శ్రీజారెడ్డి మిస్సింగ్ కేసు : ఆచూకీ కోసం రంగంలోకి అమెరికా డిటెక్టివ్ లు
అమెరికాలోని బోస్టన్ లో తప్పిపోయిన నల్గొండ యువతి కోయ శ్రీజారెడ్డి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శ్రీజ మిస్ అయిపోయి, 14 రోజులు గడిచిపోయాయి. అయినా శ్రీజారెడ్డి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఆచూకీ కోసం అటు బోస్టన్ పోలీసులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా తనవంతు ప్రయత్నాలను ముమ్మరంగా ప్రారంభించారు.
ఇందులో భాగంగా స్వయంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అమెరికాకి వెళ్లారు. శ్రీజ వుంటున్న ఇంటికి కూడా వెళ్లారు. శ్రీజారెడ్డికి సన్నిహితంగా వుండే స్నేహితులతో కూడా మాట్లాడారు.శ్రీజారెడ్డి వ్యక్తిత్వం, అకాడమిక్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శ్రీజారెడ్డి ఆచూకీ కోసం అమెరికాలోని అధికారులతో కూడా మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
అయితే.. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అద్దంకి పేర్కొంటున్నారు. ఈ మధ్యే శ్రీజారెడ్డికి ఉద్యోగం కూడా వచ్చినట్లు స్నేహితులు చెప్పారన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందుల్లో వున్నారని, అసలు ఏం జరిగింది? అనే కంటే.. ఎక్కడుందిపోయింది అన్న బాధే తల్లిదండ్రులను తీవ్ర టెన్షన్ కి, ఆవేదనకు గురి చేస్తోందని చెప్పుకొచ్చారు.

మరోవైపు శ్రీజారెడ్డి కేసులో అమెరికాలోని డిటెక్టివ్ లు కూడా అత్యంత సీక్రెట్ గా రంగంలోకి దిగి, సీరియస్ గా వర్క్ అవుట్ చేస్తున్నారని వెల్లడించారు. శ్రీజారెడ్డి వ్యవహారం అంతా మిస్టరీ, సస్పెన్స్ గా వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రతి చోటా సీసీ టీవీలు వుంటాయని, పోలీసు వెహికల్స్ కూడా వుంటాయని, బీచ్ దగ్గర ఆమె ఫోన్ కూడా దొరికిందని, ఒకవేళ కిడ్నాప్ అయితే మాత్రం అమెరికా పోలీసులు అత్యంత సులభంగా కేసును ఛేదిస్తారని, వారికి ఆ సత్తా వుందని దయాకర్ విశ్లేషించారు. అంతేకాకుండా బీచ్ దగ్గరే ఉద్దేశపూర్వకంగా సెల్ ఫోన్ వదిలేసి, ఎక్కడికైనా వెళ్లిపోయిందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.







