కోర్టులో ట్రంప్ కి షాక్.. విద్యార్థులకు భారీ ఊరట..
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో వారికి భారీ ఊరట లభించింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల నివాస గడువు పరిమితికి సంబంధించి ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనను ఫెడరల్ కోర్ట్ కొట్టేసింది.
వారి వీసా కాలపరిమితిని కుదిస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను కొట్టేసింది. సోమవారం బోస్టన్లోని మసాచుసెట్స్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ తీర్పు వెలువరించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) రూపొందించిన ఈ నూతన విధానం ఏకపక్షంగా, అహేతుకంగా, చట్టవిరుద్ధంగా ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ కేసును విచారణ సమయంలో.. ఫెడరల్ జడ్జి ఎఫ్. డెన్నిస్ స్లేయర్ హోంల్యాండ్ సెక్యూరిటీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నిబంధన పూర్తిగా ఏకపక్షంగా ఉందని, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులకు అమెరికాలో అవకాశాలు కల్పించడం అనేది యూఎస్ కాంగ్రెస్ పరిధిలోని అంశమని, దానిని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో F వీసాలున్న విదేశీ విద్యార్థులు, J వీసాలున్న పరిశోధకులు, ప్రొఫెసర్లు, I వీసాలున్న విదేశీ జర్నలిస్టులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇప్పటివరకు ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నిబంధన ప్రకారం.. విదేశీ విద్యార్థులు (ఎఫ్-1, జే-1 వీసాదారులు) తమ కోర్సు పూర్తయ్యేంతవరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలుకుతూ విద్యార్థుల వీసా గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టింది. అలాగే విదేశీ జర్నలిస్టుల ఐ-వీసా గడువును ఐదేళ్ల నుంచి కేవలం 240 రోజులకు (సుమారు 8 నెలలు), చైనా జర్నలిస్టులకు 90 రోజులకు కుదించింది. దీనిని సవాలు చేస్తూ విశ్వవిద్యాలయాల సంఘాలు, అధ్యాపకులు, కార్మిక, జర్నలిస్టు సంఘాల కూటమి ఆగస్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సెప్టెంబరులో ఈ నిబంధనల అమలుపై తాత్కాలిక స్టే విధించిన న్యాయమూర్తి, తాజాగా వాటిని పూర్తిగా కొట్టివేశారు.







