ట్రంప్ జుట్టు, మేకప్ కోసం అంత ఖర్చా? సొంత పార్టీ నేతలే రివర్స్?
ఒక దేశ అధ్యక్షుడి జుట్టు, మేకప్ కోసం ఎంత ఖర్చవుతుంది? కొన్ని వేల రూపాయలా? లక్షల్లో ఉంటుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో మాత్రం ఈ లెక్క కాస్త భారీగానే ఉంది. ఆయనతో పాటు ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హెయిర్, మేకప్ కోసం రిపబ్లికన్ పార్టీ ఏకంగా రూ.53,00,000 ఖర్చు చేసినట్లు తాజాగా బయటపడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఈ ఖర్చు వెనుక మరో ఆసక్తికరమైన రాజకీయ కథ ఉంది. ఎందుకంటే ఈ బిల్లు చూసి డెమోక్రాట్లు మాత్రమే కాదు.. ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. అసలు పార్టీ నిధులతో ట్రంప్ జుట్టును సెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చు వివరాలు బయటకు రావడం వెనుక పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు ఏమిటి?
ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్‌తో మొదలైన చర్చ!
ఇటీవల ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 49వ ఆసియాన్ సదస్సుకు హాజరైన ట్రంప్‌ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ కనిపించే బంగారు రంగు జుట్టు ఈసారి కాస్త ముదురు రంగులో కనిపించింది. జుట్టు మరింత దట్టంగా, కొత్త స్టైల్లో ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. విమానంలో ప్రయాణిస్తూనే జుట్టుకు రంగు వేయించుకున్నారంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు.
అయితే ట్రంప్ జుట్టు రంగు మారడం కంటే, ఆయన హెయిర్ స్టైల్ వెనుక జరిగిన ఖర్చు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అమెరికా ఎన్నికల ఆర్థిక వివరాలను పరిశీలించిన NOTUS అనే మీడియా సంస్థ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రిపబ్లికన్ నేషనల్ కమిటీ (RNC) మీడియా ప్రిపరేషన్ పేరుతో 59,000 డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.53,00,000.
ఒక్క హెయిర్, మేకప్ ఆర్టిస్ట్‌కే రూ.48 లక్షలు!
ఈ ఖర్చులో అత్యధిక భాగం ప్రముఖ హెయిర్, మేకప్ ఆర్టిస్ట్ బ్రిటనీ గోయెట్జ్కు చెల్లించినట్లు ది ఇండిపెండెంట్ వెల్లడించింది. ఆమెకు ఏకంగా 53,850 డాలర్లు అంటే సుమారు రూ.48,00,000 చెల్లించినట్లు నివేదిక పేర్కొంది. ఈ సేవలు ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మాజీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వంటి కీలక వ్యక్తులకు కూడా అందినట్లు తెలుస్తోంది.
ఇక్కడే రిపబ్లికన్ పార్టీలో ప్రశ్నలు మొదలయ్యాయి. పార్టీ నిధులు అంటే ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల గెలుపు, రాజకీయ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన డబ్బు. అలాంటిది అధ్యక్షుడి హెయిర్, మేకప్ ఖర్చులకు కూడా పార్టీ డబ్బు ఎందుకు వెచ్చించాలి? ఇదే ఇప్పుడు కొందరు రిపబ్లికన్ నేతలకు వచ్చిన సందేహం. అయితే ఈ వివాదం కేవలం హెయిర్, మేకప్ బిల్లుతోనే ఆగిపోలేదు.
ఎన్నికల్లో ఓటమి.. పార్టీ ఖర్చులపై ఆడిట్ డిమాండ్!
2026 నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఎన్నికల కోసం డెమోక్రాట్ల కంటే ఎక్కువ నిధులు సమీకరించినప్పటికీ, ఆర్థిక బలాన్ని విజయాలుగా మార్చుకోలేకపోయారన్న విమర్శలు మొదలయ్యాయి. దీంతో పార్టీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ ఖర్చయింది? దాని వల్ల ఎన్నికల్లో పార్టీకి ఏం ప్రయోజనం కలిగింది? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి
టెన్నెసీకి చెందిన RNC సభ్యుడు ఆస్కార్ బ్రాక్ పార్టీ ఖర్చులపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు మద్దతు పెరుగుతోందని ఆయన అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. అంటే సభ్యులు ఇప్పుడు అడుగుతున్నది కేవలం ట్రంప్ మేకప్ బిల్లు లెక్కలు మాత్రమే కాదు. పార్టీ నిధుల వినియోగంపై పూర్తి వివరాలు కావాలన్నది వారి డిమాండ్.
ఇంకా కొన్ని ఖర్చులపైనా సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక గోల్ఫ్ ఈవెంట్లో హాస్పిటాలిటీ స్పేస్ కోసం 22,500 డాలర్లు అంటే సుమారు రూ.20,00,000 చెల్లించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ కుమార్తె కరోలిన్ వైల్స్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్పైనా ప్రశ్నలు వచ్చాయి. ఇలా ఒక్కో ఖర్చు బయటపడుతుండటంతో పార్టీ ఆర్థిక వ్యవహారాలపై అసంతృప్తి పెరుగుతోంది.
ట్రంప్‌కు కూడా షాక్.. సొంత పార్టీ నేత నుంచే సవాలు!
ఈ ఖర్చు పై విమర్శలు వస్తున్న సమయంలోనే RNCలో రెండో స్థానంలో ఉన్న కే.సీ. క్రాస్బీ నాయకత్వానికి సవాలు విసరడం ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ గా మార్చింది. నవంబర్ 3 మధ్యంతర ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు రోజులకే, నవంబర్ 5న ఆమె పార్టీ సభ్యులకు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలను తీవ్రమైన ఎదురుదెబ్బగా అభివర్ణిస్తూ, అసలు ఏం తప్పు జరిగిందో నిజాయతీగా సమీక్షించాలని డిమాండ్ చేశారు.
విషయం ట్రంప్ జుట్టు గురించి కాదు!
చూస్తుంటే ఇదంతా ట్రంప్ హెయిర్, మేకప్ కోసం ఖర్చు చేసిన రూ.53,00,000 చుట్టూ మొదలైన వివాదంలా కనిపిస్తోంది. కానీ అసలు విషయం అంతకంటే పెద్దది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నేతలు ఖర్చుల లెక్కలు అడుగుతున్నారు. నాయకత్వం మాత్రం ఆ ఖర్చులను సమర్థించుకుంటోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







