ఆసియాన్ నేతలకు భారత్ సంప్రదాయ కానుకలు…!
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా జరిగిన 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం కీలకాంశాలపై చర్చలు జరిపింది. ఈ కార్యక్రమానికి అమెరికా అధినేత ట్రంప్ సహా ప్రపంచదేశాధినేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. సమావేశం ముగింపు సందర్భంగా పలువురు ప్రపంచ దేశాధినేతలకు ప్రత్యేక కానుకలు అందించారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళానైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఈ బహుమతులను ఎంపిక చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలకు పిచ్వాయి గోల్డెన్ పెయింటింగ్, రాయల్ బ్లూ బనారసీ కాటన్ సిల్క్ స్టోల్, కశ్మీరీ సిల్క్ కార్పెట్ వంటి ప్రత్యేక వస్తువులను బహూకరించారు.
ట్రంప్‌కు బంగారు పిచ్వాయి పెయింటింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో తయారుచేసే బంగారు పిచ్వాయి పెయింటింగ్‌ను మోడీ బహూకరించారు.వస్త్రంపై ఖనిజ వర్ణద్రవ్యాలను ఉపయోగించి తామర పూలు, చెట్లు తదితర ఆకృతులను రూపొందిస్తారు.వాటిపై వేసే బంగారు పూత ఈ చిత్రకళకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియా ప్రధానికి నీలిరంగు కళాఖండం
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు జైపుర్‌లో మట్టితో తయారుచేసిన ప్రత్యేక నీలిరంగు కళాఖండాన్ని ప్రధాని మోడీ బహూకరించారు.ఇది రాజస్థాన్‌కు చెందిన సంప్రదాయ కళ. సాధారణ మట్టికి బదులుగా క్వార్ట్జ్ మిశ్రమంతో దీనిని తయారుచేస్తారు.అందువల్ల ఈ కళాఖండాలు నిగనిగలాడుతూ పారదర్శకంగా కనిపిస్తాయి.ప్రకాశవంతమైన కోబాల్ట్ నీలిరంగు డిజైన్లు వీటి ప్రత్యేకత. పూలు, పక్షులు, ఇతర నమూనాలను కళాకారులు చేతితో చిత్రీకరిస్తారు.
జపాన్ ప్రధానికి బనారసీ స్టూల్
జపాన్ ప్రధాని సనే తకాయిచికి రాయల్ బ్లూ బనారసీ కాటన్ సిల్క్ స్టోల్‌ను మోదీ కానుకగా ఇచ్చారు.ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన బనారస్ వస్త్ర కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రత్యేకమైన రాయల్ బ్లూ రంగు ఈ స్టోల్‌కు మరింత హుందాతనాన్ని జోడించింది.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి కశ్మీరీ కార్పెట్
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌కు మోడీ.. కశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను బహూకరించారు. చేతితో అల్లిన ఈ సంప్రదాయ వస్త్ర కళ కశ్మీర్ అందాలను ప్రతిబింబిస్తుంది. కశ్మీర్లో ప్రసిద్ధి చెందిన పాపియర్-మాచే పెట్టెలో ఉంచిన శాలువాను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా అందించారు.
బ్రూనై, ఇండోనేషియా నేతలకు ప్రత్యేక కానుకలు
బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాకు వెండితో పొదిగిన బిద్రీవేర్ వాజ్‌ను మోడీ బహూకరించారు.ఇది కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సంప్రదాయ లోహపు హస్తకళకు ప్రతీక. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు చోళుల కాలం నాటి కాంస్య శిల్పాన్ని కానుకగా అందించారు.
ఇలా భారతీయ సంస్కృతి, చరిత్ర, కళలు, సంప్రదాయాలకు అద్దం పట్టే అనేక ప్రత్యేక బహుమతులను ఇతర ఆసియాన్ దేశాల నేతలకు కూడా ప్రధాని మోడీ అందించారు.







