Instagram లో ఆ చీకటి ఆటకు బ్రేక్? కేంద్రం సీరియస్, మెటా కీలక నిర్ణయం!
రాత్రి పడుకునే ముందు ఓ చిన్న రీల్ చూద్దామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. కానీ ఒక్కో రీల్ దాటుతుంటే బోల్డ్ వీడియోలు, అసభ్యకరమైన పోస్టులు, హింసను రెచ్చగొట్టే కంటెంట్ ఎదురవుతుంటుంది. చూడకపోయినా అవే మళ్లీ మళ్లీ ఫీడ్‌లోకి వస్తుంటే? ఇది కేవలం చిరాకు కలిగించే విషయమే కాదు.. ముఖ్యంగా చిన్నారులు, యువతపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి కంటెంట్‌కు ఇక చెక్ పెట్టాలని మెటా రంగంలోకి దిగింది. భారత్‌లో ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్నే మార్చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ మార్పులతో ఏం జరగబోతోంది?
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మార్పులు..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా.. భారత్‌లో ఇన్స్టాగ్రామ్ కంటెంట్ రికమండేషన్ వ్యవస్థను మార్చినట్లు ప్రకటించింది. ఇకపై యూజర్లకు బోల్డ్, అసభ్యకరమైన, హింసను ప్రేరేపించే కంటెంట్ తక్కువగా కనిపించేలా చర్యలు తీసుకోనుంది.
దీనికోసం మరింత అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను ఉపయోగిస్తోంది. ఇవి అభ్యంతరకరమైన పోస్టులు, వీడియోలను గుర్తించి.. వాటిని యూజర్లకు సిఫార్సు చేయకుండా ఫిల్టర్ చేస్తాయి.
కేంద్ర ప్రభుత్వ సూచనలతోనేనా?
ఈ మార్పుల వెనుక కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో భారత ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ విషయంలో మెటాకు కీలక సూచనలు చేసింది. హింసను ప్రేరేపించే లేదా దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న కంటెంట్‌పై మరింత కఠినమైన పర్యవేక్షణ ఉండాలని కోరింది.
ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) అక్టోబర్ 10న మెటాకు అడ్వైజరీ జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ ర్యాంకింగ్, రికమండేషన్ విధానాలను సమీక్షించాలని సూచించింది.
ముఖ్యంగా తప్పుడు సమాచారం, మార్ఫింగ్ చేసిన వీడియోలు, సందర్భం మార్చి ప్రచారం చేసే పోస్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు.. యూజర్లకు ఒకే తరహా అభిప్రాయాలు లేదా పరిమితమైన కథనాలు పదేపదే కనిపించకుండా చూడాలని కూడా కోరింది.
కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తారా?
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మెటా తీసుకున్న నిర్ణయం అంటే ఇలాంటి కంటెంట్‌ను ఇన్స్టాగ్రామ్ నుంచి పూర్తిగా తొలగించడం కాదు. ఆ పోస్టులను యూజర్లకు సిఫార్సు చేసే విధానాన్ని నియంత్రించడమే ప్రధాన ఉద్దేశం.
ముఖ్యంగా యూజర్లు ఫాలో అవ్వని అకౌంట్ల నుంచి వచ్చే పోస్టులు, రీల్స్ విషయంలో ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే గత ఏడాది కాలంగా యూజర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డిఫాల్ట్ సేఫ్టీ సెట్టింగ్స్‌ను బలోపేతం చేసినట్లు మెటా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
రికమండేషన్లు 50 శాతం తగ్గాయట!
మెటా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌లో ఇన్స్టాగ్రామ్ యూజర్లకు సిఫార్సు చేస్తున్న కంటెంట్ దాదాపు 50 శాతం తగ్గింది. అయితే ఈ లెక్కలకు సంబంధించిన పూర్తి డేటా లేదా గణాంకాలను మాత్రం కంపెనీ బయటపెట్టలేదు.
మరోవైపు, తాజాగా తీసుకున్న మార్పులను కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీకి నేరుగా అనుసంధానిస్తూ మెటా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇకపై ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఎలా ఉండబోతోంది?
ఇన్నాళ్లూ మనం ఏ వీడియో చూస్తున్నాం? ఎక్కడ ఎక్కువసేపు ఆగుతున్నాం? అనే అంశాల ఆధారంగా ఇన్స్టాగ్రామ్ మరిన్ని వీడియోలను మనకు సిఫార్సు చేస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు మనకు ఇష్టం లేని లేదా అభ్యంతరకరమైన కంటెంట్ కూడా ఫీడ్‌లోకి వచ్చేస్తుంది.
అయితే తాజా మార్పులతో అలాంటి కంటెంట్ సిఫార్సులను తగ్గించాలని మెటా భావిస్తోంది. ముఖ్యంగా యువత, చిన్నారులకు అనుచితమైన వీడియోలు పదేపదే కనిపించకుండా చేయడంలో ఈ చర్యలు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.
ఎందుకంటే సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, మన ఆలోచనలు, అలవాట్లపై కూడా ప్రభావం చూపుతోంది. మరి మెటా తీసుకున్న ఈ కొత్త నిర్ణయం నిజంగా ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత సురక్షితమైన వేదికగా మారుస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







