వాషింగ్టన్లో ‘డర్టీ బాంబ్’ దాడికి ప్లాన్? ట్రంప్ టీమ్‌నే టార్గెట్ చేసిందా ఇరాన్?
అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం, సైనిక దాడులు, ఆర్థిక ఆంక్షలతో పరిస్థితులు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇరాన్ మరో అడుగు ముందుకేసి అమెరికా రాజధాని వాషింగ్టన్నే టార్గెట్ చేసుకుందా? యుద్ధ విమానాలు, క్షిపణులతో కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా అమెరికా గడ్డపైనే ‘డర్టీ బాంబ్’తో కల్లోలం సృష్టించాలన్నదే ఆ ప్లానా? ఏకంగా ట్రంప్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులనే టార్గెట్ చేసుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందిందన్న వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే ఇరాన్‌పై సైనిక ఒత్తిడి, ఆర్థిక దిగ్బంధనంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికాకు.. ఇప్పుడు సొంత రాజధానిలోనే కొత్త ముప్పు ఎదురవుతోందా? అసలు ఈ డర్టీ బాంబ్ వెనుక కథేంటి? ఇరాన్ నిజంగానే ఇంతటి దాడికి సిద్ధమవుతోందా?
ట్రంప్ టీమ్‌నే టార్గెట్ చేసుకుందా?
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొన్ని దాడి ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ ప్రణాళికల్లో కేవలం ఆలోచనలు మాత్రమే కాకుండా.. నిర్దిష్ట ప్రాంతాలు, లక్ష్యాల వివరాలు కూడా ఉన్నట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే ఇదంతా వెంటనే దాడి చేయబోతున్నారనే సంకేతం కాదని, అవసరమైతే ఉపయోగించుకునేందుకు ఇరాన్ తనకు కొన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందని మరోవైపు అధికారులు చెబుతున్నారు.
నవంబర్ 16న సీఎన్ఎన్ సహా పలు అమెరికా మీడియా సంస్థలు కనీసం ఏడుగురు అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలను బయటపెట్టాయి. దీంతో అమెరికా భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అసలు ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? ఒకవేళ దాడికి ప్రయత్నిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలపై గత వారంలోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఇరాన్ వద్ద ఈ ప్రణాళికలను అమలు చేయడానికి అవసరమైన వ్యక్తులు, వనరులు సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నది మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది.
అసలు డర్టీ బాంబ్ అంటే ఏంటి?
ఈ మధ్య కాలంలో వార్తలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘డర్టీ బాంబ్’. పేరు వింటేనే ఏదో అణుబాంబులాంటి భారీ విధ్వంసక ఆయుధం అనిపించవచ్చు. కానీ ఇది అణుబాంబు కాదు. సాధారణ పేలుడు పదార్థాలతో పాటు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసే బాంబు ఇది. సాధారణ బాంబు పేలినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
ఇక్కడ అసలు సమస్య పేలుడు వల్ల జరిగే నష్టం మాత్రమే కాదు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కలుషితమైందనే భయం ప్రజల్లో మొదలవుతుంది. ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి రావచ్చు. రేడియోధార్మిక కాలుష్యాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు కూడా నిలిచిపోవచ్చు. అంటే భారీ అణు విస్ఫోటనం లేకుండానే ఒక నగరంలో భయాందోళనలు సృష్టించి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయగలగడం దీని ప్రధాన ప్రమాదం. అందుకే దీనిని చాలామంది ‘టెర్రర్ వెపన్’గా పిలుస్తారు.
అమెరికా గడ్డపైనే సామగ్రి దాచారా?
ఈ వ్యవహారంలో మరో విషయం అమెరికా నిఘా వర్గాలను కలవరపెడుతోంది. ఇరాన్‌కు సంబంధించిన కొన్ని కమ్యూనికేషన్లను అమెరికా ఏజెన్సీలు అడ్డుకున్నట్లు సమాచారం. వాటిలో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగపడే అవకాశం ఉన్న సామగ్రిని ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రహస్యంగా దాచినట్లు ప్రస్తావన ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
అంటే అమెరికాలోకి అవసరమైన సామగ్రిని ముందుగానే చేర్చారా? వాటిని ఏదైనా దాడి కోసం ఉపయోగించాలనుకుంటున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ సమాచారం ఎంతవరకు నిజమన్న దానిపై అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సామగ్రి నిజంగా ఉందా? ఉంటే దాని వెనుక ఉద్దేశం ఏంటి? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయినప్పటికీ ఇలాంటి సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అమెరికా భావిస్తోంది.
వైట్‌హౌస్ ఏమంటోంది?
ఈ వార్తలపై వైట్‌హౌస్ కూడా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి లారెన్ బిస్ మాట్లాడుతూ.. అమెరికాకు ఎదురయ్యే అన్ని రకాల సంభావ్య ముప్పులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతానికి అమెరికా ప్రధాన భూభాగానికి ఎలాంటి విశ్వసనీయమైన ముప్పు లేదని స్పష్టం చేశారు. అంటే నిఘా సమాచారాన్ని పరిశీలిస్తున్నప్పటికీ, తక్షణ దాడి జరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ప్రకటించలేదు.
మరోవైపు ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఆయుధాల వినియోగాన్ని తాము పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్యగా భావిస్తామని, తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ మిషన్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే అమెరికా వెల్లడించిన డర్టీ బాంబ్ నిఘా సమాచారంపై మాత్రం నేరుగా స్పందించలేదు.
యుద్ధం మరో మలుపు తిరగబోతోందా?
ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు అంత ప్రశాంతంగా ఏమీ లేవు. అమెరికా సైనిక దాడులు, తిరిగి దాడులు జరగవచ్చన్న హెచ్చరికలు, ఇరాన్‌పై కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధనం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా రాజధానిలోనే దాడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయన్న సమాచారం బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







