ప్రపంచంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ నెంబర్ వన్ ..!
ప్రస్తుతం ప్రపంచం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ఓ వైపు యుద్ధాలు.. మరోవైపు ఉత్పాతాలు.. ఇంకో వైపు మానవ స్వయం తప్పిదాలతో .. పెను సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇలాంటి క్లిష్ట తరుణంలోనూ సత్తా చాటింది భారత ఆర్థిక వ్యవస్థ.
2026-30 కాలానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక నిలకడ (ఎకనామిక్ రెసిలియన్స్) కలిగిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. చైనా, అమెరికా, జపాన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాలను వెనక్కి నెట్టి భారత్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. అసోచామ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాలను ఉటంకిస్తూ ‘ఇన్ఫోఇన్డేటా’ ఎక్స్ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది.
స్థూల ఆర్థిక నిలకడ ర్యాంకింగ్స్లో భారత్ 100కి 71 స్కోరు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. చైనా 66 స్కోరుతో రెండో స్థానంలో నిలవగా.. జపాన్, రష్యా 60 స్కోరుతో సంయుక్తంగా మూడో స్థానాన్ని పొందాయి. ఆ తర్వాత జర్మనీ 59, ఇటలీ, బ్రెజిల్ 53 చొప్పున, బ్రిటన్ 52, ఫ్రాన్స్ 40 స్కోరు సాధించాయి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కేవలం 36 స్కోరుతో అట్టడుగున నిలిచింది. బాహ్య ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడే సత్తాను భారత్ నిరంతరం మెరుగుపరుచుకుంటోందని ఇన్ఫోఇన్డేటా పేర్కొంది.
కీలకమైన ఆర్థిక సూచీల్లోనూ భారతదేశం అద్భుత ప్రదర్శన కనబరిచింది. వాస్తవ జీడీపీ వృద్ధి రేటు (రియల్ జీడీపీ గ్రోత్), తలసరి జీడీపీ వృద్ధి, స్థూల పొదుపు (గ్రాస్ సేవింగ్స్) విభాగాల్లో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. అలాగే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్, ఎగుమతుల వృద్ధిలో రెండో ర్యాంకును.. డెట్-టు-జీడీపీ నిష్పత్తిలో మూడో స్థానాన్ని సాధించింది.
దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైన స్థూల ఆర్థిక మూలాలతో ముడిపడి ఉందని అక్టోబరులోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు అంతర్జాతీయ సవాళ్ల నుంచి దేశాన్ని కాపాడాయని తెలిపింది. 2026-27 మొదటి అర్ధభాగంలో వాణిజ్య ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో దేశ వాణిజ్య లోటు తగ్గింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), ఈసీబీలు, రెమిటెన్స్లు ఆగస్టులో గణనీయంగా పుంజుకున్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ సైతం భారత వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచి 7 శాతానికి సవరించింది.







