డిసెంబర్ 29న శిల్పకళా వేదికలో ఘనంగా ‘తానా’ పురస్కారాల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) ఆధ్వర్యంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ‘తానా పురస్కారాల ప్రదానోత్సవం’ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సమాజంలోని వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు, ప్రతిభ కనబరిచిన 10 మంది ప్రముఖులను ఈ వేదికపై తానా ఘనంగా సత్కరించనుంది. ఈ మేరకు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి వివరాలను వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోనున్న ప్రముఖుల జాబితాలో అమరరాజా గ్రూప్ ఫౌండర్ డా. రామచంద్ర నాయుడు గల్లా, ప్రఖ్యాత పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ (తానా అందె శ్రీ పురస్కారం), శ్రీమతి జమీలా నిషాత్, డా. సునితా కృష్ణన్, జయధీర్ తిరుమల రావు, గడ్డం సమ్మయ్య, చింతకింది మల్లేశం, చింతల వెంకట్ రెడ్డి , దాసరి కొండప్ప తదితరులు ఉన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఈ దిగ్గజాలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో తానా 25వ మహాసభల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు సంస్కృతీసంప్రదాయాలను చాటిచెప్పే ఈ వేడుకను విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు అందరికీ హార్దిక ఆహ్వానం పలుకుతున్నారు.







