగర వెలుతురుకు దూరంగా ఉన్న సురక్షితమైన ప్రదేశంలో ఆకాశాన్ని గమనిస్తూ చంద్రుడు, నక్షత్రాలను ఆస్వాదించవచ్చు. ఇవన్నీ పెద్దగా ఖర్చు లేకుండా బయట సమయం గడిపేందుకు ఉపయోగపడే మార్గాలు. మొత్తానికి ఇంటి నుంచి బయటకు వెళ్లడం అంటే తప్పనిసరిగా ఎక్కువ శ్రమ పడటం లేదా ఖరీదైన ప్రయాణాలు చేయడం కాదు. మనకు నచ్చిన చిన్న హాబీని ఎంచుకుని రోజులో కొంత సమయాన్ని ప్రకృతితో గడపడానికి కేటాయిస్తే సరిపోతుంది. నిరంతరం స్క్రీన్ల ముందు గడిపే సమయాన్ని తగ్గించి ఇలాంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వడం శారీరక చురుకుదనానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. చిన్న మార్పులతోనే రోజువారీ జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు.







