మునగాకు, కొబ్బరితో అదిరిపోయే పచ్చడి.. రుచి చూస్తే వదలరు!
మునగాకు అనగానే కొందరు తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ అదే మునగాకును పచ్చికొబ్బరితో కలిపి పచ్చడి చేస్తే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే ఆ రుచే వేరు. పోషకాలు అందించే మునగాకును రుచికరంగా తినాలనుకునేవారు ఈ కొబ్బరి పచ్చడిని తప్పకుండా ప్రయత్నించవచ్చు.
మునగాకులో పోషకాలు ఎన్నో!
మునగాకులో ప్రోటీన్, పీచు పదార్థంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా శరీరానికి ఉపయోగపడతాయి. మునగాకులో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
మునగాకు కొబ్బరి పచ్చడి ఇలా చేస్తే.. రుచి అదుర్స్!

ఈ పచ్చడి తయారీకి ముందుగా ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో శుభ్రంగా కడిగిన మునగాకు, చిటికెడు పసుపు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత తురిమిన పచ్చికొబ్బరి వేసి తక్కువ మంటపై లైట్‌గా వేయించి చల్లారనివ్వాలి.
ఇవి కూడా చదవండి
ముందుగా వేయించిన పప్పులు, ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీలో కొద్దిగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత వేయించిన మునగాకు, కొబ్బరి మిశ్రమం, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క, నానబెట్టిన చింతపండు వేసి మరోసారి రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రోటిపచ్చడి మాదిరిగా ఉండేలా చూసుకోవాలి.
వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే..

ఈ పచ్చడికి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు లేకుండానూ తినవచ్చు.
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ మునగాకు కొబ్బరి పచ్చడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కొబ్బరి తీపి, చింతపండు పులుపు, ఎండుమిర్చి కారం కలిపి ఈ పచ్చడికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. చపాతీ, దోశ, ఇడ్లీతో కూడా ఈ పచ్చడిని సైడ్ డిష్‌గా ఆస్వాదించవచ్చు. ఇంట్లో మునగాకు ఉన్నప్పుడు ఈ సులభమైన రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి!







