గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై(Chandrababu Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన అత్యంత దుర్మార్గంగా సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ రాయలసీమ నుంచి పల్నాడు వరకు అఖండ బలాన్ని పుంజుకుందని, అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని, పంచాయతీ ఎన్నికల్లో బరితెగించి వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
విద్యారంగం మరియు సంక్షేమ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వంపై కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండున్నర ఏళ్లుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు ఇద్దరూ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించేశామని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే, త్వరలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
ఇదే సమయంలో రాజకీయ విమర్శల స్థాయిపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. గతంలో తమ కుటుంబ సభ్యులపై జరిగిన సోషల్ మీడియా అసభ్య పోస్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో గుక్కపట్టి ఏడ్చిన నాయకులు ఇప్పుడు వైఎస్ భారతమ్మను కించపరుస్తూ జన సైనికులు అసభ్యకరంగా మాట్లాడుతుంటే పళ్లు ఇకిలించి చూస్తూ ఊరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ సత్తా ఏంటో స్పష్టంగా తెలిసేదని, బలవంతంగా, డబ్బులతో, పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచినవారు రెండున్నర ఏళ్ల తర్వాత రాజీనామా చేసి ఇళ్లకు పారిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ సమయంలో పార్టీ శ్రేణులందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.







