రేవంత్ పర్యటన వేళ హరీశ్ రావుపై కవిత లేఖాస్త్రం!
సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటనకు వెళ్తున్న వేళ, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుంటూ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రెండు బహిరంగ లేఖలు విడుదల చేశారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభోత్సవంతో సిద్ధిపేట కోటను బద్దలు కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తుండగా, మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల అవినీతిని ఎత్తిచూపుతూ కవిత రాసిన ఈ లేఖలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భారీ ఎత్తున అక్రమాలు, నాణ్యతా లోపాలు జరిగాయని కవిత తన లేఖలో ఆరోపించారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించే కాలువ, టన్నెల్ డిజైన్ల మార్పులు, పంప్ హౌస్ నిర్మాణంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయనకు సన్నిహితులైన కొందరు ఇంజినీర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాపై వందల కోట్ల రూపాయల అదనపు భారం పడిందని, నాసిరకం పనుల కారణంగా మర్కూక్ మండలం వెంకటాపురం గ్రామం నీట మునిగిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన నివేదిక ప్రకారం, ఈ వ్యవహారంలో బాధ్యులైన 28 మంది ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, సంబంధిత నిర్మాణ సంస్థల నుంచి రూ. 230 కోట్లకు పైగా నిధులను రికవరీ చేయాలని విజిలెన్స్ సిఫార్సు చేసిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, “చర్యలు తీసుకుంటారా మిస్టర్ సీఎం?” అంటూ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
అవినీతి ఆరోపణలతో పాటు, సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలపై కవిత మరో లేఖ ద్వారా గళమెత్తారు. మల్లన్న సాగర్ కోసం సుమారు 13,962 ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కోసం 4,636 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, వేలాది మంది నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అందాల్సిన పూర్తిస్థాయి పరిహారం, పునరావాస ప్యాకేజీలు ఇప్పటికీ అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఈ పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే, సిద్ధిపేట కేంద్రంగా త్రిముఖ రాజకీయ వ్యూహం నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావును ఆయన సొంత గడ్డపైనే ఓడించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పథకాలను అస్త్రంగా వాడుకుంటున్నారు. దీనికి ప్రతిగా హరీశ్ రావు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల హామీల అమలులో జాప్యాన్ని ఎండగడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, నవంబర్ 14న సిద్ధం చేసిన లేఖను సీఎం పర్యటన రోజున కవిత బహిర్గతం చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. హరీశ్ రావుపై ఉన్న అవినీతి ఆరోపణలను తెరపైకి తీసుకురావడం ద్వారా ఒకవైపు ఆయనను ఇరుకున పెట్టడం, మరోవైపు చర్యల విషయంలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం ద్వారా కవిత రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు.







