గ్లోబల్ సమ్మిట్ వాయిదా వేయండి.. పౌర సమాజం డిమాండ్!
ఎల్ నినో వల్ల రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన కరువు, తాగునీటి ఎద్దడి, విద్యుత్ కొరత వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో వేలాది మంది ప్రతినిధులతో భారీ ఎత్తున ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును తక్షణమే రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతూ సుమారు 400 మంది మేధావులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
అక్టోబర్ 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో ఏకంగా 365 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రే రాష్ట్రంలో సుదీర్ఘ తాగునీటి సంక్షోభం నెలకొందని, ఇది 2027 జూలై వరకు కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా, నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలను సాగు చేయవద్దని రైతులకు సూచించారు. ఒకవైపు ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతుంటే, మరోవైపు అంతర్జాతీయ సదస్సుల పేరిట ఆర్భాటాలకు పోవడాన్ని పౌర సమాజం తీవ్రంగా తప్పుబడుతోంది.
ఇవి కూడా చదవండి
డిసెంబర్ 7 నుంచి 9 వరకూ జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌కు దాదాపు 4,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరికి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడం వల్ల ఇప్పటికే కొరతగా ఉన్న నీరు, విద్యుత్, ప్రజా వనరులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రతి ప్రతినిధికి ఒక ప్రభుత్వ అధికారిని కేటాయించాలన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా, మండల స్థాయి అధికారులు, మున్సిపల్, పంచాయతీ సిబ్బంది అతిథుల సేవల్లో నిమగ్నమైతే, క్షేత్రస్థాయిలో కరువు సహాయక చర్యలు, తాగునీటి సరఫరా పర్యవేక్షణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే నవంబర్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో ‘భారత్ సమ్మిట్’ నిర్వహించారని, కరువు వేళ మరో భారీ ఈవెంట్‌ను తట్టుకునే స్థితిలో రాష్ట్రం లేదని వారు స్పష్టం చేశారు.
ఈ సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 8న ‘ఎల్ నినో, వాతావరణ మార్పులు- కరువు’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనుండటం గమనార్హం. రాష్ట్రంలో వాస్తవంగా కరువు తాండవిస్తుంటే, దాని నివారణకు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన యంత్రాంగాన్ని పక్కనపెట్టి, ఏసీ గదుల్లో కరువుపై చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం రాసిన ఈ బహిరంగ లేఖలో ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, ఆకునూరి మురళి, కె. బాబూరావు, లలితా రాందాస్, రుక్మిణి రావు, సాగరి రాందాస్, కన్నెగంటి రవి, ఖలీదా పర్వీన్, కిరణ్ కుమార్ విస్సా, మీరా సంఘమిత్ర వంటి ప్రముఖులతో పాటు, జాతీయ స్థాయి మేధావులు ఇ.ఎ.ఎస్.శర్మ, ప్రఫుల్ల సమంతారా, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, సౌమ్య దత్తా, ప్రొఫెసర్ షంషుల్ ఇస్లాం తదితరులు సంతకాలు చేశారు.
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొని, కరువు ప్రకటనను ఉపసంహరించుకునే వరకు ఈ సమ్మిట్‌ను వాయిదా వేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక, పరిపాలన, మానవ వనరులన్నింటినీ కేవలం కరువు సహాయక చర్యలకు, గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు, రైతులు, బలహీన వర్గాల జీవనోపాధి రక్షణకు మాత్రమే వినియోగించాలని వారు ప్రభుత్వానికి హితవు పలికారు. అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ ముఖ్యమే అయినప్పటికీ, ప్రజల ప్రాణాలు, జీవనోపాధి కంటే ఏదీ ఎక్కువ కాదన్న పౌర సమాజం వాదనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.







