అధ్యక్షుడు ట్రంప్ కి, కుటుంబీకులకు కూడా కష్టాలు ప్రారంభం? విచారణకు రంగం సిద్ధం
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ కి షాక్ తెలిసిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ అవినీతిపై దర్యాప్తుకు డెమోక్రాట్ నేతలు రెడీ అవుతున్నట్లు ఫలితాలు విడుదలైన కాసేపటికే వార్తలు వచ్చాయి. ఇదే విషయంలో తాజాగా మరో వార్త కూడా వెలుగులోకి వస్తోంది. వచ్చే యేడాది జనవరిలో నూతన కాంగ్రెస్ కొలువు దీరనున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనపై విచారణలు చేసేందుకు హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని అగ్రశ్రేణి డెమోక్రాట్ నేతలు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పక్కా పద్ధతి ప్రకారమే ట్రంప్ పై విచారణ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించడంతో కమిటీకి నాయకత్వం వహించనున్న కాలిఫోర్నియా ప్రతినిధి రాబర్ట్ గార్సియా, అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యులు, పరిపాలనలోని ఉన్నతాధికారులకు కీలక పత్రాలను భద్రపరచాలని ఆదేశిస్తూ లేఖలు కూడా పంపారు. రిపబ్లికన్ అధ్యక్షుడిపైనా, ఆయన ప్రభుత్వంపైనా విచారణలు చేపట్టే దిశగా ఇది తొలి అడుగుగా అందరూ భావిస్తున్నారు. విడుదలైన ఈ లేఖల్లో ట్రంప్ కుటుంబ ఆర్థిక లావాదేవీలు, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఫైళ్ల నిర్వహణ వంటి అనేక అంశాలపై విచారణకు ప్రతిపాదించారు.
“ఈ ప్రభుత్వ స్వార్థపూరిత వ్యవహారాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఓవర్‌సైట్ డెమోక్రాట్లు పోరాడుతున్నారు. అమెరికన్లందరికీ మేలు చేసే చట్టాలకు ఈ విచారణలు పునాది వేస్తాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని రాబర్ట్ గార్సియా ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నోటీసులు అందుకున్న వారిలో ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఉన్నారు. అలాగే గ్రీస్ మాజీ రాయబారి కింబర్లీ గిల్ఫోయిల్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మాజీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్‌లకు కూడా వేర్వేరు ఆరోపణలపై నోటీసులు పంపారు.
డెమోక్రాట్ల విచారణ ప్రయత్నాలను వైట్ హౌస్ తీవ్రంగా తోసిపుచ్చింది. న్యాయబద్ధమైన విచారణలకు తాము సహకరిస్తామని, కానీ రాజకీయ ప్రేరేపిత విచారణలను అంగీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. “కష్టపడి పనిచేసే అమెరికన్లకు విజయాలు అందించేందుకు అధ్యక్షుడు ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెమోక్రాట్లు కపట విచారణలు, తీవ్ర వామపక్ష విధానాలను అనుసరిస్తే, వారు అమెరికా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లే” అని వైట్ హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ పేర్కొన్నారు.
మరోవైపు, వైట్ హౌస్ కౌన్సెల్ విల్ షార్ఫ్ డెమోక్రాట్ చట్టసభ సభ్యులకు లేఖ రాస్తూ, ప్రస్తుత కాంగ్రెస్‌లో వారికి మెజారిటీ లేనందున ఈ ఏడాది మిగిలిన కాలానికి వారు కోరిన సమాచారాన్ని ఇవ్వలేమని తేల్చి చెప్పారు. 2022లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన అనుసరించిన వైఖరినే తాము ఉదహరిస్తున్నామని, 119వ కాంగ్రెస్‌లో చేసిన అభ్యర్థనలు 120వ కాంగ్రెస్‌కు వర్తించవని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లు పంపిన లేఖలు కేవలం వేధించే ఉద్దేశంతో కూడుకున్నవని షార్ఫ్ విమర్శించారు.
ఎన్నికల ఫలితాలు డెమోక్రాట్లకు అనుకూలంగా వస్తున్న సమయంలోనే గార్సియా సోషల్ మీడియాలో “లాయర్ అప్” (న్యాయవాదులను సిద్ధం చేసుకోండి) అంటూ హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత నోటీసులు పత్రాలను వెంటనే అప్పగించాలని ఒత్తిడి చేయకపోయినా, జనవరిలో కమిటీపై పూర్తి పట్టు, సమన్లు జారీ చేసే అధికారం (సబ్పోయినా పవర్) లభించగానే డెమోక్రాట్లు చేపట్టబోయే చర్యలకు ఇవి సంకేతంగా నిలుస్తున్నాయి.
మధ్యంతర ఎన్నికలకు ముందే ఎప్స్టీన్ కేసు దర్యాప్తు నిర్వహణ, అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యకలాపాలు, ట్రంప్ కుటుంబ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారిస్తామని గార్సియా ప్రకటించారు. ముఖ్యంగా ఎప్స్టీన్ ఫైళ్లకు సంబంధించి సమాచారాన్ని వైట్ హౌస్ అధికారులు దాచిపెట్టారని, రాజకీయ నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వాన్స్, బ్లాంచ్లకు లేఖలు పంపారు.
అయితే, డెమోక్రాట్లు చేపట్టబోయే ఈ విచారణలు తిరిగి వారిపైనే న్యాయ శాఖ (జస్టిస్ డిపార్ట్మెంట్) విచారణలకు దారితీయవచ్చని వైట్ హౌస్ హెచ్చరించింది. ప్రజాసేవ చేయకుండా అధికారులను భయపెట్టేలా బెదిరింపులకు పాల్పడటం నేరపూరిత చర్య కిందకు రావచ్చని గత వారం షార్ఫ్ రాసిన లేఖలో గార్సియాను హెచ్చరించారు.ప్రభుత్వంలోని ఇతర విభాగాలను నియంత్రించే రాజ్యాంగబద్ధమైన అధికారంలో భాగంగా కాంగ్రెస్‌కు విచారణ జరిపే హక్కులు ఉన్నాయి. గతంలో వాటర్‌గేట్ కుంభకోణం, 9/11 దాడుల నుండి ఇటీవల రిపబ్లికన్లు బైడెన్ కుటుంబంపై జరిపిన విచారణల వరకు అమెరికా ఆధునిక చరిత్రలో ఇటువంటి కాంగ్రెస్ విచారణలు ఎన్నో జరిగాయి.







