Instagramలో భారీ మార్పు.. ఇక Reels నుంచే షాపింగ్! Amazonతో కొత్త డీల్ ఇదే!
ఇంతకాలం ఫొటోలు షేర్ చేసుకోవడానికి, స్నేహితులతో మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడిన Instagram.. ఇప్పుడు వ్యాపారాలకు, బ్రాండ్లకు, కంటెంట్ క్రియేటర్లకు కీలక వేదికగా మారబోతోంది. వినియోగదారుల అభిరుచులు మారుతున్న కొద్దీ Instagram కూడా తన వ్యూహాలను మార్చుకుంటోంది. మార్కెట్లో వస్తున్న కొత్త పోటీని గమనిస్తూ, కస్టమర్లకు ఏం కావాలి? క్రియేటర్లను తమ ప్లాట్ఫామ్లో ఎలా కొనసాగించాలి? ఆదాయ మార్గాలను ఎలా పెంచుకోవాలి? అనే అంశాలపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే షాపింగ్, ప్రకటనలు, కంటెంట్ మానిటైజేషన్ వంటి మార్గాల్లో అనేక ప్రయోగాలు చేసిన సంస్థ.. ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. నేరుగా Instagram Reels, Posts నుంచే Amazon ఉత్పత్తులను కొనుగోలు చేసేలా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. మరి ఈ మార్పు వెనుక Instagram అసలు వ్యూహం ఏమిటి?
Reels, Postsలోనే Amazon ఉత్పత్తుల లింకులు!
ఇన్నాళ్లూ Instagramలో క్రియేటర్లు ఏదైనా ఉత్పత్తిని ప్రమోట్ చేయాలంటే తమ ప్రొఫైల్ Bioలో లింక్ పెట్టేవారు. వినియోగదారులు ఆ లింక్ కోసం క్రియేటర్ ప్రొఫైల్లోకి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరాన్ని తగ్గించేలా Instagram కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ Reels, సాధారణ Feed Postsలో నేరుగా Amazon Affiliate Links జోడించవచ్చు.
ఒక్క Reelలో గరిష్టంగా 30 ఉత్పత్తుల లింకులు జోడించవచ్చు.
ఒక సాధారణ Feed Postలో గరిష్టంగా 20 ఉత్పత్తుల లింకులు పెట్టవచ్చు.
వీడియోలో కనిపించే ఉత్పత్తులపై క్లిక్ చేస్తే వాటి వివరాలు, ధరలు Instagramలో కనిపిస్తాయి. అక్కడి నుంచి Amazon యాప్ లేదా వెబ్‌సైట్‌కు వెళ్లి కొనుగోలు చేయవచ్చు.
క్రియేటర్లకు డబ్బులు ఎలా వస్తాయి?
ఈ ఫీచర్లో ప్రధాన ఆకర్షణ Affiliate Marketing. అంటే క్రియేటర్లు తమ కంటెంట్ ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేసి, వాటి అమ్మకాలపై కమీషన్ సంపాదించవచ్చు.
ఉదాహరణకు ఒక ఫ్యాషన్ క్రియేటర్ తన Reelలో ఒక డ్రెస్సు, హ్యాండ్‌బ్యాగ్, షూస్ చూపించారనుకుందాం. వాటికి సంబంధించిన Amazon లింకులను అదే వీడియోలో జోడించవచ్చు. ఆ వీడియో చూసిన వారు లింకుల ద్వారా కొనుగోలు చేస్తే క్రియేటర్‌కు Amazon నుంచి కమీషన్ వస్తుంది.
మరో విశేషం ఏమిటంటే.. క్రియేటర్లు తమ Instagram Professional Dashboardలో Amazon ఖాతాను అనుసంధానం చేసుకోవచ్చు. ఉత్పత్తులను జోడించే సమయంలో వాటికి వచ్చే అంచనా కమీషన్ రేటును కూడా చూడవచ్చు.
అయితే ఈ సదుపాయం ప్రస్తుతం అమెరికాలోని అర్హత కలిగిన క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 18 ఏళ్లు నిండినవారు, 1,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నవారు, Professional Account కలిగినవారు Amazon ప్రోగ్రామ్ నిబంధనలకు అనుగుణంగా ఇందులో పాల్గొనవచ్చు. త్వరలోనే ఇండియాకు తెచ్చే ఆలోచన ఉందని తెలుస్తోంది.
Instagram ఈ ఫీచర్ ఎందుకు తీసుకొచ్చింది?
ఈ మార్పు వెనుక Instagramకు పెద్ద వ్యాపార వ్యూహమే ఉంది. సోషల్ మీడియా వినియోగదారులు ఇప్పుడు కేవలం వీడియోలు చూడటానికే పరిమితం కావడం లేదు. తమకు నచ్చిన వస్తువులను వీడియోల్లో చూసి, వాటి గురించి తెలుసుకుని, వెంటనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ మార్పును Instagram గమనిస్తోంది. వినియోగదారుడు ఒక ఉత్పత్తిని చూసిన దగ్గర నుంచి కొనుగోలు చేసే వరకు మధ్యలో ఉండే దూరాన్ని తగ్గించాలనుకుంటోంది.
Meta తెలిపిన వివరాల ప్రకారం, క్రియేటర్ల Bioలోని లింకులతో పోలిస్తే నేరుగా Posts, Reelsలో ఉండే ప్రొడక్ట్ లింకులకు దాదాపు రెండింతలు క్లిక్‌లు వస్తున్నాయి.
దీంతో Instagramకు మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి.
యూజర్ల అభిరుచులపై అవగాహన: ఏ రకమైన ఉత్పత్తులను వినియోగదారులు చూస్తున్నారు? దేనిపై క్లిక్ చేస్తున్నారు? ఏ వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు? వంటి అంశాలపై మరింత సమాచారం లభిస్తుంది.
క్రియేటర్లను ఆకర్షించడం: Instagram ద్వారానే ఆదాయం సంపాదించే అవకాశాలు పెరిగితే క్రియేటర్లు ఇతర ప్లాట్‌ఫామ్‌ల వైపు వెళ్లకుండా ఇక్కడే కంటెంట్ రూపొందించడానికి ఆసక్తి చూపుతారు.
షాపింగ్ అనుభవాన్ని పెంచడం: వినియోగదారులు ఉత్పత్తులను చూసిన వెంటనే కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుంది. దీంతో Instagram కేవలం వినోద వేదికగా కాకుండా షాపింగ్‌కు కూడా ఉపయోగపడే ప్లాట్‌ఫామ్‌గా ఎదగవచ్చు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ Amazon Affiliate అమ్మకాలపై Meta ప్రస్తుతం ఎలాంటి కమీషన్ తీసుకోవడం లేదు. క్రియేటర్లకు వచ్చే కమీషన్‌ను Amazon చెల్లిస్తుంది.
TikTok, YouTubeతో పోటీ కూడా ఒక కారణమేనా?
Instagram ఈ మార్పు తీసుకురావడానికి మరో ముఖ్యమైన కారణం సోషల్ మీడియా మార్కెట్లో పెరుగుతున్న పోటీ. TikTok ఇప్పటికే TikTok Shop ద్వారా వీడియోల ఆధారంగా ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. YouTube కూడా వీడియోలు, Shorts ద్వారా ఉత్పత్తులను ట్యాగ్ చేసి కమీషన్ సంపాదించే అవకాశాలను కల్పిస్తోంది.
ఈ నేపథ్యంలో Instagram కూడా తన ప్లాట్ఫామ్లోనే కంటెంట్ నుంచి కొనుగోలు వరకు సులభమైన మార్గాన్ని అందించాలని చూస్తోంది.
అంటే వినియోగదారులు ఉత్పత్తుల కోసం వేరే ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించకుండా, Instagramలోనే వాటిని గుర్తించి కొనుగోలు చేసేలా వ్యవస్థను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది.
మరి భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
అమెరికాలో Amazon Affiliate Links కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌కు భారత్‌లో ఇంకా అధికారిక ప్రారంభ తేదీ ప్రకటించలేదు. అయితే భారత్‌లో Instagram ద్వారా Affiliate Shoppingకు సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి.
2026 జూన్‌లో Flipkart గ్రూప్, Metaతో భాగస్వామ్యం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా Flipkart, Myntra ఉత్పత్తులను క్రియేటర్లు తమ కంటెంట్‌లో ట్యాగ్ చేసి, వాటి అమ్మకాలపై కమీషన్ పొందే అవకాశం కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత Facebookలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని Instagramకు విస్తరించే ప్రణాళిక ప్రకటించారు.
అంతేకాదు, 2026 అక్టోబర్‌లో Myntra తన Affiliate Commerce కార్యక్రమాన్ని Instagramలోనూ ప్రారంభించింది. దీంతో భారతీయ క్రియేటర్లు Instagram Posts, Reelsలో Myntra ఉత్పత్తులను ట్యాగ్ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
అయితే Amazon ఫీచర్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై Meta నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
సామాన్య వినియోగదారులకు ఏమిటి ఉపయోగం?
ఈ మార్పుతో కేవలం పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్లకే కాదు.. సాధారణ Instagram వినియోగదారులకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి.
వీడియోలో నచ్చిన ఉత్పత్తిని వెంటనే గుర్తించి కొనుగోలు చేయవచ్చు.
క్రియేటర్ Bioలోకి వెళ్లి లింక్ వెతకాల్సిన అవసరం తగ్గుతుంది.
ఫ్యాషన్, బ్యూటీ, గాడ్జెట్స్, హోమ్ డెకర్ వంటి ఉత్పత్తుల గురించి సులభంగా తెలుసుకోవచ్చు.
ఉత్పత్తుల వివరాలు, ధరలను ఒకేచోట చూడవచ్చు.
అయితే ప్రతి క్రియేటర్ సిఫార్సు చేసే వస్తువును గుడ్డిగా నమ్మి కొనుగోలు చేయకూడదు. ధర, నాణ్యత, కస్టమర్ రివ్యూలు, రిటర్న్ పాలసీ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిది.
Instagram నిజంగానే షాపింగ్ మాల్గా మారుతుందా?
Instagram తీసుకుంటున్న వరుస నిర్ణయాలను పరిశీలిస్తే.. ఆ దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఫొటోలు, వీడియోలకే పరిమితమైన ఈ యాప్.. ఇప్పుడు క్రియేటర్ల ఆదాయం, బ్రాండ్ల ప్రమోషన్, ఉత్పత్తుల పరిచయం, ఆన్లైన్ షాపింగ్ వంటి అనేక అంశాలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది.
అయితే ప్రతి వీడియోలోనూ ఉత్పత్తుల లింకులు కనిపిస్తే వినియోగదారులకు విసుగు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వినోదం, సమాచారం, షాపింగ్ మధ్య సరైన సమతుల్యతను Instagram పాటించాల్సి ఉంటుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







