ఆర్థిక సంక్షోభం దిశగా భారత్.. అమెరికా పర్యటనలో రాహుల్ విమర్శలు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరోసారి విదేశీ గడ్డపై నుంచి కీలక కామెంట్స్ చేశారు. బయటకు కనిపిస్తున్నదంతా నిజం కాదని..భారత్ ఆర్థిక సంక్షోభం వైపు పయనిస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో విద్యా వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, తీవ్ర నిరుద్యోగ సమస్య (Unemployment Education Crisis)లను ప్రస్తావించారు. ప్రభుత్వం కాదన్నా.. మీడియా ఈ విషయాన్ని పక్కన పెట్టినా.. భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉందనేది వాస్తవమన్నారు. అదే సమయంలో భారీగా నిరుద్యోగ సమస్య, విద్యా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయన్నారు. వీటి వల్ల దేశంలోని లక్షలాదిమంది మధ్యతరగతి యువత తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. ఆ నిరాశే ప్రభుత్వం పట్ల అసహనంగా మారుతోందని తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘దేశంలోని సమస్యలపై మేము అధ్యయనం చేస్తున్నాం. కానీ అసలు సమస్య ఏమిటంటే.. భారత విద్యార్థులకు దేశంలో భవిష్యత్తు ఏమాత్రం కనిపించట్లేదు. సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగం, పరిమితమైన ఉద్యోగ అవకాశాలు, విద్యా వ్యవస్థలో లోపాలు అనేవి విస్మరించడానికి వీలుకాని తీవ్రమైన సవాళ్లు’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్నికల సంఘం సాయంతోనే ఓటుచోరీ..
‘ఎన్నికల సంఘం సాయంతోనే అధికార బీజేపీ దేశంలో ఓటుచోరీకి పాల్పడుతోంది. 2024లో ఓటు వేసిన 14 కోట్ల మంది ప్రజలను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎన్నికను ఎలా చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించగలరని మేము ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాం. అయినా, వారు దీనిపై మౌనం వహిస్తున్నారు. ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించాలంటే ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలి. అందుకోసమే మేము పోరాడుతున్నాం. భారత ఎన్నికల్లో మోసాలు చోటుచేసుకుంటున్నాయని నిరూపించడానికి మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని కీలక అధికారులే ఈ సమాచారం ఇచ్చారు. అయితే ప్రభుత్వానికి భయపడి వారు బయటకు రావట్లేదు. కానీ భారత యువత మాత్రం అలా కాదు. సమాజంలో జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏకమయ్యారు. విద్యార్థి ఉద్యమాన్ని లేవనెత్తారు’ అని రాహుల్ పేర్కొన్నారు.







