ఏడు లక్షల కుటుంబాలకు ‘పట్టా’భిషేకం.. దశాబ్దాల నిరీక్షణకు తెర!
సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి జీవిత స్వప్నం. ఆ కలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ, సొంత ఇంటి అసలు పత్రాలు మాత్రం దశాబ్దాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మగ్గిపోయాయి. అప్పు తీరినా హామీగా పెట్టిన పట్టాలు చేతికి రాక ఇబ్బందులు పడుతున్న సుమారు 7 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు తిరిగి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో.. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, వాంబే వంటి గృహ నిర్మాణ పథకాల కింద లక్షలాది మంది పేదలకు ఇళ్లు మంజూరయ్యాయి. ఆ సమయంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సాయం అందేది. అయితే, రుణం మంజూరు చేసే క్రమంలో పూచీకత్తుగా లబ్ధిదారుల అసలు ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను అధికారులు తమ వద్ద ఉంచుకున్నారు. నిబంధనల ప్రకారం రుణం పూర్తిగా చెల్లించిన వెంటనే ఆ పత్రాలను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలి. కానీ, రాష్ట్ర విభజన అనంతరం పాత గృహ నిర్మాణ పథకాలు నిలిచిపోవడం, గృహనిర్మాణ సంస్థ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ ఫైళ్లన్నీ తహసీల్దార్ కార్యాలయాల్లోని బీరువాలకే పరిమితమయ్యాయి.
ఇటీవల సెక్షన్ 22ఏ కింద ఉన్న ఆస్తుల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రుణాలు తీర్చేసినప్పటికీ, కేవలం పత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు పత్రాలు అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి
ఇంట్లో నివాసం ఉంటున్నప్పటికీ, చేతిలో అసలు పట్టా లేకపోవడంతో లబ్ధిదారులు అనేక న్యాయపరమైన, ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఆ ఇంటిపై బ్యాంకుల్లో తనఖా రుణం పొందే అవకాశం లేకుండా పోయింది. తల్లిదండ్రుల తదనంతరం ఆస్తిని పిల్లల పేరు మీదకు వారసత్వ బదిలీ చేయడం కష్టతరమైంది. ఆస్తి వివరాల నిర్ధారణ, ఇతర ప్రభుత్వ ధృవీకరణ పత్రాల జారీలో సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ చిక్కుముడులన్నీ వీడనున్నాయి. అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా అమలు చేయడం అధికారులకు పెద్ద సవాలు. దశాబ్దాల నాటి రికార్డులు కావడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో చెదలు పట్టకుండా మిగిలిన పత్రాలను గుర్తించడం, రుణం పూర్తిగా చెల్లించారా లేదా అని బ్యాంకు రికార్డులతో సరిపోల్చడం కీలకం. ప్రత్యేక శిబిరాల నిర్వహణ తేదీలు, జిల్లాల వారీగా పంపిణీ షెడ్యూల్‌పై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు చేతికి అందినంత మాత్రాన ఆయా ఆస్తులపై ఉన్న అన్ని రకాల చట్టపరమైన నిబంధనలు రద్దవుతాయని భావించకూడదు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లు కావడంతో, వాటి క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నిబంధనలు, నిషేధిత ఆస్తుల చట్టాలు యథావిధిగా వర్తిస్తాయి. ఏదేమైనా, ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన ఏడు లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయం ఒక పెద్ద మానసిక, ఆర్థిక భరోసాను ఇస్తుందనడంలో సందేహం లేదు.







