బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన అక్వాన్ తుపాను..!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Akvan) తుపాను మరింత బలపడి శక్తివంతమైన తీవ్ర తుపానుగా (Severe Cyclonic Storm) రూపాంతరం చెందింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది చెన్నైకి సుమారు 570 కి.మీ, మచిలీపట్నానికి 590 కి.మీ, విశాఖపట్నానికి 580 కి.మీ అలాగే ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ తుపాను తన గమనాన్ని మరింత స్పష్టం చేస్తూ, ఎల్లుండి మధ్యాహ్నానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ – యానాం మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్య, ముఖ్యంగా నర్సాపూర్ – పూరీ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో (కొన్నిసార్లు 120 కి.మీ వేగంతో) తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
అక్వాన్ తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు గల కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేసేందుకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని, తదుపరి సూచనలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.







