ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారుస్తాం: మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ప్రకటించింది. చిప్‌ల తయారీ నుంచి అత్యాధునిక ప్యాకేజింగ్ వరకు ఏపీని ప్రపంచ స్థాయి హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(nara Lokesh) ధీమా వ్యక్తం చేశారు. ఈ రంగంలోకి వచ్చే గ్లోబల్ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సిలికాన్ ఫ్యాబ్‌లకు ఏకంగా 80 శాతం వరకు పెట్టుబడి సబ్సిడీని ఇస్తామని, కేంద్రం అందించే రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను సమకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రెండో దశ ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’కు అనుగుణంగా రాష్ట్ర సెమీకండక్టర్ పాలసీని మరింత సమర్థవంతంగా సవరిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిలో భాగంగా డిస్ప్లే మరియు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లకు 70 శాతం వరకు, అలాగే చిప్ ప్యాకేజింగ్ యూనిట్లకు భారీ స్థాయిలో పెట్టుబడి రాయితీలు అందజేస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ప్రత్యేకంగా 5 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సెమీకండక్టర్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. చిప్ తయారీకి అవసరమైన విద్యుత్, జల వనరులు, రవాణా వంటి అన్ని మౌలిక వసతులను ఒకే చోట కల్పించడంతో పాటు, పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా సింగిల్ విండో విధానంలో అతివేగంగా అనుమతులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు.
ఇవి కూడా చదవండి
కేవలం తయారీ రంగానికే పరిమితం కాకుండా, సెమీకండక్టర్ రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఐఐటీ తిరుపతిలో ప్రత్యేకంగా ‘సెమీకండక్టర్ పరిశోధన కేంద్రం’ను నెలకొల్పుతామని చెప్పారు. భవిష్యత్తులో పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేసేందుకు స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, అంతేకాకుండా శిక్షణ పొందే ప్రతి అభ్యర్థికి నెలకు రూ. 10 వేల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ నిర్ణయాలు కనుక కార్యరూపం దాలిస్తే ఏపీ దేశంలోనే టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలకు ప్రధాన కేంద్రంగా నిలవడమే కాకుండా వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.







