అమెరికా రక్షణ మత్రికి సాధారణ సైనికుడి వార్నింగ్.. అమర సైనికుల సమాధి దగ్గర అసలేం జరిగింది?
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు ఓ సాధారణ సైనికుడు బహిరంగంగా క్లాస్ పీకడం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. దేశ రక్షణ శాఖను నడిపించే మంత్రికే ఓ సైనికుడు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? పైగా తనను మందలించిన ఆ సైనికుడికే మరుసటి రోజు హెగ్సెత్ మెడల్ ప్రకటించడం వెనుక ఏం జరిగింది? ఇదంతా జరిగింది అమెరికా అమర సైనికుల సమాధి దగ్గర. వెటరన్స్ డే సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో అసలేం జరిగిందో చూద్దాం.
అమర సైనికుల సమాధి దగ్గరకు వెళ్లిన హెగ్సెత్
అమెరికాలోని అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో ‘టూంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్’ పేరుతో ఒక ప్రత్యేకమైన స్మారక సమాధి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి, ఎవరో కూడా గుర్తించలేకపోయిన సైనికుల జ్ఞాపకార్థం 1921లో దీన్ని నిర్మించారు. ఆ తర్వాత ఇతర యుద్ధాల్లో గుర్తుతెలియని సైనికుల అవశేషాలను కూడా ఇందులో చేర్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులందరికీ ప్రతీకగా ఈ సమాధిని అమెరికా భావిస్తుంది.
అందుకే అక్కడికి వెళ్లేవారు సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ముఖ్యంగా గార్డులు విధులు నిర్వహించే సమయంలో అక్కడి వాతావరణం మరింత గంభీరంగా ఉంటుంది. అలాంటి ప్రదేశానికి నవంబర్ 11న వెటరన్స్ డే సందర్భంగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్యతో పాటు పలువురు ఉన్నతాధికారులతో కలిసి వెళ్లారు.
నవ్వుతూ మాట్లాడుకుంటున్న బృందం.. మధ్యలో సైనికుడి హెచ్చరిక
అక్కడ పూలమాలలు సమర్పించే కార్యక్రమం జరుగుతున్న సమయంలో హెగ్సెత్ బృందం నవ్వుతూ, పెద్దగా మాట్లాడుకుంటూ కనిపించింది. అది సాధారణంగా సందర్శకులు మాట్లాడుకునే ప్రదేశం కాదు. అమర సైనికుల సమాధి దగ్గర ఎప్పుడూ నిశ్శబ్దం, గౌరవం పాటించాలన్నది అక్కడి కఠినమైన నియమం.
దీంతో అక్కడ విధుల్లో ఉన్న అమెరికా సైన్యంలోని ‘ది ఓల్డ్ గార్డ్’ విభాగానికి చెందిన స్పెషల్స్ట్ థామస్ ఇగ్లేసియాస్ వెంటనే స్పందించాడు. హెగ్సెత్ బృందాన్ని ఉద్దేశించి గట్టిగా హెచ్చరిస్తూ, సందర్శకులందరూ ఎల్లప్పుడూ నిశ్శబ్దాన్ని, గౌరవాన్ని పాటించాలని స్పష్టం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో రక్షణ మంత్రి ప్రవర్తనపై విమర్శలు మొదలయ్యాయి.
తనను మందలించిన సైనికుడికే మెడల్ ప్రకటించిన మంత్రి
ఈ ఘటన తర్వాత మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. తనను, తన బృందాన్ని హెచ్చరించిన సైనికుడిపై హెగ్సెత్ చర్యలు తీసుకుంటారని కొందరు భావించి ఉండొచ్చు. కానీ జరిగింది వేరు. నవంబర్ 12న అదే సైనికుడు థామస్ ఇగ్లేసియాస్కు జాయింట్ సర్వీస్ కమండేషన్ మెడల్ ప్రకటించారు.
నవంబర్ 11న టూంబ్ ఆఫ్ ది అన్నోన్ వద్ద తన విధులను సమర్థంగా నిర్వహించినందుకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే తన ప్రవర్తనను ప్రశ్నించిన సైనికుడి విధి నిర్వహణను రక్షణ మంత్రే అభినందించారు. అయితే ఈ మెడల్ ప్రకటనతో అంతకుముందు జరిగిన ఘటనపై చర్చ ఆగిపోలేదు.
ఈ సమాధి దగ్గర మౌనం ఎందుకంత ముఖ్యం?
అర్లింగ్టన్లోని ఈ సమాధి దగ్గర గార్డులు కేవలం కాపలా కాయడం మాత్రమే చేయరు. వాళ్లు పాటించే ప్రతి కదలికకు ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ ఉంటుంది. మొత్తం 21 అడుగులు నడవడం, వెనక్కి తిరగడం, మళ్లీ అదే పద్ధతిలో నడవడం.. ఇలా ప్రతి కదలికా నిర్దేశించిన నియమాల ప్రకారమే సాగుతుంది. వారి బూట్లకు ఉన్న లోహపు పలకలు రాతి నేలను తాకినప్పుడు వచ్చే శబ్దం కూడా అక్కడి నిశ్శబ్దంలో ప్రత్యేకంగా వినిపిస్తుంది.
ఈ గార్డుల విధులు 24 గంటలూ కొనసాగుతాయి. వర్షం పడినా, ఎండ వచ్చినా ఆ సమాధి దగ్గర కాపలా ఆగదు. 1937 నుంచి ఈ స్మారక చిహ్నం వద్ద నిరంతర గార్డు పర్యవేక్షణ కొనసాగుతోంది. అందుకే అక్కడ ఎవరైనా గట్టిగా మాట్లాడినా, నవ్వినా గార్డులు వెంటనే హెచ్చరిస్తారు. ఇది హెగ్సెత్కు మాత్రమే వర్తించే నియమం కాదు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
ఇది కేవలం హెగ్సెత్పై వచ్చిన విమర్శేనా?
ఈ ఘటన బయటకు వచ్చిన సమయంలో హెగ్సెత్ రాజకీయంగానూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్ యుద్ధం, సైనిక ఉన్నతాధికారుల తొలగింపులు, అమెరికా సైనిక చర్యలపై విమర్శలు వంటి అంశాలతో ఆయన ఇప్పటికే వార్తల్లో ఉన్నారు. అంతేకాదు, ఆయనను అభిశంసించాలంటూ వచ్చిన ప్రయత్నం కూడా నవంబర్ 10న ప్రతినిధుల సభలో విఫలమైంది.
ఇలాంటి సమయంలో అమర సైనికుల సమాధి దగ్గర జరిగిన ఈ ఘటన ఆయనపై విమర్శలకు మరో కారణమైంది. అయితే పెంటగాన్ మాత్రం సైనికుడి చర్యను సమర్థించింది. సందర్శకులంతా అక్కడి గౌరవప్రదమైన వాతావరణాన్ని పాటించేలా ఆ సైనికుడు సరిగ్గానే గుర్తుచేశాడని అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పష్టం చేశారు.
ఏదైమైనా…
ఈ మొత్తం వ్యవహారంలో ఒక సాధారణ సైనికుడి విధి నిర్వహణే ప్రధానంగా నిలిచింది. దేశ రక్షణ మంత్రైనా, సాధారణ పర్యాటకుడైనా అమరుల సమాధి ముందు ఒకటే నియమం వర్తిస్తుందని అతడు గుర్తుచేశాడు. అధికారంలో ఉన్నవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ఈ ఘటన మరోసారి చాటింది.
దేశం కోసం ప్రాణాలిచ్చిన సైనికుల ముందు పెద్ద పదవులు, హోదాలు పనిచేయవు. అక్కడ గౌరవం మాత్రమే ముఖ్యం. ఆ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రికి గుర్తుచేసింది కూడా ఒక సాధారణ సైనికుడే!
— సూర్య ప్రకాశ్ జోశ్యుల







