ట్రంప్ తీరుతో మోదీ అసహనం? ఫిలిప్పీన్స్‌లో విచిత్ర సీన్! ఏం జరిగిందంటే…
ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మరోవైపు జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు. నలుగురూ కలిసి ఓ ఫొటో దిగితే కార్యక్రమం అయిపోయినట్లే. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం కెమెరాల ముందు నుంచి కదలాలని అనిపించలేదు. విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కొక్కరికి సమాధానాలు చెబుతూ తనదైన షో మొదలుపెట్టారు. పక్కనే ఉన్న మోదీ ఒకటికి రెండుసార్లు సమావేశానికి వెళ్దామన్నట్లుగా సైగలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ట్రంప్‌ను ఆపాల్సింది ఆయన సహాయకులే! అసలు ఓ చిన్న ఫొటో సెషన్‌ను ట్రంప్ ఎలా పది నిమిషాల ప్రెస్‌మీట్‌గా మార్చేశారు? అసలేం జరిగింది
నాలుగు దేశాల నేతలు రెడీ.. ట్రంప్ మాత్రం విలేకరులతో బిజీ!
నవంబర్ 17న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న ట్రంప్.. భారత్, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో కలిసి క్వాడ్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా సిద్ధంగా ఉన్నారు.
నలుగురు కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో దిగడం, ఆ తర్వాత సమావేశ మందిరంలోకి వెళ్లడం కార్యక్రమం. కానీ ఫొటో దిగిన తర్వాత అక్కడున్న విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫొటో సెషన్ ముగియగానే నేతలు లోపలికి వెళ్లిపోతారు. కానీ ట్రంప్ మాత్రం విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. ఒక్కో జర్నలిస్టును పిలుస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు.
మోదీ సైగలు చేస్తున్నా.. ట్రంప్‌కు మాత్రం వినిపించలేదా?
ఇలా ట్రంప్ మాట్లాడుతూనే ఉండటంతో పక్కనే ఉన్న మోదీకి కాస్త ఇబ్బందిగా అనిపించినట్లుంది. సమావేశానికి వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతుండటంతో ఆయన ట్రంప్‌తో పాటు మిగతా నేతలకు కూడా లోపలికి వెళ్దామన్నట్లుగా సైగలు చేశారు. ఒక సందర్భంలో “వెళ్దామా?” అని కూడా అడిగారు.
కానీ ట్రంప్ మాత్రం తన ధోరణి మార్చుకోలేదు. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఉన్నారు. మధ్యలో మోదీ వైపు తిరిగి, “చూడండి.. నాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. చాలా కఠినమైన ప్రశ్నలు” అంటూ వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న మోదీ, తకైచి, అల్బనీస్ మాత్రం ఆయన మాట్లాడటం పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఈ దృశ్యాలు చూసిన వారికి ఒక విషయం స్పష్టంగా కనిపించింది. నలుగురు నేతలు కలిసి చర్చించాల్సిన కీలక అంశాల కంటే, ఆ సమయంలో ట్రంప్‌కు మీడియాతో మాట్లాడటమే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లుంది!
40 నిమిషాల సమావేశంలో 10 నిమిషాలు ఇక్కడే హరీ!
ఈ ఘటనపై భారత వార్తా ఛానెల్ న్యూస్18లో కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్వాడ్ నేతలకు పరిమిత సమయం మాత్రమే ఉందని, ప్రతి నిమిషం కీలకమని వ్యాఖ్యాతలు గుర్తుచేశారు. మొత్తం 40 నిమిషాల పాటు జరగాల్సిన చర్చలో దాదాపు 10 నిమిషాలు ట్రంప్ నిర్వహించిన ఈ అనూహ్య ప్రెస్‌మీట్‌కే పోయాయని విశ్లేషించారు.
మోదీ ఆ సమయంలో స్పష్టంగా అసౌకర్యంగా కనిపించారని మరో వ్యాఖ్యాత అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ను ఆయన సిబ్బంది వచ్చి ఆపకపోతే మరిన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేవారని వ్యాఖ్యానించారు. అంటే.. మిగతా నేతలు సమావేశం కోసం ఎదురుచూస్తుంటే, ట్రంప్ మాత్రం తన మీడియా సెషన్‌ను కొనసాగించడంలోనే బిజీగా ఉన్నారన్నమాట.
అమెరికాలో సమస్యలున్నా.. ట్రంప్ మాత్రం లైట్ తీసుకున్నారు!
ఈ ప్రెస్మీట్లో అమెరికాలో చోటుచేసుకున్న సాంకేతిక అంతరాయాలపైనా విలేకరులు ప్రశ్నించారు. మైక్రోసాఫ్ట్ సేవలు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన సమస్యల గురించి అడిగితే ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. “ఇదంతా జీవితంలో భాగమే” అన్నట్లుగా స్పందించారు.
“మీరు పెద్దగా, శక్తిమంతంగా ఉన్నప్పుడు.. మీ దగ్గర చాలా డబ్బు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అదేం పెద్ద విషయం కాదు” అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చైనా ఆధిపత్యంలో ఉన్న అరుదైన ఖనిజాల రంగం గురించి ప్రస్తావించారు. మరో 10 నెలల్లోనే చైనాను అందుకుంటామని, అమెరికాకు అవసరమైనవన్నీ సమకూర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మైనింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు చైనాకు ఉన్న ఆధిపత్యాన్ని చూస్తే ఇంత తక్కువ సమయంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మోదీని పొగిడారు.. కానీ భారత్‌తో ట్రంప్‌కు విభేదాలూ ఉన్నాయి!
ఇక మాటల మధ్యలో ట్రంప్ తనదైన శైలిలో ప్రశంసలు కూడా కురిపించారు. మోదీని “చాలా కఠినమైన వ్యక్తి” అని అభివర్ణించారు. జపాన్ ప్రధాని తకైచి కూడా అంతకంటే కఠినంగా ఉండొచ్చని అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ను ఉద్దేశించి “మా సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే భారత్, అమెరికా మధ్య ఇటీవల సంబంధాలు అంత సాఫీగా లేవు. భారత వస్తువులపై ట్రంప్ భారీ సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. మరోవైపు పాకిస్థాన్‌తో ట్రంప్ ప్రభుత్వం సన్నిహితంగా వ్యవహరించడం కూడా భారత్‌కు అసంతృప్తి కలిగించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలను మళ్లీ మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సమావేశం వెనుక చైనా అంశమే అసలు కీలకం!
నిజానికి ఈ ఫొటో సెషన్‌కు అంత ప్రాధాన్యత రావడానికి కారణం క్వాడ్ సమావేశమే. రెండేళ్ల తర్వాత నాలుగు దేశాల నేతలు మళ్లీ ఒకే వేదికపై సమావేశమయ్యారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, అరుదైన ఖనిజాల సరఫరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సముద్ర భద్రత, సైనిక సహకారం వంటి కీలక అంశాలు వారి చర్చల్లో ఉన్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మధ్య సహకారం చాలా అవసరం. అలాంటి కీలక సమావేశానికి ముందు జరిగిన ఈ చిన్న సంఘటన మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







