ఒకప్పుడు బద్ధ శత్రువులు.. ఇప్పుడు ప్రాణ స్నేహితులు! ట్రంప్ టీమ్‌లో ఈ ఊహించని స్నేహం వెనుక కథేంటి?
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శత్రువులవుతారో, ఎప్పుడు మిత్రులవుతారో చెప్పడం కష్టం. నిన్నటివరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నవాళ్లే.. ఈరోజు పక్కపక్కన కూర్చుని భవిష్యత్తు వ్యూహాలు రచించవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో ఇప్పుడు కనిపిస్తున్న ఓ స్నేహం మాత్రం కాస్త స్పెషల్. ఎందుకంటే ఒకప్పుడు ఒకరి రాజకీయ ఎదుగుదలను మరొకరు అడ్డుకోవాలని చూసిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు కలిస్తే విడిపోవడానికి ఇష్టపడటం లేదు. ఆఫీసులోనే కాదు.. ఇళ్లలోనూ, కుటుంబ సమావేశాల్లోనూ వీళ్లిద్దరి స్నేహం కొనసాగుతోంది.
అసలు ఇంతలా మారిపోవడానికి కారణమేంటి?
ఆ ఇద్దరే స్టీఫెన్ మిల్లర్, మార్కో రూబియో. ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరైన మిల్లర్ ప్రస్తుతం వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు. అమెరికా వలస విధానాలు, అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమాల వెనుక ఉన్న ప్రధాన వ్యూహకర్త ఆయనే. మరోవైపు మార్కో రూబియో అమెరికా విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకరు దేశంలోకి ఎవరు రావాలి, ఎవరు వెళ్లిపోవాలి అనే విధానాలపై ప్రభావం చూపిస్తుంటే.. మరొకరు ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాలను నడిపిస్తున్నారు. ఇలాంటి ఇద్దరూ ఇప్పుడు ప్రాణ స్నేహితులైపోవడం వాషింగ్టన్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఒకప్పుడు రూబియోను దెబ్బతీయాలని చూసిన మిల్లర్!
వీళ్లిద్దరి ఇప్పటి స్నేహాన్ని చూస్తే గతంలో ఏం జరిగిందో నమ్మడం కష్టమే. 2015లో రూబియో ఫ్లోరిడా నుంచి యువ సెనేటర్‌గా రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో మిల్లర్ ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు. అప్పట్లో అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్ వద్ద పనిచేస్తున్న మిల్లర్.. రూబియో తీసుకొచ్చిన వలస సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్కరణలు అమలైతే అమెరికాలోకి వలసలు మరింత పెరుగుతాయని ఆయన భావించేవారు. అందుకే రూబియో రాజకీయంగా ఇబ్బందుల్లో పడేలా చేయడానికి కూడా ప్రయత్నించినట్లు తర్వాత బయటపడింది.
బ్రైట్బార్ట్ న్యూస్‌కు మిల్లర్ పంపిన ఓ ఈమెయిల్లో రూబియోకు వ్యతిరేకంగా వచ్చిన కథనాన్ని ప్రచురించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఈమెయిల్స్ 2019లో బయటకు వచ్చాయి. అంతేకాదు, రూబియో నిజాయితీని ప్రశ్నిస్తూ, ఆయన అపరిమిత వలసలను కోరుకునే తీవ్రవాది అంటూ మిల్లర్ అప్పట్లో తీవ్ర విమర్శలు చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అలాంటి ఇద్దరూ ఇప్పుడు ఒకే గదిలో గంటల తరబడి కూర్చుని మాట్లాడుకోవడం చూస్తే రాజకీయాల్లో మార్పులు ఎంత వేగంగా జరుగుతాయో అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి
పుస్తక ఆవిష్కరణ దగ్గరే కనిపించిన మొదటి సంకేతం!
వీరిద్దరి మధ్య మార్పు ఒక్కరోజులో రాలేదు. 2023లో రూబియో రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మిల్లర్ పాల్గొన్నప్పుడు చాలామందికి అసలు విషయం అర్థం కాలేదు. ఎందుకంటే ఒకప్పుడు రూబియోపై తీవ్ర విమర్శలు చేసిన మిల్లర్.. అదే వేదికపై ఆయనను తన మంచి స్నేహితుడిగా, సూత్రాల కోసం నిలబడే సంప్రదాయవాద నాయకుడిగా అభివర్ణించారు. ఈ మాటలు విన్న కొందరు సిబ్బంది ఆశ్చర్యపోయారట. అప్పటికి వీరిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు.
ఇప్పుడు పరిస్థితి మరింత మారిపోయింది. వైట్‌హౌస్‌లో మిల్లర్ కార్యాలయం వీరిద్దరూ తరచూ కలుసుకునే ప్రదేశంగా మారింది. కుటుంబాలతో కలిసి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక ప్రసంగానికి ఎలాంటి పదాలు ఉపయోగించాలనే విషయంలో కూడా రూబియో మిల్లర్ సలహా తీసుకున్నారట. అంటే అధికారికంగా ఒకే ప్రభుత్వంలో పనిచేయకముందే వీరిద్దరి మధ్య స్నేహం బలపడిందన్నమాట.
ఇద్దరినీ కలిపితే ఏదో కొత్త ఐడియా వస్తుందట!
తమ స్నేహం గురించి రూబియోను అడిగితే ఆయన కూడా నవ్వుతూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “మా ఇద్దరి మధ్య ఇలాంటి స్నేహం ఏర్పడుతుందని చాలామంది ఊహించి ఉండరు. కానీ మనం ఎక్కువ కాలం బతికుంటే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో జరుగుతుంటాయి” అని చెప్పారు. మిల్లర్ కూడా తమ అనుబంధం గురించి సరదాగా మాట్లాడారు. “మార్కో, స్టీఫెన్‌లను మరీ ఎక్కువసేపు కలిపి ఉంచకూడదని మా భార్యలు సరదాగా అంటుంటారు. ఎందుకంటే మేమిద్దరం కలిస్తే ఏదో ఒక కొత్త ఆలోచనతో బయటకు వస్తామని వాళ్ల భయం. నిజానికి మేము ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం” అని వెల్లడించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మిల్లర్ భార్య కేటీ మిల్లర్, రూబియో భార్య జీనెట్ రూబియో కూడా తరచూ మాట్లాడుకుంటారట. అంటే ఇది కేవలం ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య ఏర్పడిన స్నేహం మాత్రమే కాదు. రెండు కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. కేటీ మిల్లర్ అయితే తన భర్త, రూబియో ఇద్దరినీ ఏకంగా ‘బెస్టీస్’ అని పిలుస్తున్నారు.
మదురో ట్రాక్సూట్లతో స్నేహానికి మరో ట్విస్ట్!
ఈ ఇద్దరి స్నేహంలో ఒక విచిత్రమైన సంఘటన కూడా ఉంది. వెనిజులాపై అమెరికా దాడి తర్వాత, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన నేపథ్యంలో కేటీ మిల్లర్ తన భర్తకు, రూబియోకు రెండు బహుమతులు ఇచ్చారు. అవి సాధారణ బహుమతులు కావు. మదురో ధరించిన బూడిద రంగు నైక్ ట్రాక్సూట్లను పోలిన దుస్తులు! ఇద్దరికీ ఒకే తరహా ట్రాక్సూట్లు ఇవ్వడంతో వీరి స్నేహం మరోసారి చర్చలోకి వచ్చింది. ఆ తర్వాత రూబియో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో అదే ట్రాక్‌సూట్ ధరించి కనిపించడం మరింత ఆసక్తికరంగా మారింది.
వీళ్లిద్దరూ ఇలా కలిసిమెలిసి ఉండటం ట్రంప్‌కు కూడా కొత్తేమీ కాదు. తన తొలి పదవీకాలంలో ఒకసారి మిల్లర్, రూబియో కలిసి మాట్లాడుకోవడం చూసిన ట్రంప్.. “వావ్.. వీళ్లిద్దరూ ఎంత బాగా కలిసిపోతున్నారో చూడండి!” అని వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
స్నేహం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయా?
ఇప్పుడు ఈ ఇద్దరూ ట్రంప్ ప్రభుత్వంలో కీలక విదేశాంగ నిర్ణయాల రూపకల్పనలో కలిసి పనిచేస్తున్నారు. కరీబియన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్న పడవలపై అమెరికా దాడులు, గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న ట్రంప్ ఆసక్తి వంటి అంశాల్లో వీరిద్దరి పాత్ర కీలకంగా ఉంది. ముఖ్యంగా మిల్లర్ రూపొందిస్తున్న కఠినమైన వలస విధానాలకు రూబియో కూడా గట్టిగా మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ విధానాల వల్ల ఫ్లోరిడాలోని కొందరు వ్యాపారవేత్తలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఉద్యోగులను నియమించుకోవడం కష్టమవుతోందని, వ్యాపార కార్యకలాపాలపైనా ప్రభావం పడుతోందని వారి ఆందోళన.
ఒకప్పుడు రూబియో రాజకీయంగా ఎదగకుండా చూడాలనుకున్న మిల్లర్.. ఇప్పుడు ఆయనతో కలిసి అమెరికా భవిష్యత్తు విధానాలపై చర్చిస్తున్నారు. మరి ఇది నిజమైన వ్యక్తిగత స్నేహమా? ఇద్దరి రాజకీయ ఆలోచనలు ఒకే దారిలోకి రావడంతో ఏర్పడిన అనుబంధమా? లేక ట్రంప్ ప్రభుత్వంలో తమ ప్రభావాన్ని మరింత పెంచుకునే రాజకీయ కలయికా? ఏదేమైనా.. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు ట్రంప్ టీమ్‌లో విడదీయలేని జోడీగా మారడం మాత్రం ఆసక్తికరమే!
— సూర్య ప్రకాశ్ జోశ్యుల







