కోటి కుటుంబాలకు ‘ఇందిరమ్మ’ రక్షణ కవచం
సామాజిక భద్రతా పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన, సమగ్రమైన మార్పుకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇదే వేదికపై మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఉపాధి హామీ కూలీలు, రైతులు, కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం విడివిడిగా పథకాలు ఉండటం వల్ల పరిపాలనాపరమైన జాప్యం జరగడంతో పాటు, కొందరు అర్హులు పథకాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, వివిధ శాఖల పరిధిలోని అన్ని బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు అమలవుతున్న పథకాల కింద సాధారణ మరణానికి రూ. 2 లక్షల వరకు జీవిత బీమా, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాలను యథాతథంగా కొనసాగిస్తూనే, జీవిత బీమా పరిమితిని రూ. 2 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఈ మార్పు వల్ల కుటుంబ పెద్దను కోల్పోయిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించనుంది. ముఖ్యంగా గతంలో ఏదైనా ప్రభుత్వ బీమా పథకంలో లబ్ధిదారులుగా ఉన్న ఏ ఒక్కరినీ కొత్త విధానంలో తొలగించకూడదని సీఎం అధికారులను ఆదేశించారు.
పథకం ప్రకటనతోనే సరిపెట్టకుండా, దరఖాస్తుల స్వీకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ స్థాయిలోనే ఇందిరమ్మ బీమా దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని, పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. అదేవిధంగా, ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలోనూ ఎక్కడా అలసత్వం వహించకూడదని, అన్ని జిల్లాలకు వెంటనే చీరలను తరలించి అర్హులైన ప్రతి మహిళకు అందేలా చూడాలని సీఎం హెచ్చరించారు. పంపిణీ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సంక్షేమ కార్యక్రమాల ప్రారంభానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే సిద్దిపేటను ఎంచుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట గడ్డపై నుంచే కోటి కుటుంబాలకు బీమా, మహిళలకు చీరల పంపిణీ వంటి ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించడం ద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న పట్టును చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమంగానే కాకుండా, రాష్ట్రంలోని మెజారిటీ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఒక బృహత్తర సామాజిక భద్రతా కార్యక్రమంగా మారనుంది. అయితే, కోటి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా కల్పించడంలో ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని ఎలా భరిస్తారు.. క్షేత్రస్థాయిలో అర్హులందరికీ ఎటువంటి అవినీతి, జాప్యం లేకుండా ఎలా అందిస్తారు.. అనేది ప్రభుత్వానికి అసలైన పరీక్షగా నిలవనుంది.







