ట్రంప్ కి ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. స్పెషల్ ఏంటంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫిలిప్పీన్స్ పర్యటన సందర్భంగా క్వాడ్ (Quad) భాగస్వామ్య దేశాల అధినేతలకు అద్భుతమైన భారతీయ కళాఖండాలు, సంప్రదాయ హస్తకళా వస్తువులను బహుమతులుగా అందించారు. తద్వారా భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, శతాబ్దాల నాటి కళా సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు ఫిలిప్పీన్స్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 23వ ఆసియాన్-భారత్ సదస్సు (ASEAN-India Summit), 21వ తూర్పు ఆసియా సదస్సు (East Asia Summit), అలాగే క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొన్నారు. మనీలాలోని చారిత్రాత్మక గురుద్వారా ఖల్సా దివాన్‌ను కూడా సందర్శించి, దాని పునరాభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ అద్భుతమైన పెయింటింగ్ ని బహుమతిగా ఇచ్చారు. బంగారు పిచ్వాయి పెయింటింగ్ ను ఇచ్చారు. దీనిని రాజస్థాన్ లోని నాథద్వారాలో తయారు చేస్తారు. వస్త్రంపై ఖనిజ వర్ణ ద్రవ్యాలను వినియోగించి తామరలు, ఆవులు, చెట్లు… ఇలా రకరకాల డిజైన్లను తయారు చేస్తారు. వాటిపై వేసే బంగారు పూతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
పిచ్వాయి పెయింటింగ్ ప్రత్యేకత ఇదే…
రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో ఉద్భవించిన గోల్డెన్ పిచ్వాయ్ పెయింటింగ్, అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ సంప్రదాయ వస్త్ర చిత్రకళా రూపం. సూక్ష్మమైన వివరాలు, ఆకర్షణీయమైన రంగులు, విస్తృతమైన చిత్ర కూర్పులకు ఇది పేరుగాంచింది.
సున్నితంగా సిద్ధం చేసిన వస్త్రంపై ఖనిజ వర్ణాలను (మినరల్ పిగ్మెంట్స్) ఉపయోగిస్తూ, సున్నితమైన బంగారు పూతతో ఈ కళాఖండాన్ని రూపొందిస్తారు. ఇందులో తామరపూలు, ఆవులు, చెట్లు, అలంకారమైన అంచులు (బార్డర్స్) వంటి సంప్రదాయ చిహ్నాలు ఉంటాయి. శతాబ్దాల నాటి ఈ కళారూపాన్ని సాధన చేసే కళాకారుల అసాధారణ నైపుణ్యం, ఓర్పు, కచ్చితత్వానికి ఇవి అద్దం పడతాయి.
బంగారం వాడకం వల్ల ఈ చిత్రానికి ప్రత్యేకమైన మెరుపు, రాజసం ఉట్టిపడే రూపం వస్తాయి. భారతదేశ సంప్రదాయ కళా పద్ధతులలో లోతుగా వేళ్లూనుకున్న పిచ్వాయ్ చిత్రాలు, తరతరాలుగా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ, సంప్రదాయ కళాకారుల సమూహాలకు నిరంతర గుర్తింపును, ఆదరణను అందిస్తున్నాయి.







