15 ఏళ్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ.. ఫోన్ స్కాన్‌తో నకిలీ మందులుకు చెక్!!
ఒక మందు నిజమైనదో, నకిలీదో తెలుసుకోవాలంటే ల్యాబ్‌కు వెళ్లాల్సిందేనా? శరీరంలో నీటి కొరత ఉందో లేదో తెలుసుకోవడానికి వందల రూపాయలు ఖర్చు చేయాల్సిందేనా? ఇకపై అలాంటి అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఓ 15 ఏళ్ల విద్యార్థిని రెండు వినూత్న ఆవిష్కరణల వైపు నడిపించింది. జైపూర్‌కు చెందిన ధ్రువ్ శర్మ రూపొందించిన రెండు రకాల టెస్టింగ్ స్ట్రిప్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. వీటికి భారత ప్రభుత్వం నుంచి రెండు పేటెంట్లు కూడా లభించాయి. ముఖ్యంగా రూ.50 నుంచి రూ.60కే అందుబాటులోకి తీసుకురావాలన్నది ధ్రువ్ లక్ష్యం.
ఇంట్లో జరిగిన చర్చే ఆలోచనకు పునాది!
జైపూర్‌లోని జైశ్రీ పెరీవాల్ గ్లోబల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ధ్రువ్ శర్మకు చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి ఉంది. అతడి తండ్రి డాక్టర్ రిషి శర్మ క్యాన్సర్ నిపుణుడు. ఇంట్లో తరచూ యాంటీబయాటిక్ మందులు పనిచేయకపోవడం, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు ప్రభావం కోల్పోవడం వంటి అంశాలపై చర్చలు జరిగేవి. ఈ విషయాలను గమనించిన ధ్రువ్‌కు ఒక సందేహం వచ్చింది. ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోలేని పేద ప్రజలు తమకు అవసరమైన పరీక్షలను తక్కువ ఖర్చుతో చేసుకునే మార్గం లేదా? అన్న ఆలోచన అతడిని కొత్త ప్రయోగాల వైపు తీసుకెళ్లింది.
నకిలీ మందులను పట్టించే మొదటి స్ట్రిప్!
ధ్రువ్ రూపొందించిన మొదటి టెస్టింగ్ స్ట్రిప్ యాంటీబయాటిక్ మందుల నాణ్యతను ప్రాథమికంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం మందును కొద్దిగా నీటిలో కరిగించి, ఆ ద్రావణం నుంచి ఒక చుక్కను స్ట్రిప్‌పై వేయాలి. ఆ తర్వాత 30 నుంచి 90 సెకన్లలో దాని రంగు మారుతుంది. ఈ రంగు మార్పు ఆధారంగా మందులో అవసరమైన క్రియాశీల ఔషధ పదార్థం ఉందా లేదా అనే విషయాన్ని ప్రాథమికంగా గుర్తించేలా దీనిని రూపొందిస్తున్నారు. గర్భధారణ పరీక్షలో ఉపయోగించే ప్రెగ్నెన్సీ కిట్ తరహాలో ఇది పనిచేయాలన్నది ఆలోచన.
ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారికి సరైన మందులు అందడం ఎంతో ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్ట్రిప్ ఉపయోగపడే అవకాశం ఉంది.
శరీరంలో నీటి కొరతను కూడా గుర్తించవచ్చా?
రెండో టెస్టింగ్ స్ట్రిప్ మరింత ఆసక్తికరంగా ఉంది. మన శరీరంలో నీటి కొరత ఉందా? అవసరమైన ఖనిజ లవణాలు సమతుల్యంగా ఉన్నాయా? ఐరన్ లోపం ఉందా? వంటి అంశాలను ప్రాథమికంగా గుర్తించేందుకు దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం లాలాజలం లేదా మూత్రం నుంచి ఒక చుక్కను స్ట్రిప్‌పై వేయాల్సి ఉంటుంది. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లకు సంబంధించిన సూచనలను గుర్తించడంతోపాటు ఐరన్ లోపానికి సంబంధించిన సమాచారాన్ని అందించేలా ఈ సాంకేతికతను రూపొందిస్తున్నారు.
శరీరంలో నీరు తగ్గిపోవడం, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినడం చిన్న సమస్యలేమీ కావు. ముఖ్యంగా ఎండాకాలంలో, వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు శరీరం నుంచి నీరు, లవణాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతాయి. వీటిని పట్టించుకోకపోతే కండరాల బలహీనత, తల తిరగడం, గుండె కొట్టుకునే తీరులో మార్పులు వంటి సమస్యలు రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో మూత్రపిండాలపైనా ప్రభావం పడుతుంది.
ఫోన్‌తో స్కాన్ చేస్తే ఫలితం తెలిసిపోతుందా?
ఈ రెండు స్ట్రిప్స్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. వీటిని స్మార్ట్‌ఫోన్, క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో అనుసంధానించాలని ధ్రువ్ భావిస్తున్నాడు. స్ట్రిప్ రంగు మారిన తర్వాత ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, ప్రత్యేక యాప్ ఆ రంగును విశ్లేషించి ఫలితాన్ని తెలియజేస్తుంది. ఫలితం సాధారణంగా ఉందా? ఏదైనా లోపం కనిపిస్తోందా? ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరమా? అనే విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. రంగులను గుర్తించడంలో ఇబ్బంది ఉన్నవారికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
రూ.300 పరీక్షను రూ.50కే అందించాలన్న లక్ష్యం!
ఈ ఆవిష్కరణల వెనుక ధ్రువ్‌కు ఉన్న ప్రధాన ఆలోచన ఒక్కటే.. పరీక్షలు అందరికీ అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ఎలక్ట్రోలైట్ పరీక్షకే రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చవుతుండగా, యాంటీబయాటిక్స్ నాణ్యతను పరీక్షించడానికి రూ.1,000కు పైగా ఖర్చయ్యే సందర్భాలు ఉన్నాయి. అందుకే తన టెస్టింగ్ స్ట్రిప్స్ ధరను రూ.50 నుంచి రూ.60 మధ్యలో ఉంచాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఎనిమిదో తరగతిలో సైన్స్ పాఠంలో పేపర్ క్రోమాటోగ్రఫీ గురించి తెలుసుకుంటున్న సమయంలోనే ధ్రువ్‌కు ఈ ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం తన పాఠశాల ప్రయోగశాలలో ఉపాధ్యాయులు, తండ్రి సహకారంతో ప్రోటోటైప్లను అభివృద్ధి చేస్తున్నాడు. జనానా ఆసుపత్రిలో డాక్టర్ అనితా సింబ్లాట్ మార్గదర్శకత్వంలో ఇంటర్న్‌షిప్ కూడా చేస్తున్నాడు.
పేటెంట్లు వచ్చాయి.. అసలైన పరీక్ష ఇప్పుడే!
రెండు పేటెంట్లు రావడం గొప్ప విజయమే అయినా, వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా కొన్ని కీలక దశలు పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఈ స్ట్రిప్స్ ఎంత కచ్చితంగా పనిచేస్తాయో నిర్ధారించాలి. ఇందుకోసం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ వంటి సంస్థలో 100 నుంచి 200 నమూనాలపై పరీక్షలు నిర్వహించాలని ప్రణాళిక ఉంది. ఆ తర్వాత వైద్య పరీక్షలకు సంబంధించిన నియంత్రణ సంస్థల అనుమతులు పొందాలి. అన్నీ సజావుగా పూర్తయితే భారీ స్థాయిలో తయారీ చేపట్టాల్సి ఉంటుంది.
వచ్చే ఐదేళ్లలో ఈ టెస్టింగ్ స్ట్రిప్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ధ్రువ్ కలలు కంటున్నాడు. మెడికల్ షాపుల్లో మందుల పక్కనే వీటిని అందుబాటులో ఉంచడంతోపాటు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల ద్వారా గ్రామీణ ప్రాంతాలకూ చేరవేయాలని భావిస్తున్నాడు.
చిన్న వయసు.. పెద్ద ఆలోచన!
ధ్రువ్ ఆలోచనలకు వైద్య రంగానికి చెందిన నిపుణుల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. జేఎన్‌యూ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి చెందిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ మాథుర్ అతడికి మార్గదర్శకత్వం అందిస్తున్నారు. పిల్లలను వేధిస్తున్న కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యల పరిష్కారాలపై కూడా పరిశోధన కొనసాగించాలని ఆయన సూచిస్తున్నారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







