సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్ఓసీ ఇవ్వండి .. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ జారీ చేయాలని కోరారు.
ఎల్నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు.
సీఎం విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.
ఐఐటీ ఖరగ్పూర్ అధ్యయనం ప్రకారం, పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్గఢ్లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతుంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదు.
అధ్యయనం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.







