H-1B ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ఆశలపై కొత్త ఆంక్షలు!
అమెరికాలో ఉద్యోగం సంపాదించాలి.. మంచి జీతం అందుకోవాలి.. కొన్నేళ్లు కష్టపడి అక్కడే స్థిరపడేందుకు గ్రీన్ కార్డ్ కూడా తెచ్చుకోవాలి. చాలామంది భారతీయ ఐటీ ఉద్యోగుల కల ఇదే! కానీ ఈ కలను నిజం చేసుకోవడం ఇప్పుడు మరింత కష్టమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే H-1B వీసా నిబంధనలతో విదేశీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు వారి తరఫున గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే కంపెనీలపైనా గురిపెట్టింది. విదేశీయులను నియమించుకోవాలంటే కంపెనీలు ఇకపై గతంలో కంటే ఎక్కువ నిబంధనలు పాటించాల్సి రావచ్చు. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులే కాదు.. అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నవారిలోనూ కొత్త టెన్షన్ మొదలైంది.
తాజాగా అమెరికా కార్మిక శాఖ (Department of Labor – DOL) నవంబర్ 16న ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కీలక మార్పులను ప్రతిపాదించింది. ముఖ్యంగా PERM విధానాన్ని మరింత కఠినతరం చేయాలని చూస్తోంది. మరోవైపు H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ కార్యక్రమాలను దుర్వినియోగం చేస్తున్నాయని అనుమానాలున్న మరిన్ని కంపెనీలు, విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ ఉన్నతాధికారి హెచ్చరించడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. అసలు అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పులేంటి? వీటివల్ల భారతీయ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి?
గ్రీన్ కార్డ్ కోసం ఇక మూడు నెలలు ఎదురుచూడాల్సిందేనా?
అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునేవారికి కంపెనీ స్పాన్సర్షిప్ చాలా ముఖ్యం. ముఖ్యంగా EB-2, EB-3 కేటగిరీల్లో గ్రీన్ కార్డ్ పొందాలంటే PERM ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడీ ప్రక్రియనే అమెరికా ప్రభుత్వం మరింత కఠినతరం చేయాలని చూస్తోంది. సాధారణంగా ఒక కంపెనీ విదేశీ ఉద్యోగికి శాశ్వతంగా ఉద్యోగం ఇవ్వాలంటే, అదే పని చేయడానికి అర్హత ఉన్న అమెరికన్లు అందుబాటులో లేరని ముందుగా నిరూపించాలి. అందుకోసం ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి, స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారిలో తగిన అర్హతలున్నవారు లేరని నిర్ధారించుకోవాలి.
ఇవి కూడా చదవండి
అయితే కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ వ్యవహారం కంపెనీలకు మరింత భారంగా మారుతుంది. ఇప్పటివరకు కనీసం 30 రోజులపాటు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉండగా, ఆ గడువును 90 రోజులకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే విదేశీ ఉద్యోగిని నియమించుకోవడానికి ముందు అమెరికన్ అభ్యర్థుల కోసం దాదాపు మూడు నెలలపాటు వెతకాల్సి రావచ్చు. అంతేకాదు, కంపెనీ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇతర జాబ్ పోర్టల్స్‌లోనూ ఉద్యోగ వివరాలను ప్రచురించాలి. అభ్యర్థులను ఆకర్షించడానికి సాధారణంగా ఉపయోగించే రిక్రూట్మెంట్ మార్గాలన్నింటినీ అనుసరించడంతోపాటు, ఆ ఉద్యోగానికి ఇచ్చే జీతం ఎంతన్నది కూడా ప్రకటనలో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే కంపెనీలకు అదనపు పని, ఖర్చు రెండూ పెరిగే అవకాశముంది.
అమెరికన్లను తొలగించి.. విదేశీయులను తీసుకుంటే కుదరదు!
ఇక్కడే అమెరికా ప్రభుత్వం మరో కీలకమైన మెలిక పెట్టింది. ఒక కంపెనీ గత రెండేళ్లలో ఒకే ప్రాంతంలో అదే వృత్తికి లేదా దానికి దగ్గరగా ఉండే ఉద్యోగాల్లో అమెరికన్ ఉద్యోగులను తొలగించి ఉంటే, మళ్లీ అలాంటి స్థానాల్లో విదేశీయులను నియమించుకోవడానికి PERM సర్టిఫికేషన్ పొందడం కష్టమవుతుంది. అంటే ఒకవైపు అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, మరోవైపు అదే పనుల కోసం విదేశీ నిపుణులను తీసుకుంటామంటే ఇక అంత సులభంగా కుదరకపోవచ్చు.
ఈ నిబంధన ముఖ్యంగా టెక్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఎన్నో టెక్నాలజీ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో విదేశీ నిపుణుల నియామకాలు కూడా కొనసాగించాయి. ఇప్పుడు కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే.. గతంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీలు భవిష్యత్తులో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలంటే అదనపు అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం రిజిస్టర్డ్ నర్సులు, ఫిజికల్ థెరపిస్టుల వంటి కొన్ని వృత్తులకు Schedule A కింద ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. వీరిని నియమించుకునే కంపెనీలు సాధారణ PERM లేబర్ మార్కెట్ పరీక్షను దాటవచ్చు. కానీ ఈ వెసులుబాటును కూడా తొలగించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అదే జరిగితే ఈ రంగాల్లో పనిచేస్తున్న విదేశీ నిపుణులకూ గ్రీన్ కార్డ్ ప్రక్రియ మరింత కష్టమవుతుంది.
కంపెనీలపై అమెరికా నిఘా.. మరిన్ని సస్పెన్షన్లు తప్పవా?
PERM నిబంధనలను మార్చడమే కాకుండా, ఇప్పటికే ఉన్న H-1B, గ్రీన్ కార్డ్ కార్యక్రమాలను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై కూడా అమెరికా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నవంబర్ 14న అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై మరింత చర్చకు దారితీశాయి. H-1B, PERM కార్యక్రమాల్లో అక్రమాలకు పాల్పడుతున్నాయని అనుమానాలున్న మరిన్ని కంపెనీలు, విద్యాసంస్థలను ఈ కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికన్ ఉద్యోగులు అందుబాటులో లేనప్పుడు మాత్రమే కంపెనీలు H-1B వీసాలను ఉపయోగించుకోవాలని, విదేశీ ఉద్యోగులపై ఆధారపడటాన్ని సాధారణ వ్యాపార విధానంగా మార్చుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ కంపెనీలపై PERM కార్యక్రమానికి సంబంధించి సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ప్రక్రియపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇలాంటి చర్యలు మరిన్ని సంస్థలకు విస్తరించే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో కంపెనీలతోపాటు ఉద్యోగుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. అయితే తదుపరి ఏ సంస్థలపై చర్యలు తీసుకుంటారన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు.
అసలు కంపెనీలు చేస్తున్న తప్పులేంటి?
అమెరికా అధికారులు కంపెనీలపై ఎందుకు ఇంతగా దృష్టి పెట్టారన్నది కూడా తెలుసుకోవాలి. కొందరు యజమానులు తప్పుడు వివరాలతో వీసా దరఖాస్తులు సమర్పిస్తున్నారని, ఉద్యోగులకు చెల్లించే జీతంలో కొంత మొత్తాన్ని తిరిగి తమకే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్యోగుల వేతనాల్లో అక్రమంగా కోతలు విధిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. H-1B వీసాపై ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చి, అక్కడికి వెళ్లిన తర్వాత సరైన పని అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సమయంలోనూ చట్టప్రకారం వారికి చెల్లించాల్సిన జీతాలు ఇవ్వడం లేదన్న అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారా? అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత కంపెనీలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.
ఇవి కూడా చదవండి
భారతీయ ఐటీ ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కలలకు గండమేనా?
ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా చర్చకు వస్తున్నది భారతీయుల గురించే. ఎందుకంటే అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న విదేశీ నిపుణుల్లో భారతీయుల వాటా చాలా ఎక్కువ. ఇన్ఫోసిస్, TCS, విప్రో, హెచ్‌సీఎల్ వంటి భారతీయ ఐటీ కంపెనీలు కూడా అమెరికాలోని క్లయింట్లకు సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం రిక్రూట్మెంట్ విధానాలు, వేతనాలు, ఉద్యోగుల వాస్తవ పని తీరుపై నిఘా పెంచితే ఈ కంపెనీల వ్యాపార విధానాలపైనా ప్రభావం పడవచ్చు.
ముఖ్యంగా అమెరికాలో కొత్తగా ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి పరిస్థితులు కొంత క్లిష్టంగా మారవచ్చు. ఇప్పటికే అక్కడ H-1B వీసాపై పనిచేస్తూ, కంపెనీ ద్వారా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా ఆందోళన తప్పకపోవచ్చు. ఎందుకంటే కంపెనీలపై ఆంక్షలు పెరిగితే ఉద్యోగుల తరఫున గ్రీన్ కార్డ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడే భయపడాలా? అసలు కథ ఇంకా మిగిలే ఉందా?
PERM విధానంలో అమెరికా కార్మిక శాఖ ప్రతిపాదించిన మార్పులు ప్రస్తుతానికి ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటిపై ప్రజలు, కంపెనీలు తమ అభిప్రాయాలను తెలియజేసిన తర్వాతే తుది నిబంధనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 రోజుల ప్రకటనల గడువు 90 రోజులకు పెరిగిందని, కొత్త నిబంధనలన్నీ అమల్లోకి వచ్చాయని ఇప్పుడే చెప్పలేం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







